CM Kcr: ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు: కేసీఆర్‌
eenadu telugu news
Updated : 17/10/2021 20:34 IST

CM Kcr: ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు: కేసీఆర్‌

హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రెండున్నరేళ్లలో ఇంకా చేయాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. ద్విదశాబ్ది ఉత్సవాల సన్నాహకాల్లో భాగంగా తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసనసభ పక్షం సమావేశం జరిగింది. ఈసందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ...హుజూరాబాద్‌ ఉపఎన్నికలో విజయం తెరాసదేనని, ఈనెల 26 లేదా 27న ఎన్నికల సభలో పాల్గొననున్నట్టు పార్టీ నేతలకు వెల్లడించారు. తాజా సర్వే ప్రకారం తెరాసకు 13శాతానికి పైగా ఓట్లు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నేతలకు వివరించారు. ఈనెల 25న జరిగే ప్లీనరీలో 6,500 మందికి మాత్రమే ఆహ్వానం ఉంటుందని తెలిపారు. వచ్చే నెల 15న వరంగల్‌లో విపక్షాల దిమ్మతిరిగేలా 10లక్షల మందితో తెలంగాణ విజయ గర్జన సభను ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. విపక్షాల దిమ్మతిరిగేలా.. ఆరోపణలన్నింటికీ సమాధానం ఇచ్చేలా.. సుమారు 10లక్షల మందితో సభ జరుపుకోవాలన్నారు. ప్రతి గ్రామానికి ఒక బస్సు ఏర్పాటు చేసి సుమారు 20వేల బస్సుల్లో కార్యకర్తలను సభకు తీసుకురావాలన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సభ నిర్వహణ బాధ్యత చూస్తారని చెప్పారు. విజయగర్జన సభకు జనసమీకరణ, ఇతర ఏర్పాట్లపై రేపటి నుంచి తెలంగాణ భవన్‌లో రోజుకు 20 నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో కేటీఆర్‌, కేశవరావు సమావేశాలు నిర్వహిస్తారన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని