పచ్చని మోసం!
eenadu telugu news
Published : 18/10/2021 04:04 IST

పచ్చని మోసం!

మొక్కలు విక్రయిస్తామంటూ వసూళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: మహానగరంలో మాయగాళ్లు ప్రకృతి ప్రేమికులనూ వదలట్లేదు. ఖరీదైన మొక్కలు తక్కువ ధరకేనంటూ ఆశ చూపి సొమ్ము చేసుకుంటున్నారు. ముందుగానే నగదు జమచేయించుకొని ఫోన్‌లు స్విచ్ఛాప్‌ చేస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన జైన్‌ మొక్కలు కొనుగోలు చేయాలనుకున్నారు. ఆన్‌లైన్‌లో కనిపించిన నంబరుకు ఫోన్‌చేసి మాట్లాడారు. రూ.3,500 మొబైల్‌ ద్వారా పంపించాడు. మరుసటి రోజు నుంచే స్పందన కరవైంది. సికింద్రాబాద్‌కు చెందిన మనీష్‌ ఇదే రకమైన సమస్యను చవిచూశారు. కొత్తగా నిర్మించిన ఇంట్లో పచ్చదనం విరియాలనే ఆలోచనతో రూ.15,000 వరకూ చెల్లించి 10 రకాల మొక్కలకు ఆర్డరిచ్చారు. గృహప్రవేశం అయినా మొక్కలు రాలేదు.

ఆసక్తి ఆసరాగా.. గ్రేటర్‌లో మిద్దెతోట పెంపకం పట్ల ఆసక్తి పెరిగింది. సామాజిక మాధ్యమాలు, అంతర్జాలంలో దీనికోసం ఆరా తీస్తున్నారు. ఇదే అదనుగా నర్సరీ, పెరటి తోట సేవల ముసుగులో వెలసిన కొన్ని సంస్థలు మోసాలకు తెగబడుతున్నాయి. మణికొండకు చెందిన ఓ అంకుర సంస్థ పెరటితోట ఏర్పాటు నుంచి మూడేళ్లపాటు సేవలు అందిస్తామంటూ ప్రకటన గుప్పించింది. ఆసక్తి ఉన్నవారి వద్ద వేలాది రూపాయల వసూలు చేసింది. కొద్దికాలం సజావుగానే నడిపించినా ఆ తరువాత సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ వినియోగదారులకు చుక్కలు చూపారు. అలంకరణ మొక్కలు విదేశాల నుంచి తెప్పిస్తామంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ఆకట్టుకుంటున్న కొందరు నగదు చేతికి అందగానే ఫోన్లు ఆపేస్తున్నారు.

స్వయంగా వెళ్లి తెస్తే మేలు.. మోసపోయిన సొమ్ము కొద్ది మొత్తమనే ధోరణిలో బాధితులు మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్‌, సమయాభావం తదితర కారణాలతో చాలామంది ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. అక్కడ ఎదురయ్యే అవరోధాలతో పూర్తిగా ఇంటి పంటను వదిలేస్తున్న వారూ ఉన్నారు. సమస్యను అధిగమించాలంటే స్వయంగా వెళ్లి పరిశీలించి కొనుగోలు చేయాలి. కాస్త సమయం కేటాయిస్తే పెరటితోటలోని కూరగాయల నుంచి విత్తనోత్పత్తి చేసుకోవచ్చని ఉద్యానశాఖాధికారులు సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని