వృద్ధుడి కాళ్లు, చేతులు కట్టేసి..
eenadu telugu news
Updated : 17/10/2021 05:44 IST

వృద్ధుడి కాళ్లు, చేతులు కట్టేసి..

రూ.50 లక్షల విలువైన సొత్తుతో నేపాలీ ముఠా పరారీ

నారాయణగూడ, న్యూస్‌టుడే: పని మనుషులుగా వచ్చి, వృద్ధుడి కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డ కుక్కి బంగారు, వజ్రాల ఆభరణాలు, నగదు దోచుకున్న ఘటన సైఫాబాద్‌ ఠాణా పరిధిలోని చోటుచేసుకుంది. ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వస్త్ర వ్యాపారి యజ్ఞ అగర్వాల్‌ ఆయన భార్య, పిల్లలు, తాత ఓం ప్రకాష్‌ అగర్వాల్‌, నాయనమ్మ చింతలబస్తీలోని అయిదు అంతస్తుల భవనంలో ఉంటున్నారు. ఇరవై రోజుల క్రితం నేపాల్‌కు చెందిన భార్యాభర్తలు దీపేష్‌, నిఖిత వారి ఇంట్లో కాపలాదారులుగా చేరారు. కొద్ది రోజులుగా యజ్ఞ తాత ఆరోగ్యం బాగాలేకపోవడంతో సహాయంగా రాత్రి వేళ దీపేష్‌ ఉంటున్నాడు. శుక్రవారం పండగ హడావుడి ముగించుకొని యజ్ఞ తన భార్యా పిల్లలతో అయిదో అంతస్తులో నిద్రించారు. 4వ అంతస్తులో ఓంప్రకాష్‌ అగర్వాల్‌, దీపేష్‌ ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత దీపేష్‌ తన భార్య నిఖితతో పాటు ముఠా సభ్యులు ముగ్గురిని పిలిపించాడు. అయిదుగురు కలిసి వృద్ధుడి కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి, బీరువాలోని రూ.50 లక్షల విలువ చేసే బంగారు, వజ్రాల ఆభరణాలు, రూ.5 లక్షల వరకు నగదు తీసుకొని ఉడాయించారు. నాయనమ్మకు మెలుకువ వచ్చి యజ్ఞను నిద్రలేపింది. సైఫాబాద్‌ ఠాణాకు సమాచారం ఇవ్వడంతో ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి, డీఐ రాజునాయక్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. గతంలో జరిగిన ఘటనలకు, ఈ దొంగతనానికి సారూప్యత ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నేపాలీ ముఠా ఏదైనా ఇంటిని లక్ష్యంగా చేసుకొని ముందుగా ఒకరిద్దరొచ్చి పనివాళ్లగా చేరుతారు. తర్వాత తమకు తెలిసినవారిని ఆ ఇంట్లో పనికి కుదిర్చి వెళ్లిపోతారు. యజ్ఞ అగర్వాల్‌ ఇంట్లో మొదట ఛోటు, తర్వాత శక్తి పనిచేశారు. ఆ తర్వాత తమ స్నేహితులైన దీపేష్‌, నిఖితలను పనిలో పెట్టి, పథకం ప్రకారం చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


సేవకులు.. పనివాళ్ల వివరాలు చెప్పండి

ఈనాడు, హైదరాబాద్‌: ఇంట్లో పని వాళ్లను నియమించుకునేముందు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కొత్వాల్‌ అంజనీకుమార్‌ తెలిపారు. చింతల్‌బస్తీలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డ నేపాలీయుల ఉదంతం నేపథ్యంలో ఆయన ఇళ్ల యజమానులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. హైదరాబాద్‌ పోలీస్‌ అధికారిక వెబ్‌సైట్‌లోని హాక్‌ఐలో పనివాళ్ల వివరాలు నమోదు చేస్తే...వారి నేర చరిత్రను వివరిస్తామన్నారు. చరవాణిలో హాక్‌ఐని డౌన్‌లోడ్‌ చేసుకుని వివరాలు నమోదు చేయాలన్నారు. మూడేళ్లలో నేపాల్‌ వాసులపై 38 కేసులు నమోదు చేశామని వివరించారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని