కూరగాయల మాటున గంజాయి
eenadu telugu news
Published : 17/10/2021 05:11 IST

కూరగాయల మాటున గంజాయి

అంతరాష్ట్ర ముఠా అరెస్ట్‌.. 300 కిలోల సరకు స్వాధీనం
నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌ మీదుగా అహ్మద్‌నగర్‌కు

సరకును చూపుతున్న సీపీ అంజనీకుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: కాయగూరలు, టమాటాల రవాణా మాటున గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను హైదరాబాద్‌ పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఉత్తరమండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, మలక్‌పేట పోలీసులు మూసారంబాగ్‌ క్రాస్‌రోడ్స్‌ వద్ద లారీ డ్రైవర్‌ విలాస్‌భావ్‌, ధ్యానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు.విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు లారీలో వీరు గంజాయి రవాణా చేస్తున్నారు. లారీలోని 300కిలోల గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. కొత్వాల్‌ అంజనీకుమార్‌ వివరాలను వెల్లడించారు. అహ్మద్‌నగర్‌కు చెందిన డ్రైవర్‌ విలాస్‌భావ్‌, ధ్యానేశ్వర్‌ నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతంలోని నక్కపల్లి క్రాస్‌రోడ్స్‌ వద్ద గంజాయిని కొనుగోలు చేసి లారీలో తీసుకెళ్తున్నారని, పైన కూరగాయలు, టమాటాల ఖాళీ ట్రేలు పెట్టి.. వాటికింద గంజాయి బస్తాలను టేప్‌తో గట్టిగా సీల్‌ చేస్తున్నారని వివరించారు. నిందితులు తొలుత మహారాష్ట్ర నుంచి వైజాగ్‌కు కూరగాయలు, టమాటాలు మాత్రమే రవాణా చేసేవారు. అహ్మద్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌కు అక్కడి నుంచి వైజాగ్‌కు కూరగాయలు తీసుకువచ్చి వెళ్లేప్పుడు పూలు, పండ్లు లోడ్‌ చేసుకునేవారు. ఈక్రమంలో నర్సీపట్నంలో గంజాయి వ్యాపారి వానపల్లి నాగసాయితో ఐదునెలల క్రితం పరిచయం ఏర్పడింది. గంజాయిని రవాణా చేయడంతోపాటు విక్రయిస్తే లాభాలొస్తాయంటూ నాగసాయి చెప్పడంతో విలాస్‌భావ్‌ సరేనన్నాడు. కిలో గంజాయి రూ.1500కు ఇస్తానని, అహ్మద్‌నగర్‌, ముంబయి, పుణె నగరాల్లో విక్రయిస్తే కిలో రూ.10 వేలు వస్తుందని నాగసాయి వివరించడంతో తొలిప్రయత్నంలోనే 300కిలోల గంజాయిని విలాస్‌భావ్‌ కొన్నాడు. అహ్మద్‌నగర్‌కు తీసుకెళ్లి కిలో రూ.10వేలకు విక్రయించాడు. ఒకేసారి భారీ లాభం వచ్చింది. దీంతో అప్పటి నుంచి గంజాయి రవాణాపై దృష్టి కేంద్రీకరించాడు.

ఆరోసారి చిక్కారు... నాలుగైదుసార్లు కూరగాయలు, ఇతర సరకు, ఒక్కసారి గంజాయి తీసుకొచ్చేవాడు. ఇలా ఐదునెలల్లో ఐదుసార్లు నర్సీపట్నం నుంచి అహ్మదాబాద్‌కు గంజాయిని తరలించాడు. ఆరోసారి హైదరాబాద్‌ పోలీసులకు దొరికిపోయారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.30 లక్షలుంటుంది.

ఒడిశా డీజీపీకి పోలీసుల లేఖ... గంజాయి రవాణా కట్టడికి సహకరించాలంటూ సీపీ అంజనీకుమార్‌ ఒడిశా డీజీపీ అభయ్‌కు లేఖరాశారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తారంగా గంజాయిని పండిస్తున్నారని అక్కడి నుంచి అక్రమంగా రవాణా అవుతున్నట్టు నిందితులు తెలిపారని లేఖలో పేర్కొన్నారు. 121 మందిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి 1480కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.


వినియోగంపై సమాచారమివ్వండి: సీపీ

కళాశాలలు.. వసతిగృహాల యాజమాన్యాలకు పోలీస్‌ హెచ్చరిక

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో గంజాయి విక్రయాలను నియంత్రించేందుకు కఠినంగా వ్యవహరిస్తున్నామని కొత్వాల్‌ అంజనీకుమార్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. నెలరోజులుగా అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకడ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని వివరించారు. ధూల్‌పేట పరిసర ప్రాంతాల్లో గంజాయి అక్రమాలపై ఉక్కుపాదం మోపామని, కొన్ని కళాశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులు, యువకులు వినియోగిస్తున్నారన్న సమాచారం ఉందని తూర్పుమండలం సంయుక్త కమిషనర్‌ ఎం.రమేష్‌రెడ్డి అన్నారు. కళాశాలల యాజమాన్యాలు, వసతి గృహాల నిర్వాహకులు వివరాలు ఇవ్వని పక్షంలో వారిపై చట్టప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించారు. విక్రయాల వెనుక జహీరాబాద్‌లోని కొందరు ఏజెంట్లు, అంతరాష్ట్ర స్మగ్లర్ల హస్తముందని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు తెలిపారు.

పట్టివేత.. నలుగురిపై కేసు నమోదు..

మోతె: సూర్యాపేట జిల్లా మోతె మండల బస్టాండ్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న విశాఖ జిల్లాకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారివద్ద 15.5కిలోల గంజాయి పొట్లాలు లభించినట్లు మునగాల సీఐ ఆంజనేయులు తెలిపారు. విశాఖపట్నానికి చెందిన పంచదార్ల రమణ, శాంతి దంపతులు, అదే జిల్లా పెదగంట్యాడ మండలానికి చెందిన పిట్ట అజయ్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వీరు చింతపల్లి ఏజెన్సీ నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌లో వడ్త్యా అర్జున్‌ జాదవ్‌కు విక్రయించేందుకు తీసుకెళుతున్నట్లు అంగీకరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని