పేరు కొత్త.. సమస్యల వెత
eenadu telugu news
Published : 19/10/2021 01:21 IST

పేరు కొత్త.. సమస్యల వెత

విలీన గ్రామాలపై దృష్టి సారిస్తే మేలుŸ
న్యూస్‌టుడే, పరిగి

సుల్తాన్‌నగర్‌లో ఇళ్లమధ్య మురుగు

త్వర పురోగతిలో భాగంగా ప్రభుత్వం ప్రధాన పంచాయతీలకు పురపాలక సంఘాలుగా హోదా కల్పించింది. ఈ క్రమంలో  పరిసర గ్రామాలను విలీనం చేశారు. ఈ పక్రియతో రూపురేఖలు మారిపోతాయని ప్రజలు ఆశించారు. మూడేళ్లవుతున్నా  మార్పు లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. జిల్లాలో తాండూరు, వికారాబాద్‌ పాత మున్సిపాలిటీలు. కొడంగల్‌, పరిగి కొత్తగా ఏర్పాటయ్యాయి. విలీన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. వీటిల్లో కనీసం 30 శాతం ఖర్చు చేయాలని సూచిస్తోంది అయినా అమలు కావడంలేదు.
జోన్లుగా విభజిస్తే..: మున్సిపాలిటీలోని వివిధ వార్డులను ప్రభుత్వం జోన్లుగా విభజించనుంది. అలా మార్పు చేస్తే  సెస్సుల భారం మరింత పడనుంది. కొత్తగా ఏర్పడిన పురపాలికల్లో మూడేళ్ల వరకు పంచాయతీ ఉన్న సమయంలో అమలయ్యే పన్నులను మాత్రమే వసూలు చేస్తారు. ఇలా అయితే 2018 జూన్‌ 2న పరిగి, కొడంగల్‌ కొత్తగా ఏర్పాటయ్యాయి. అంటే మూడేళ్ల వ్యవధి ముగిసందన్న మాట. ప్రధానంగా డిమాండ్‌ ఉన్న ప్రాంతాలను మొదటి జోను, రెండో జోన్లుగా ప్రాధాన్యం లేని వార్డులను తక్కువ కేటగిరిలోకి తీసుకువస్తారు. ప్రస్తుతానికి ఈ అంశం తెరమీదకు రాకపోయినా అమలయ్యేది ఖాయమని అధికారులు చెబుతున్నారు.

కొడంగల్‌ సన్‌సిటీ కాలనీలో..

మౌలిక వసతుల కల్పనే ముఖ్యం: విలీన గ్రామాల్లో ప్రధానంగా అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు, రోడ్లే ప్రధాన సమస్యలుగా వెంటాడుతున్నాయి. వికారాబాద్‌ పుర పరిధిలోని గిరిగిట్‌పల్లి, మద్గుల్‌ చిట్టెంపల్లి, ధన్నారం గ్రామాల్లో పాత సమస్యలే తిష్టవేశాయి. సత్వర అభివృద్ధిలో భాగంగానే ఇప్పటివరకు ప్రభుత్వం రెండుసార్లు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందుకోసం ఒక్కో పురపాలికలో ఒక్కో విడతగా రూ.12లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఖర్చులు చూపారు. అయినా ఇంకా సమస్యలు మిగిలే ఉన్నాయి. పలుచోట్ల ఇళ్లమధ్య మురుగు పేరుకుపోయింది. దశాబ్దాల కిందట నిర్మించిన కాల్వలు శిథిలమయ్యాయి.
పరిగి పంచాయతీలో ఉన్న సుల్తాన్‌నగర్‌, ఎర్రగడ్డపల్లి, కిష్టమ్మగుళ్ల గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. కొత్తగా ఇతర పంచాయతీలేమీ ఇందులో చేర్చలేదు. ఈరెండు గ్రామాల్లోనూ అంతర్గత రోడ్లు కాస్త మెరుగ్గా ఉన్నా, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మంచినీటి సరఫరా వ్యవస్థను, పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగు పరచాల్సి ఉంది. పరిగి మున్సిపాలిటీకి ఏటా రూ.1.49 కోట్ల ఆదాయం లక్ష్యంగా ఉండగా 90శాతానికి పైగానే వసూళ్లవుతున్నాయి. ఇతర వార్డుల్లోనూ ఇదే దుస్థితి.

కాలువలు లేక..

న్యూస్‌టుడే,కొడంగల్‌: కొడంగల్‌ మేజర్‌ పంచాయతీలో కొడంగల్‌తోపాటు, పాత కొడంగల్‌, పాత కొడంగల్‌ తండా, గుండ్లకుంట, కొండారెడ్డిపల్లి, బుల్కాపూర్‌, ఐనోన్‌పల్లి  గ్రామాలు విలీనమై పురపాలికగా మారింది. ఏటా రూ.39 లక్షల ఆదాయం వస్తుంది. వీటినే వేతనాలు, అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నారు. సీసీ రోడ్లు, కాలువల నిర్మాణానికి ఇవి సరిపోవడం లేదు. దీంతో వసతుల కల్పన కొరవడింది.

బుల్కాపూర్‌లో రోడ్డు పక్కనే చెత్తకుప్పలు ఉన్నాయి. వీటిని తొలగించడంలేదు.

కొండారెడ్డిపల్లిలో రోడ్డుకు ఇరువైపులా పెద్ద బావులు ప్రమాదకరంగా మారాయి. రోడ్డుపై మురుగు పారుతోంది.

ఐనోన్‌పల్లిలో ప్రధాన రహదారి  నుంచి గ్రామంలోకి రోడ్డు సౌకర్యం సరిగాలేదు.

పాతకొడంగల్‌ అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మురుగు పారుదల  వ్యవస్థ సరిగాలేదు.

పాతకొడంగల్‌ తండాలోనూ ఇదే దుస్థితి నెలకొంది.
అన్ని వార్డుల్లో సమాన అభివృద్ధి
అశోక్‌కుమార్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌, పరిగి

అన్ని వార్డులు సమానమే. ప్రణాళిక ప్రకారం సమస్యలను పరిష్కరిస్తాం. ఇందులో భాగంగానే ప్రతివార్డులో రూ.10లక్షలతో కౌన్సిలర్లు పనులు చేపడుతున్నారు. నిధుల సమీకరణ ఆధారంగా ముందుకు సాగుతున్నాం. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు వసతులు కల్పించడమే మా లక్ష్యం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని