వివక్షను ఎదిరించి.. అవగాహనతో అడుగేసి..!
eenadu telugu news
Published : 19/10/2021 01:21 IST

వివక్షను ఎదిరించి.. అవగాహనతో అడుగేసి..!

చైతన్యానికి ఊపిరిలూదుతూ..

మహిళా కమిషన్‌, ఐసీడీఎస్‌, ఏఆర్‌ఈఎస్‌ సంయుక్తాధ్వర్యంలో కృషి

న్యూస్‌టుడే, నర్సాపూర్‌

ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న సునీతారెడ్డి

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళలు, బాలికలపై వేధింపులు, దాడులు తగ్గడం లేదు. దీనికి ప్రధాన కారణం చైతన్యం లేకపోవడమే. ఈ విషయమై  అవగాహన కల్పించడమే కాకుండా లింగ వివక్ష లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా ఏఆర్‌ ఎడ్యుకేషనల్‌ స్వచ్ఛంద సంస్థ ముందడుగు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడమే కాకుండా, వారికి స్వయం ఉపాధి పొందేలా పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌, ఐసీడీఎస్‌లతో కలిసి సంయుక్తంగా సంస్థ ముందుకు సాగుతోంది.
మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గంలో అత్యధికం గ్రామీణ ప్రాంతాలే. అక్షరాస్యత అంతంతే. ఈ క్రమంలో అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఏఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ నడుంబిగించింది. ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తున్నారు. పోలీసులతో కలిసి చట్టాల గురించి వివరిస్తున్నారు.

విద్యార్థినులకు చట్టాలను వివరిస్తున్న సునీత

సమన్వయం చేసుకుంటూ..
మహిళలు, చిన్నారుల్లో చైతన్యానికి, అవగాహన కల్పనకు డిజిటల్‌ ప్రదర్శనలు చేపడుతున్నారు. హక్కులు, పరిరక్షణ, వారి కోసం ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. వేధింపులకు గురైన బాలికలకు అండగా నిలుస్తున్నారు. ఐసీడీఎస్‌, డీఆర్డీఏ, పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖలు, పోలీసు తదితర శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బాలికల్లో ఎదుగుదల, బరువు పెరగడానికి తీసుకోవాల్సిన పౌష్టికాహారం, తదితర అంశాలను వివరిస్తున్నారు.
ముందుగా రక్త పరీక్షలు చేయించి, రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్న వారికి పోషకాహారం, మందులు అందజేస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేశారు. కొన్ని చోట్ల బూట్లు అందజేశారు. ప్రతి బుధవారం గ్రామాల్లో మహిళలు, కిశోర బాలికలతో నడక కార్యక్రమం చేపడుతున్నారు. ఆ సమయంలో వారితో వివిధ అంశాలను చర్చిస్తున్నారు. ప్రస్తుతం సదరు కార్యక్రమాలపై రేడియో ఛానెల్‌ను రూపొందించే పనిలో ఉన్నారు.

ప్రత్యేక బృందాలు..
స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందాలు గ్రామాల్లో పర్యటించి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాయి. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బాలికలను పాఠశాలలకు వెళ్లేలా చొరవ చూపుతారు. బాలికల హక్కులకు భంగం వాటిల్లినా, బాల కార్మికులుగా పని చేస్తున్నట్లు తెలిసినా,  బాల్యవివాహాలు, వేధింపులు వంటివి తెలియగానే వెంటనే అక్కడికి వాలిపోయి తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.
మార్పు వచ్చేలా..: సునీత కొర్రపాటి
గ్రామాల్లో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నిరంతర ప్రక్రియగా కొనసాగితేనే మార్పు సాధ్యం. లింగ వివక్ష అనేది పోతేనే ఆడవారికి సమాజంలో పూర్తి రక్షణ చేకూరుతుంది. పలు కార్యక్రమాలకు దాతలు సహకారం అందిస్తున్నారు.
స్వయం ఉపాధి.. నైపుణ్యం..
స్థానికంగా గ్రామాల్లోనే అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని స్వయం ఉపాధి పొందేలా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఫ్లంబర్‌, విద్యుత్తు, తదితర అంశాల్లో తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించారు.
పిల్లల సమస్యలను నేరుగా 1098కు ఫోన్‌చేసి చెప్పాలని సూచిస్తున్నారు. మహిళలు వేధింపులు, తదితర సమస్యలు ఎదురైతే తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన 181 టోల్‌ఫ్రీ నెంబరుపై ఆటో ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
విద్యార్థినుల్లో జీవన నైపుణ్యాలు మెరుగుపర్చడం, సామాజిక పరంగా నాయకత్వ లక్షణాలు పెంచేలా శిక్షణ ఇస్తున్నారు. బాల్యవివాహాలతో కలిగే అనర్థాలను వివరిస్తున్నారు. వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో అగ్రో ఫార్మింగ్‌పై తర్ఫీదు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు.

50 గ్రామాల ఎంపిక..
నర్సాపూర్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని నర్సాపూర్‌, శివ్వంపేట, కౌడిపల్లి, చిలప్‌చెడ్‌, తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాల్లోని 50 గ్రామాలను సదరు స్వచ్ఛంద సంస్థ దత్తత తీసుకుంది. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థను సునీతా కొర్రపాటి నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, నర్సాపూర్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారిణి హేమభార్గవిల సహకారంతో ప్రణాళికతో అడుగేశారు. ఆడ శిశువుల అమ్మకాలు, బాల్య వివాహాలు ఎక్కువగా జరిగిన గ్రామాలు, తండాలను ఎంపిక చేసుకున్నారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని