సర్వ హక్కులు ‘నిషేధిత’ జాబితాలో..
eenadu telugu news
Published : 20/10/2021 00:58 IST

సర్వ హక్కులు ‘నిషేధిత’ జాబితాలో..

ఆందోళనలో భూ యజమానులు●

* నవాబుపేట్‌ మండలం చిట్టిగిద్ద పంచాయతీ సర్వే నంబరు 434లో 13 మంది రైతులకు 11.39 ఎకరాల పట్టా భూమి ఉంది. ధరణి వచ్చాక కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. రైతుబంధు జమ అవుతోంది. అమ్ముకుందామంటే వీలు లేకుండా నిషేధిత జాబితాలో చేర్చారు. సర్వే నంబరు 290లో 22.37 ఎకరాలను దేవాదాయ భూములుగానే ధరణిలో నమోదు చేశారు. రికార్డుల ప్రకారం 2.15 ఎకరాలే దేవాదాయ భూములు.

* నవాబుపేట మండలం గేటువనంపల్లిలో సర్వే నంబరు 56లో 17మంది రైతులకు 12 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. పోర్టల్‌లో సున్నా ఆప్సన్‌లో చూపుతోంది.

* వికారాబాద్‌ చుట్టూ రైల్వే ట్రాక్‌ ఉంది. ఆ లైన్‌ వెళ్లిన పొడవునా సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో చూపుతున్నారు. రూ.కోట్ల విలువైన భూములు చేతిలో ఉన్నా చిల్లిగవ్వకు అమ్ముకోలేకున్నామని, అత్యవసరమైతే అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: న్యూస్‌టుడే, నవాబుపేట

పట్టా భూములు ఉన్నా ఆ రైతులకు ప్రయోజనం ఉండటం లేదు. అమ్ముకుందామన్నా, ఏజీపీ చేద్దామన్నా వీలుపడటంలేదు. మరికొందరికి పూర్తి స్థాయి విస్తీర్ణం కొత్త పట్టాదారు పాసుపుస్తకంలో నమోదు కాలేదు. సరి చేయాలని అధికారులను ప్రాధేయపడినా సాధ్యం కాదంటున్నారు. మరో వైపు సర్వే నంబరులో ప్రభుత్వ భూములు ఉంటే వాటిని నిషేధిత జాబితాలో పెట్టారు. ఈసేవా కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. జిల్లాలో 2.85 లక్షల మంది పట్టాదారులకు 6.5 లక్షల ఎకరాల వ్యవసాయ, వ్యవసాయేతర పట్టా, లావణి పట్టా భూములు ఉన్నాయి. ధరణి పోర్టల్‌ వచ్చాక భూ యజమానులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారు. ఈ క్రమంలో సిబ్బంది చేసిన పొరపాట్లకు ప్రస్తుతం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పంచాయతీ, పురపాలక, ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలకు చెందిన, అటవీ, దేవాదాయ, రైల్వే, ఇతర శాఖలకు చెందిన భూములున్న ప్రాంతాల్లో సర్వే నంబరులోని విస్తీర్ణం మొత్తాన్ని నిషేధిత జాబితాలో పెట్టారు. ఒక సర్వే నంబరులో ఒక్క గజం భూమి ప్రభుత్వ విభాగాలకు చెందినది ఉన్నా, మొత్తం విస్తీర్ణాన్ని నిషేధిత జాబితాలో పెట్టడంపై రైతులు, సామాన్యుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పోర్టల్‌లో ప్రభుత్వ, పట్టా, అసైన్‌మెంట్‌, అటవీ, ఇతర అప్సన్లు చూపిస్తూనే 00 (సున్నా సున్నా) అనే ఆప్సన్‌ కనిపిస్తోంది. ఇతర అనే అప్సన్‌ ఉండగా ఈ 00 ఆప్సన్‌ ఎంటనేది రెవెన్యూ అధికారులు సైతం అంతుచిక్కడం లేదు. నిషేధిత జాబితాల నుంచి మా భూములను తొలగించాలని ఈ సేవా కేంద్రాల నుంచి దరఖాస్తులు పెట్టుకున్న రైతులు నెలల తరబడి తహసీల్దార్‌, ఆర్డీఓ, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సుమారు 15 వేల దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయని రెవెన్యూ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సంగారెడ్డిలో ప్రత్యేక సర్వే..

పొరుగు జిల్లా సంగారెడ్డిలో నిషేధిత జాబితాపై ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రత్యేక సర్వే చేపడుతున్నారు. గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది పర్యటించి, ఒక సర్వే నంబరులో ఇటువంటి భూములు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? అర్హులైన పట్టాదారులు ఎంత మంది ఉన్నారు? దానికి సంబంధించిన సర్వే నంబర్లలో సబ్‌ డివిజన్ల వారీగా గుర్తించే ప్రక్రియ రెండు మండలాల్లో పూర్తయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఈ విధమైన సమాచార సేకరణ చేయాలని కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని స్థానిక అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే త్వరితగతిన పనులు పూర్తి చేసే వీలుగా ఉంటుందని, సమయంతో పోటీ పడాల్సిన పనిలేదని పేర్కొంటున్నారు. మన జిల్లాలోనూ ఈ తరహా సర్వే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

రోజుకు 200 దరఖాస్తులను పరిశీలిస్తున్నాం: నిఖిల, కలెక్టర్‌

రోజుకు 200 దరఖాస్తులు పరిశీలిస్తున్నాం. దస్త్రాలను పరిశీలించాకే సరైన నిర్ణయం తీసుకుంటున్నాం. నిషేధిత జాబితాలో ఉన్న వాటిని పరిష్కరిస్తున్నాం. రెవెన్యూ సమస్యలపై అర్జీలు వస్తున్నాయి. దశల వారీగా అన్నింటికి పరిష్కారం లభిస్తుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని