చెరువు తూము తెరవడానికి వెళ్లి వ్యక్తి మృతి
eenadu telugu news
Published : 20/10/2021 00:58 IST

చెరువు తూము తెరవడానికి వెళ్లి వ్యక్తి మృతి

కుల్కచర్ల గ్రామీణ, గంఢీడ్‌, న్యూస్‌టుడే: చెరువు తూము తెరవడానికి వెళ్లి చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందగా శవం వెలికితీతకు ఎస్‌ఐ మానవత్వంతో తనవంతు చేయూతనిచ్చారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం స్థానికంగా చోటు చేసుకుంది. ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. పుట్టాపహాడ్‌, గాదిర్యాల్‌ గ్రామాలకు మధ్యన చిన్న చెరువు ఉంది. దీని కింద ఈ రెండు గ్రామాలకు చెందిన రైతుల భూములు ఉన్నాయి. అయితే పుట్టాపహాడ్‌ గ్రామానికి చెందిన పెద్ద మల్లయ్య(35) అనే వ్యక్తిని నీళ్లు వదలడానికి పెట్టుకున్నారు. ఈ క్రమంలో సోమవారం తూము వద్దకు వెళ్లాడు. నీరు వదిలే పరికరం (మంగా) లేకపోవడంతో తూము కింద ఉన్న ఇసుక సంచులను తొలగించే ప్రయత్నం చేశాడు. కదిలే వీలులేక అక్కడే సంచుల మధ్య ఇరుక్కుని మృత్యువాత పడ్డాడు. గ్రామస్థుల సమాచారం మేరకు మంగళవారం ఎస్సై తన సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసు సిబ్బంది శ్రీనివాస్‌, శ్రీను చెరువులోకి దిగారు. ఈ క్రమంలో ఎస్సై విఠల్‌రెడ్డి కూడా నీటిలోకి దిగి వెతికారు. సిబ్బంది మృతదేహాన్ని గుర్తించడంతో తాడు సహాయంతో ఎస్సై ఒడ్డుకు చేర్చారు. చెరువు పరిధి మహమ్మదాబాద్‌ ఠాణా పరిధిలోని రావడంతో కేసు విషయాన్ని అక్కడి పోలీసులకి అప్పగించామని ఎస్సై వివరించారు.


అనుమానాస్పదస్థితిలో బాలిక..

నారాయణఖేడ్‌, న్యూస్‌టుడే: ఖేడ్‌ మండలం లింగాపూర్‌ గ్రామంలో అనుమానాస్పదంగా ఓ బాలిక ఉరివేసుకుని మృతి చెందినట్లు ఖేడ్‌ ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తెలిపిన వివరాలు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల బాలిక ఈ నెల 17న రాత్రి అదేకాలనీకి చెందిన ఓ యువకుడితో సన్నిహితంగా ఉండటం ఆమె తండ్రి చూశాడు. వెంటనే వారిద్దరు పారిపోయారు. గంట తరువాత యువకుడు ఇంటికి రాగా... బాలిక మాత్రం రాలేదు. ఆమె ఆచూకీ కోసం వెతుకుతుండగా సోమవారం గ్రామ శివారులోని పంట చేలో ఓ చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించింది. కూతురి మృతి విషయంలో సదరు యువకుడిపై అనుమానం ఉందని బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు..

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: చేపలు పట్టేందుకు నర్సాపూర్‌ చెరువులోకి దిగిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయాడు. ఎస్‌ఐ గంగరాజు తెలిపిన వివరాలు.. నర్సాపూర్‌కు చెందిన జిన్నారం గణేశ్‌ (54) చేపలు పట్టి విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. మంగళవారం ఉదయం చేపలు పట్టేందుకు పట్టణ సమీపంలోని రాయరావు చెరువు వద్దకు వెళ్లి చెరువులోకి దిగాడు. ఇంతలో ఏమైందో ఏమో నీట మునిగి చనిపోయాడు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికితీసి పంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని, గణేశ్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


చెరువులో పడి మరొకరు..

హత్నూర, న్యూస్‌టుడే: కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన హత్నూర మండలం గుండ్లమాచనూర్‌లో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపిన వివరాలు.. గుండ్లమాచునూర్‌ గ్రామానికి చెందిన శేరి మహేష్‌(32) స్థానిక పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమీపంలోని చెరువు వద్దకు వెళ్లాడు. ఇంటి నుంచి వెళ్లిన మహేష్‌ రాత్రయినా తిరిగి రాకపోవడంతో భార్య లక్ష్మి చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం అటుగా వెళ్లిన గ్రామస్థులు చెరువు తూము సమీపంలో మృతదేహం నీటిపై తేలి ఉండటాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మహేష్‌ మూర్ఛతో బాధపడేవాడని నీటిలో పడిపోయి మృతి చెంది ఉంటాడని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని