పెట్రో ధరలు భగ్గు!
eenadu telugu news
Published : 17/10/2021 05:11 IST

పెట్రో ధరలు భగ్గు!

హైదరాబాద్‌లో లీటర్‌ రూ.110

ఈనాడు, హైదరాబాద్‌: పండగ రోజులను వదలకుండా పెట్రోలు ధరలను పెంచుకుంటూ పోతున్నారు. చిల్లర పెంపు పేరుతో వాహనదారుల నడ్డి విరిచేస్తున్నారు. ఇలా 16 నెలల వ్యవధిలో దాదాపు రూ.36 పెట్రోలుపై పెంచేశారు. దీంతో పెట్రోలు ధర నగరంలో రూ.110కి చేరువైంది. శివార్లలో ఇప్పటికే దాటేసింది. ఫలితంగా నిత్యావసర ధరలు ఎగబాకుతున్నాయి. రవాణా ఛార్జీలు పెరగడంతో అన్ని వస్తువులపై ఆ ప్రభావం కన్పిస్తోంది. తినకుండా.. కొనకుండా ఉండలేని పరిస్థితుల్లో సామాన్య, మధ్యతరగతివాసుల బడ్జెట్‌ తలకిందులవుతోంది. గతేడాది జూన్‌లో నగరంలో లీటర్‌ పెట్రోలు రూ.73.95 ఉండేది. ఆ నెలలో మొదలైన పెంపు 16 నెలలైనా ఆగడం లేదు.

జేబుకు చిల్లు..

కొవిడ్‌తో ప్రజారవాణా వ్యవస్థ దెబ్బతినడంతో సొంత వాహనాల వినియోగం పెరిగింది. రోజువారీ విధులకు హాజరయ్యేందుకు రుణాలు తీసుకొని మరీ వాహనాలు కొనుగోలు చేశారు. గతేడాది లాక్‌డౌన్‌ తర్వాత ఎక్కువ మంది కొన్నారు. అప్పటి నుంచి ఇంధన ధరలు పెరుగుతుండడంతో నెలవారీ పెట్రోలు ఖర్చు 50 శాతం పెరిగింది. ద్విచక్రవాహనదారులు నెలకు రూ.3 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. వాహనాలపై తిరుగుతూ వ్యాపారులు చేసుకొనేవారి పరిస్థితి మరీ దారుణం. కొత్తగా కార్లు కొన్నవారి పరిస్థితి ఇలాగే ఉంది. పొదుపు చేసిన మొత్తం బండిలో పెట్రోలు, డీజిల్‌ పోయించేందుకు వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నారు.

నిత్యావసరాలపై ప్రభావం..

ఇంధన ధరల పెంపుతో ప్రత్యక్షంగా వాహనదారులతో పాటు పరోక్షంగా అందరిపై పడుతోంది. డీజిల్‌ లీటర్‌ రూ.102.8తో సరకు రవాణాపై ప్రభావం పడింది. నిత్యావసర సరకులన్నీ భగ్గుమంటున్నాయి. వర్షాలూ తోడవడంతో టమాటా, ఉల్లిగడ్డ ధరలు పెరుగుతూ పోతున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని