Ts News: తపాలాశాఖ ఉద్యోగులు బ్యాంకర్ల కంటే సమర్థంగా పనిచేశారు: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ 
eenadu telugu news
Updated : 17/10/2021 20:31 IST

Ts News: తపాలాశాఖ ఉద్యోగులు బ్యాంకర్ల కంటే సమర్థంగా పనిచేశారు: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ 

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కాలంలో కూడా తపాలాశాఖ బాగా పనిచేసిందని, ఆసరా పింఛన్లు లాంటి వాటిని ఇళ్ల వద్దనే చెల్లింపులు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కొనియాడారు. ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన డాక్‌ సేవా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సోమేశ్‌ కుమార్‌తో పాటు పోస్టుమాస్టర్‌ జనరల్‌ చీఫ్‌ రాజేంద్రకుమార్‌, పలువురు తపాలాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఉత్తమ సేవలు అందించి డాక్‌ సేవా అవార్డులకు ఎంపికైన 8మందికి ఈ సందర్భంగా సోమేశ్‌కుమార్‌ అవార్డులు ప్రదానం చేశారు.

పెద్దపల్లి డివిజన్‌ బ్రాంచి పోస్ట్‌ మాస్టర్‌ ఎన్‌.సునీత, కరీంనగర్‌కు చెందిన పోస్టుమెన్‌ శివకుమార్‌, హైదరాబాద్‌కు కేశగిరి బ్రాంచ్‌కు చెందిన విశ్వనాథ్‌, ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీనివాస్‌, హైదరాబాద్‌ ప్రాంతీయ తపాలా కార్యాలయంలో పని చేసే గౌస్‌ పాషా, వనపర్తి పోస్టుమెన్‌ శృతిలు అవార్డులకు ఎంపికైనట్లు తపాలా శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. తపాలా శాఖ ఉద్యోగులు బ్యాంకర్ల కంటే కూడా సమర్థంగా పని చేశారని సోమేశ్‌కుమార్‌ ఈ సందర్భంగా కొనియాడారు. కరోనా కష్టకాలంలో బ్యాంకర్లు కొంత ఇబ్బంది పెట్టినా, తపాలా శాఖ ఉద్యోగులు మాత్రం ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయడంలో కీలకపాత్ర పోషించినట్లు వివరించారు. అక్టోబరు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 29,794 పట్టాదారు పాస్‌ పుస్తకాలు రైతులకు తపాలా శాఖ ద్వారా పంపిణీ అయ్యాయని తెలిపారు. తపాలా శాఖ నుంచి భవిష్యత్తులో మరిన్ని సేవలు ప్రజలకు అందుతాయని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అవార్డులకు ఎంపికైనా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన సోమేశ్‌కుమార్‌ ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని హితభోద చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని