భూముల ఆక్రమణ.. ఏదీ నియంత్రణ?
eenadu telugu news
Published : 19/10/2021 01:21 IST

భూముల ఆక్రమణ.. ఏదీ నియంత్రణ?

ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని ఆరోపణ
ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: న్యూస్‌టుడే, పరిగి కొడంగల్‌, తాండూరు

పరిగి కళాశాల భూములు

* వికారాబాద్‌ పురపాలక సంఘానికి చెందిన ఓ నాయకుడు రూ.కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేయాలని చదును చేశాడు. ఈ విషయాన్ని తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమని బోర్డు ఏర్పాటు చేశారు.


* వికారాబాద్‌ మున్సిపల్‌ పాలకవర్గానికి చెందిన ఓ కౌన్సిలర్‌ భర్త తన వార్డు పరిధిలో గ్రామకంఠం భూములకు వీఎల్‌టీ (వెకెట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌) ఇప్పిస్తానంటూ ఒక్కో వ్యక్తి నుంచి రూ.2 లక్షల వరకు వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో వీటిని క్రమబద్ధీకరించే అవకాశం ఉందని నమ్మిస్తున్నారు. ఈ వ్యవహారంలో పురపాలక, రెవెన్యూ సిబ్బందికి వాటాలు ఉన్నాయని బహిరంగంగానే చెప్పుకొంటున్నారు.


* పరిగి పట్టణం విద్యారణ్యపురి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు ప్రభుత్వం తొమ్మిది ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇందులో రెండు ఎకరాల వరకు అన్యాక్రాంతమయింది. నిత్యం కొత్త వ్యక్తులు రావడం, గుడిసెలు వేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. పరిగికి మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇక్కడే నిర్మించాల్సి ఉండటం విశేషం.


ప్రభుత్వ భూములను కాపాడేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ప్రకటిస్తున్నా, ఆచరణలో కనిపించడంలేదు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. ఈ వ్యవహారంలో కొంతమంది ప్రజా ప్రతినిధులే కీలకం కావడం విస్మయానికి గురి చేస్తోంది. దందాను అడ్డుకోవాల్సిన అధికారులే కాసుల కోసం, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గడంతో పట్టణాల్లో విలువైన సర్కారు స్థలాలు ప్రైవేట్‌ వ్యక్తుల పరమవుతున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తే, వారిపై వేధింపులు మొదలవుతున్నాయి.

జిల్లాలో నాలుగు పురపాలక సంఘాలు ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లా ఏర్పాటయ్యాక పట్టణ ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, మెరుగైన మౌలిక వసతులు, రవాణా, ఇతర అవసరాల నిమిత్తం పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. వికారాబాద్‌లోనే 170కిపైగా లేఅవుట్లు ఉన్నాయి. పరిగి, తాండూరు, కొడంగల్‌ పట్టణాల్లోనూ 300 వరకు లేఅవుట్లు ఏర్పాటయ్యాయి. ఈ సందర్భంగా ప£ది శాతం చొప్పున భూమిని పురపాలక సంఘానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే కాగితాలపై బదలాయింపు జరుగుతున్నా, క్షేత్ర స్థాయిలో ఆ స్థలాన్ని కొంతమంది అమ్ముకుంటున్నారు. మరో వైపు పలుకుబడి ఉన్న నాయకులు సర్కారు స్థలాలపై కన్నేస్తున్నారు. నకిలీ దస్త్రాలను సృష్టించడం, వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహరం గురించి పురపాలక సంఘాల్లోని రెవెన్యూ సిబ్బందికి తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు. పురపాలక, ప్రభుత్వ భూములకు ఖాళీ స్థలం పన్ను (వెకెట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌) రసీదు ఇస్తున్నారు. దీనికి ప్రతిఫలంగా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు తీసుకుంటున్నారని సమాచారం. ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలు ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి.

వికారాబాద్‌: ప్రైవేటు వ్యక్తులు చదును చేసిన స్థలంలో ఏర్పాటు చేసిన బోర్డు

ఫిర్యాదు దారులకు వేధింపులు
సమాజంలో పలుకుబడి ఉన్న వారు, రాజకీయ అండదండలు ఉన్నవారే తెరవెనుక ఉండి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వారిపై అధికారులకు ఫిర్యాదు చేయాలంటే సామాన్యులు భయపడుతున్నారు. ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తే ప్రభుత్వ శాఖల్లోని కొంత మంది సిబ్బంది ఫిర్యాదుదారుడి వివరాలను తిరిగి అక్రమార్కులకు చేరవేయడంతో వేధింపులు మొదలవుతున్నాయి. ఇటీవల కలెక్టర్‌ ఒక భూమి విషయంలో విచారణ చేపట్టాలని ఆదేశించగా, ఫిర్యాదుదారుడి వివరాలు, ఫోన్‌ నెంబరుతో సహా అవతలి వ్యక్తికి చేరాయి. దీంతో వారు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఫలితంగా మారో మారు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు.
సమాచారం అందినా..
వికారాబాద్‌ పట్టణంలోని పోలీసు స్టేషన్‌ సమీపంలో ఆక్రమణలు జరుగుతున్నాయన్న అంశంపై పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు సమాచారం అందించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదేమంటే అందులో పాలకవర్గం సభ్యులే ఉన్నారని ఓ జిల్లా అధికారి నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇతర సందర్భాల్లోనూ రాజకీయ నాయకుల ఒత్తిడితో విచారణ జరిగిన సందర్భాలు ఉంటున్నాయి. సామాన్యుడు ఫిర్యాదు చేస్తే బుట్టదాఖలవుతున్నాయి.
చర్యలు తీసుకుంటున్నాం
చంద్రయ్య, అదనపు కలెక్టర్‌

వికారాబాద్‌లో ప్రభుత్వ స్థలాన్ని చదును చేయడం గమనించి, అక్కడ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించాం. మరో వైపు ప్రైవేటు వెంచర్లలో పురపాలక సంఘానికి స్థలాన్ని కేటాయిస్తున్నారు. దీన్ని కాపాడేందుకు కంచె వేయాలని అధికారులకు చెప్పాం. నిధుల లభ్యత ప్రకారం అన్ని ప్రాంతాల్లో ఆస్తుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. ఆక్రమణలపై ఫిర్యాదు చేస్తే తక్షణం పరిశీలించి స్వాధీనం చేసుకుంటాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని