నేర వార్తలు
eenadu telugu news
Published : 17/10/2021 05:11 IST

నేర వార్తలు

అదృశ్యమైన యువతి మృతదేహం లభ్యం

జైపూర్‌(మంచిర్యాల), న్యూస్‌టుడే: నాలుగురోజుల క్రితం హైదరాబాద్‌లో అదృశ్యమైన యువతి శుక్రవారం మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలంలోని శెట్‌పల్లి-బెజ్జాల సమీపంలోని గోదావరి నదిలో శవమై తేలింది. ఎస్సై రామకృష్ణ వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మల్కాజిగిరికి చెందిన యువతి స్థానికంగా ఓ కాల్‌సెంటర్‌లో పనిచేసేది. ఈనెల 12 ఆఫీస్‌కి వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి రాసమల్ల ఎల్లయ్య కాల్‌సెంటర్‌లో ఆరా తీశారు. అక్కడికి రాలేదని నిర్వాహకులు చెప్పడంతో కంగుతిన్నారు. బెల్లంపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఇంటర్‌ చదివే సమయంలో సాదిక అనే యువకుడితో పరిచయం ఉండటంతో అతడితోనే వెళ్లి ఉంటుందని మరుసటి రోజున పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గోదావరిలో యువతి మృతదేహం లభ్యమైంది.


అత్యాచారం కేసులో ముగ్గురికి రిమాండ్‌

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: అత్యాచార ఘటనలో ముగ్గురిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్‌ సీఐ కనకయ్య వివరాల మేరకు పురానాపూల్‌కు చెందిన ఓ మహిళ(32) ఈనెల 13న హైదర్‌గూడ కల్లు కాంపౌండ్‌కు వెళ్లింది. ఆటోడ్రైవర్లు.. జగద్గిరిగుట్ట వాసి నరేష్‌(31), కూకట్‌పల్లి వాసి నర్సింగ్‌రావు(32), బాలానగర్‌ వాసి బి.ప్రసాద్‌(35) ఆమెకు మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకొని హిమాయత్‌సాగర్‌ సమీపంలోని బాహ్యవలయ రహదారి పక్కన నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి పర్సు, సెల్‌ఫోన్‌తో పరారయ్యారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

గుంటూరు, న్యూస్‌టుడే: కొరిటపాడుకు చెందిన నాగసాయి (26) హైదరాబాద్‌లో గూగుల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. ఇంటి నుంచే పనిచేస్తోంది. తండ్రి రమేష్‌ ఇటీవల కరోనాతో మృతిచెందగా అప్పటి నుంచి ఆమె కుంగుబాటులో ఉంది. నాగసాయి తల్లి విజయ బంధువుల ఇళ్లలో నిద్రల నిమిత్తం వెళుతూ సోదరి కల్యాణిని కుమార్తెకు తోడుగా ఉంచినా నాగసాయి తన గదిలో శనివారం ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు అరండల్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


‘ఫన్‌డే’లో టపాసులెందుకు?

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే ‘సండే-ఫన్‌డే’లో టపాసులు, బాణసంచా కాల్చడంపై ప్రభుత్వ శాఖలకు శనివారం న్యాయవాది బి.వి.శేషగిరి నోటీసులు పంపారు. క్లీన్‌ ఎయిర్‌ నెట్‌వర్క్‌లో సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న ఆయన.. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌, కాలుష్య నియంత్రణ బోర్డు ఛైర్మన్‌లకు పంపిన నోటీసుల్లో సెప్టెంబర్‌ 25, అక్టోబర్‌ 3న ఫన్‌డే తీరును వివరించారు.


ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి

నారాయణగూడ, న్యూస్‌టుడే: అమ్మవారి ఊరేగింపు త్వరగా ముందుకు సాగాలని చెప్పినందుకు మద్యం మత్తులో యువకుడు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. ఎస్సై భద్రయ్య వివరాల ప్రకారం.. నాంపల్లి దారుస్సాలం నుంచి అమ్మవారి ఊరేగింపు ఎక్బాల్‌ మీనార్‌ కూడలి వైపు వచ్చింది. యువకులు మద్యం తాగి నృత్యాలు చేస్తూ యాత్ర ముందుకు సాగనివ్వడం లేదు. ఇంతలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కాన్వాయ్‌ అదే దారిలో వెళుతుండటంతో విధుల్లో ఉన్న సైఫాబాద్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నాగేందర్‌ త్వరగా ఊరేగింపు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో యువకుడు కానిస్టేబుల్‌ను కొట్టడంతో ముఖానికి గాయాలయ్యాయి.


పోలీసు కస్టడీకి తెలుగు అకాడమీ నిందితులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను కొల్లగొట్టిన కేసులో నిందితులు భూపతి, వెంకటరమణ, పద్మనాభన్‌, వినయ్‌లను సీసీఎస్‌ పోలీసులు నాలుగురోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఆదివారం నుంచి వారిని విచారించనున్నారు. భూపతి, పద్మనాభన్‌, వినయ్‌.. ప్రధాన నిందితుడు సాయికుమార్‌కు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలిపేవారని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. చెన్నైకి చెందిన పద్మనాభన్‌.. తెలుగు అకాడమీ అధికారులు బ్యాంక్‌లకు రాసిన లేఖలు ఫోర్జరీ చేయడం, బ్యాంక్‌ అధికారులు ఇచ్చిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను కలర్‌ జిరాక్స్‌లు తీసి వాటిపై తేదీలను మార్చడం వంటివి చేశాడని పోలీసులు తెలుసుకున్నారు. ఈ వ్యవహారంలో నిధులు మళ్లిన తీరుపై మరింత సమాచారం సేకరించేందుకే నలుగురిని కస్టడీకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు, పోలీస్‌ కస్టడీ ముగియడంతో కెనరాబ్యాంక్‌ మాజీ మేనేజర్‌ సాధనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.


పేటీఎంకు రూ.25 వేల జరిమానా

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: పేటీఎంకు జిల్లా వినియోగదారుల కమిషన్‌-2 రూ.25 వేల జరిమానా విధించింది. జూబ్లీహిల్స్‌కు చెందిన వివేక్‌దీక్షిత్‌ క్వికర్‌లో ఓ వస్తువు కొనడానికి పేటీఎం ద్వారా రూ.6,865 నగదు బదిలీ చేశారు. వస్తువు నచ్చకపోవడంతో డబ్బు తిరిగి చెల్లించాలని అభ్యర్థించగా సంస్థ నుంచి వచ్చిన డబ్బు అతని బ్యాంకు ఖాతాలోకి బదిలీ కాలేదు. క్వికర్‌తోపాటు పేటీఎం, బ్యాంకు అధికారులను పలు దఫాలుగా సంప్రదించగా పేటీఎం బగ్‌ ఖాతాలోకి డబ్బులు మళ్లించినట్లు తెలుసుకున్న వివేక్‌... ప్రతివాద సంస్థ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. దీంఓత జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించడంతో వివేక్‌ వాదనతో ఏకీభవించి ఆయనకు రూ.6,865 తిరిగి చెల్లించడంతోపాటు రూ.25 వేల జరిమానా, కేసు ఖర్చుల కింద రూ.1,000 ఇవ్వాలని ఆదేశించింది.


ఎంజీబీఎస్‌లో దుకాణదారులకు జరిమానా!

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హెచ్చరికలను పెడచెవిన పెట్టిన దుకాణదారులపై సంస్థ కొరడా ఝళిపించింది. నిర్ణీత ధరలకంటే ఎక్కువ వసూలు చేస్తున్న ఎంజీబీఎస్‌లోని ఓ దుకాణానికి శనివారం రూ.వెయ్యి జరిమానా విధించడంతోపాటు మరో 20 దుకాణాలకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బస్టాండ్లలో అదనపు వసూళ్లపై సజ్జనార్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్పందించిన ఆయన ఇటీవల మారువేషంలో వెళ్లి ధరలు పరిశీలించారు. అదనపు వసూళ్లతోపాటు నకిలీ ఉత్పత్తులు విక్రయించొద్దని సూచించారు. అయినా మార్పు రాకపోవడంతో శనివారం ఉన్నతాధికారులు దాడులు చేసి ఓ దుకాణానికి జరిమానా విధించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని