ముంపు.. పొంచి ఉంది!
eenadu telugu news
Published : 17/10/2021 05:11 IST

ముంపు.. పొంచి ఉంది!

38 శాతం భవనాలకు వరద ముప్పు

 

బిట్స్‌ పిలానీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: మూడు రోజులు వర్షం పడితేనే భాగ్యనగరం అల్లాడిపోతోంది. అదే ఏకధాటిగా 17 రోజుల పాటు 440.35 మిల్లీమీటర్ల వర్షపాతం సంభవిస్తే, ఇక అంతే సంగతులు.. అవును వాతావరణంలోని మార్పులు భాగ్యనగరానికి శాపంగా పరిణమించనున్నాయి. వరుణుడు ప్రతాపం చూపిస్తే.. సుమారు 625 చదరపు కి.మీ.లు ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని భూభాగంలో సగభాగం అంటే 334 చదరపు కి.మీ. మునిగిపోవడం ఖాయం.. వరద ముంపు ప్రాంతాల్లో 38 శాతం భవనాలకు ముప్ఫే. వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా మారినప్పుడు సగం నగరం మునిగిపోతుందని బిట్స్‌ పిలానీకి చెందిన సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం పరిశోధకులు ఆర్‌.మాధురి, వై.ఎస్‌..ఎల్‌.శరత్‌ రాజా, కె.శ్రీనివాసరాజు, బి.సాయిపునీత్‌, కె.మనోజ్‌ తమ అధ్యయనంలో వెల్లడించారు. ‘వాతావరణ మార్పు ఫ్రేమ్‌వర్క్‌లోని హైడ్రోలాజికల్‌ ఇంజినీరింగ్‌ సెంటర్‌ రివర్‌ అనాలిసిస్‌ సిస్టమ్‌ 2డీ మోడల్‌ను ఉపయోగించి పట్టణ వరద ప్రమాద విశ్లేషణ’ అధ్యయనంలో దీన్ని వెల్లడించారు. అధ్యయనం ‘హెచ్‌2ఓపెన్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది.

ఏయే ప్రాంతాలంటే..

ఎక్కువగా వరదలకు గురయ్యే ప్రాంతాల్లో 1, 2, 4 జోన్లు ఉన్నాయి. ఎల్బీనగర్‌, చార్మినార్‌ జోన్‌, కూకట్‌పల్లి, అల్వాల్‌ ఉన్నాయి. నీటి కాల్వల ఆక్రమణల కారణంగా ముంపు ప్రాంతం పెరుగుతోంది. నీటి నిల్వ ప్రాంతాల్లో భూ ఆక్రమణలు 1995లో 55% ఉండగా, 2016 నాటికి 73%, 2050 నాటికి 85%కి పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడించారు.


ప్రణాళిక లేని పట్టణీకరణ కారణమే..

గత రెండు దశాబ్దాల్లో పట్టణీకరణ 16.5 శాతం పెరిగింది. ముందుచూపు లేకుండా చేపట్టిన నిర్మాణాలే ప్రస్తుత ముంపునకు కారణమవుతున్నాయని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌(ఐఐఆర్‌ఎస్‌) డెహ్రాడూన్‌కు చెందిన పరిశోధకులు సి.ఎం.భట్‌, ఎన్‌ఐటీ వరంగల్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆచార్యులు ఎన్‌.వి.ఉమామహేశ్‌, తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల అధ్యాపకులు వినయ్‌ అశోక్‌ రంగారీ తమ అధ్యయనంలో వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాలైన బేగంపేట, అమీర్‌పేట్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లి, ప్రగతినగర్‌ తదితర ప్రాంతాల్లో అధ్యయనం చేయగా 2000 సంవత్సరంలో 65 శాతం ఉపరితలం కాంక్రీట్‌మయం కాగా, 2020లో 89 శాతానికి చేరింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని