‘కొ-విన్‌’ పేరు.. అలా వచ్చింది!
eenadu telugu news
Updated : 19/10/2021 04:42 IST

‘కొ-విన్‌’ పేరు.. అలా వచ్చింది!

పాతికేళ్ల వయసులోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో చేరిక

హెచ్‌సీయూ పూర్వ విద్యార్థిని శ్రీదేవి మనోగతం 

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో ప్రభుత్వం నిర్వర్తించిన బాధ్యత ఏంటి? ప్రపంచదేశాలు ఆసక్తి కనబరుస్తున్న కొ-విన్‌ సాఫ్ట్‌వేర్‌ ఏ విధంగా పురుడుపోసుకుంది. కరోనా మహమ్మారి ప్రబలిన తర్వాత నుంచి వ్యాక్సిన్‌ సరఫరా వరకు ఎన్నో క్రతువుల్లో ఆమె భాగస్వామి. అత్యంత పిన్నవయసులో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలోకి ప్రవేశించి కరోనా మహమ్మారిపై ప్రజలను సంసిద్ధులను చేసి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో భాగస్వామి అయ్యింది. ఆమే హెచ్‌సీయూ పూర్వ విద్యార్థిని ఇ.శ్రీదేవి. కరోనాపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన యుద్ధాన్ని ‘ఈనాడు’తో పంచుకున్నారు. 

‘‘మాది వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం పాలేపల్లి. నాన్న మురళీధర్‌గౌడ్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. అమ్మ శశికళ గృహిణి. నా చిన్నప్పుడే నగరంలో స్థిరపడ్డాం. డిగ్రీ అయ్యాక వైద్య రంగంపై ఆసక్తితో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ ఇన్‌ పబ్లిక్‌హెల్త్‌ కోర్సులో చేరా. 2019లో ప్రాంగణ నియామకాల్లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో భాగమైన నేషనల్‌ సిస్టమ్స్‌ రీసోర్స్‌ సెంటర్‌లో ఫెలోగా ఎంపికయ్యాను. అక్కడ నా పనితీరు మెచ్చి ఉన్నతాధికారులు గతేడాది అక్టోబరులో జాతీయ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ సెల్‌లో కన్సల్టెంట్‌గా పనిచేసేందుకు ప్రతిపాదించడంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకుంది. పాతికేళ్ల వయసులోనే కేంద్ర మంత్రిత్వ శాఖలో పనిచేసే అవకాశం వచ్చింది. 


ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయింది!

జనవరి 16న కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. ఆ రోజు కేంద్ర మంత్రిత్వ శాఖలో ఒకటే ఉత్కంఠ. రాత్రి 11 గంటల వరకు కార్యాలయంలో ఉండి వ్యాక్సిన్‌ సరఫరా, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఇవ్వడంపై ఉన్నతాధికారులతో కలిసి సమీక్షల్లో పాల్గొని నివేదికలు సిద్ధం చేశా. జీవితంలో ఇది ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం.  ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నా.! 


ప్రతి సమావేశంలో ఉన్నా..

వ్యాక్సిన్‌ సరఫరాకు ముందు జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ నేతృత్వంలో నిర్వహించిన 1075 కాల్‌సెంటర్‌ సిబ్బంది శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించా. కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ తయారీకి అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు  ఏర్పాటయ్యే ప్రతి సమావేశంలో పాల్గొన్నా. తొలుత కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంటిలిజెన్స్‌ నెట్‌వర్క్‌(కొవిన్‌)గా పేరును ప్రతిపాదించారు. ఆ తర్వాతి సమావేశంలో చర్చ సందర్భంగా అదనపు కార్యదర్శి వందన గుర్నానీ ఆలోచనతో విన్నింగ్‌ ఓవర్‌ కొవిడ్‌(కొవిడ్‌పై విజయం సాధించడం) అర్థం వచ్చేలా కొ-విన్‌గా మార్చారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని