చిత్ర సందేశం.. ప్రజా చైతన్యం
eenadu telugu news
Published : 18/10/2021 03:58 IST

చిత్ర సందేశం.. ప్రజా చైతన్యం


బురాన్‌పూర్‌లో గోడలపై వేసిన చిత్రాలు

న్యూస్‌టుడే, కొడంగల్‌ గ్రామీణం: పల్లెల్లో పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛతా కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి దీనిపై దృష్టి సారించింది. పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ వ్యక్తిగత శౌచాలయాల నిర్మాణాలు చేపట్టారు. పంచాయతీల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగడంతో రెండేళ్ల కిందటనే బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించారు. ప్రస్తుతం ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా (ఓడీఎఫ్‌ ప్లస్‌) స్వచ్ఛతపై పంచాయతీల్లోని ప్రధాన కూడళ్లల్లో చిత్రాలు గీయిస్తూ చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. వీటిని జియోట్యాగ్‌ చేస్తూ ఎస్‌బీఎంలోని 2.0 యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈ నెల 30 వరకు పనులు పూర్తి చేస్తూ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు.ఉత్తమ చిత్రాలకు బహుమతులు ఇవ్వనున్నారు.

అవగాహన పెంచేందుకు

జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ శౌచాలయాల నిర్మాణాలు, వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టారు. వ్యక్తిగత, గ్రామాల పరిశుభ్రత, ఇంకుడు గుంతలు నిర్మించుకోవటం, ప్లాస్టిక్‌ వినియోగం నిషేధం... తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పంచాయతీల్లోని ట్రాక్టర్లతో చెత్తను సేకరిస్తున్నా, సేంద్రియ ఎరువుగా మార్చుకుని ఆదాయం పొందటంలో విఫలమవుతున్నారు. వ్యక్తిగత శౌచాలయాలు లేకపోవటంతో కలిగే నష్టాలపై ఇప్పటికే ప్రభుత్వం ప్రజల్లో అవగాహన పెంచింది. సుస్థిర పారిశుద్ధ్య పద్ధతులను అనుసరించటం, ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించి ప్రజలను చైతన్యం చేసేలా చర్యలు తీసుకుంటుంది. పర్యావరణ అనుకూల సురక్షిత, సుస్థిర, తక్కువ ఖర్చు, సాంకేతికత విధానాలను ప్రోత్సహించటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రతి పంచాయతీలో నిర్దేశించిన అంశాలపై చిత్రాలు గీస్తున్నారు.

* ఒక్కో పంచాయతీలో ఆరు అంశాలపై చిత్రాలు ● మన చుట్టూ ఉంటున్న వాతావరణమే మన భవిష్యత్తుగా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఆరు అంశాలతో చిత్రాలు గీయించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఊర్లోని ప్రధాన కూడళ్లల్లో ఒక్కో చోట ఒక్కో అంశంతో బొమ్మలు గీయిస్తున్నారు. (1) వ్యక్తిగత పరిశుభ్రత, (2) ఇంకుడు గుంతలు, (3) కాలుష్య నివారణ, (4) పశువుల పేడతో ఇందనం తయారు చేయటం, (5) ప్లాస్టిక్‌ నిషేధం, (6) వాతావరణంలో సమతుల్యం పాటించడం. చిత్రాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తే తద్వారా ఆచరణలోకి వస్తుందని అధికారులు ఆలోచన.


గడువులోగా పూర్తి చేసేందుకు కృషి

పాండు, ఎంపీఓ బొంరాస్‌పేట

ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇప్పటికే గ్రామాల్లో చిత్రాలు గీయించే పనులు కొనసాగుతున్నాయి. గడువులోగా పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాం. అన్ని గ్రామాల్లో మొదలు పెట్టడంతో గోడలపై చిత్రాలు వేయటానికి పేయింటర్ల కొరత ఏర్పడింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని