ముందుచూపుతోనే పండ్ల మార్కెట్‌ తరలింపు : సబిత
eenadu telugu news
Published : 17/10/2021 04:14 IST

ముందుచూపుతోనే పండ్ల మార్కెట్‌ తరలింపు : సబిత

బాటసింగారంలో ప్రారంభమైన క్రయవిక్రయాలు


మార్కెట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్‌, తుర్కయాంజాల్‌, న్యూస్‌టుడే : ప్రభుత్వ నిర్ణయాలు ప్రజాసంక్షేమంతో ముడిపడి ఉంటాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారంలోని లాజిస్టిక్‌ పార్కులో శుక్రవారం తాత్కాలికంగా గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ ముత్యంరెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయితో కలిసి మంత్రి ప్రారంభించారు. మార్కెట్‌లో నిర్వహించిన ఆపిల్‌, పైనాపిల్‌ పండ్ల వేలం ప్రక్రియను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. గడ్డిఅన్నారం మార్కెట్‌ స్థలంలో ఆసుపత్రి నిర్మించనున్నట్లు తెలిపారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలించి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని గతంలోనే సీఎం నిర్ణయించారన్నారు. భవిష్యత్తులో ఉస్మాన్‌గంజ్‌, మహబూబ్‌గంజ్‌ మార్కెట్‌లు సైతం కోహెడకు తరలివస్తాయని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తెలిపారు. లాజిస్టిక్‌ పార్కుకు భూములిచ్చిన రైతులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ను కోరారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. గడ్డిఅన్నారం హమాలీలకు నూతన మార్కెట్‌ ప్రాంతంలోని 10 ఎకరాల్లో రెండు పడకగదుల ఇళ్లు నిర్మించడానికి సీఎం అంగీకరించారని, అక్కడే పాఠశాల, ఆసుపత్రి వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం కోహెడలో వ్యాపారులకు స్థలాల కేటాయింపు దృష్ట్యా లేఅవుట్‌ను మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు. వచ్చే ఏప్రిల్‌ నాటికి కోహెడలోనే మామిడి పండ్ల క్రయవిక్రయాలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని