ఇదే తరుణం
eenadu telugu news
Published : 20/10/2021 00:58 IST

ఇదే తరుణం

రబీకి లక్ష్యం ఖరారు
 

అన్నదాతలకు అందించే పంట రుణాల లక్ష్యం ఖరారైంది. రబీ సాగుకు సిద్ధమైన తరుణంలో పెట్టుబడికి అవసరమైన ఖర్చులకు వినియోగించేలా రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు సన్నద్ధమయ్యారు. పంపిణీ వేగవంతంగా నిర్వహించి శత శాతం పూర్తి చేయాలని కార్యాచరణ రూపొందించారు. ఖరీఫ్‌లో పూర్తి స్థాయిలో అందకపోవడంతో కర్షకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడైనా సకాలంలో ఇస్తే ప్రైవేటు అప్పులు, అధిక వడ్డీల భారం తప్పనుంది. జిల్లాలో పరిస్థితిపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం...

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

జిల్లాలో అధిక శాతం ప్రజలకు సేద్యమే జీవనాధారం. ఖరీఫ్‌, రబీ సీజన్లలో 5.88 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తారు. ఖరీఫ్‌ ముగియడంతో తాజాగా రబీ సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా వరి, శనగ, వేరుసెనగ, కుసుమ, ఉల్లి, పెసర, కూరగాయల పంటలను సాగు చేయనున్నారు. వీటి పెట్టుబడి ఖర్చులకు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా తక్కువ వడ్డీకి బ్యాంకుల ద్వారా పంట రుణాలను ఇస్తున్నారు. ఖరీఫ్‌లో 97,500మంది రైతులకు రూ.1,028 కోట్ల రుణాలు అందించాలని నిర్ణయించినా మందకొడిగా సాగిన ప్రక్రియతో డెబ్భై శాతమే పూర్తైంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రబీలో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా అవగాహన కల్పించి అన్నదాతలు రుణాలు పొందేలా ప్రోత్సహించాలని, గ్రామాలకు వెళ్లి మంజూరు చేయాలని యోచిస్తున్నారు. ప్రైవేటు అప్పులు పొంది ఆర్థిక ఇబ్బందులు పడకుండా చేసేందుకు తక్కువ వడ్డీకి రుణాలు అందించేలా కృషి చేయనున్నారు.

సాయం పెంచితే మేలు

ప్రభుత్వం తొలిసారిగా రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టి రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.5వేల చొప్పున అందిస్తోంది. భూ విస్తీర్ణాన్ని బట్టి ఆర్థిక సాయాన్ని నేరుగా పట్టాదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. కాగా ఏ పంట సాగు చేసినా పెట్టుబడికి రూ.10వేల నుంచి రూ.40వేల దాకా ఖర్చవుతోంది. ఈక్రమంలో ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయాన్ని మరింత పెంచితే జిల్లాలో లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. రైతులు మరింత ఉత్సాహంగా వ్యవసాయం చేసే ఆస్కారముంటుంది. బీడు భూములు సైతం సాగులోకి వచ్చి తిండి గింజలు, ఆహార ఉత్పత్తులు, దిగుబడులు గణనీయంగా పెరిగేందుకు దారితీయనుంది. రైతులకు ఆర్థికంగా భరోసా లభించనుంది.

బ్యాంకులో రైతులు

ఇప్పటి నుంచే వేగవంతం చేస్తాం

రాంబాబు, లీడ్‌ బ్యాంకు మేనేజరు

రబీ సీజన్‌లో నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు పంపిణీ చేస్తాం. గడువు ముగిసే సమయానికి హడావుడిగా కాకుండా ఇప్పటి నుంచే ఈ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తాం. రూ.లక్ష రుణం పొందిన వారు మాఫీకి ఎదురుచూడకుండా రెన్యూవల్‌ చేసుకోవాలి. వడ్డీ భారం తగ్గుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి.

దక్కని పంట నష్ట్ట పరిహారం

ఖరీఫ్‌ సీజన్‌లో అకాల వర్షాలు, తుపానుల ప్రభావంతో పెసర, మినుము, పత్తి, కంది, సోయాబిన్‌ పంటలు దెబ్బతిన్నాయి. రైతులు ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. కొంతమంది పెట్టుబడులు సైతం కోల్పోయి అప్పుల పాలయ్యారు. నాలుగు నెలల శ్రమ దండగై వేలాది రూపాయలు నీటిపాలైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పైసా పరిహారం అందలేదు. రైతుబంధు అమలుతో రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అంశాన్ని పక్కన పెట్టింది. అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిని రైతులు అప్పుల్లోకి వెళ్తున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చేతులెత్తేసుండటంతో ఆర్థికంగా కుదేలవుతున్నారు. దెబ్బతిన్న పంటల స్థానంలో రబీ సాగుకు సిద్ధమయ్యారు. ఖరీఫ్‌ అనుకూలించకపోవడంతో ప్రస్తుతం చాలామంది రైతుల చేతిలో పెట్టుబడులకు నగదు లేకుండా పోయింది. విత్తనాల కొనుగోలు, కూలి చెల్లింపులు, ఎరువుల కొనుగోలు ఖర్చులకు అడ్తి దుకాణదారులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా బ్యాంకుల్లో పంట రుణాల పంపిణీ ప్రారంభించడంతో రైతులకు లబ్ధి చేకూరనుంది. బ్యాంకుల్లో అందించే రుణాలు పొంది సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

జిల్లాలో రైతులు 2.55 లక్షలు

రబీ సాగు అంచనా 2.30 లక్షల ఎకరాలు

పంట రుణాల లక్ష్యం రూ.686.71కోట్లు

ఖాతాలు: 64,993

బ్యాంకు శాఖలు 92


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని