ఐర్లాండ్‌ వాసులకు బెదిరింపులు
eenadu telugu news
Published : 20/10/2021 03:42 IST

ఐర్లాండ్‌ వాసులకు బెదిరింపులు

 

నగరంలో ఇద్దరి అరెస్ట్‌

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, అమీర్‌పేట: ఐర్లాండ్‌.. ఇంగ్లండ్‌ దేశస్థుల వ్యక్తిగత వివరాలు తెలుసుకుని మీపై క్రిమినల్‌ కేసులున్నాయంటూ బెదిరిస్తూ వారి నుంచి రూ.లక్షలు వసూలు చేసుకుంటున్న ఘరానా ముఠాను హైదరాబాద్‌ పోలీసులు రెండురోజుల క్రితం అరెస్ట్‌ చేశారు. కేంద్ర నిఘావర్గాల సమాచారంతో బేగంపేటలో ఓ కాల్‌సెంటర్‌ను నిర్వహిస్తున్న హైదరాబాద్‌వాసి ఎజాజ్‌, గుజరాత్‌కు చెందిన అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. కొద్దినెలల క్రితం వీరు కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారని తెలుసుకున్నారు. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ వాసులకు ఫోన్‌చేసి మాట్లాడేందుకు ప్రత్యేకంగా మణిపూర్‌, నాగాలాండ్‌ రాష్ట్రాల నుంచి 20మందిని రప్పించారు. విదేశీ భద్రతకు సంబంధించిన వ్యవహారం కావడంతో పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు.

బిట్‌కాయిన్ల ద్వారా లావాదేవీలు..

ఇంటర్నెట్‌ ఫోన్ల ద్వారా(వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌) టెలీకాలర్లతో ఫోన్లు చేయించారు. మీపై క్రిమినల్‌ కేసులున్నాయని, వాటిని మాఫీ చేయాలంటే డబ్బులు చెల్లించాలంటూ బెదిరింపులు మొదలు పెట్టారు. పదుల సంఖ్యలో బాధితులు వీరు సూచించినట్టు చేశారు. పౌండ్లలో బదిలీ చేస్తే.. తమ బ్యాంక్‌ ఖాతాల వివరాలు తెలిసిపోతాయని బిట్‌కాయిన్ల రూపంలోనే బదిలీ చేయాలంటూ షరతు విధించారు. ఐర్లాండ్‌కు చెందిన ఓ బాధితుడికి టెలీకాలర్ల మాటలపై అనుమానం వచ్చింది. అక్కడి నిఘావర్గాలకు వారంరోజుల క్రితం సమాచారం అందించగా.. వారు దిల్లీలోని కేంద్రనిఘా వర్గాలకు విషయాన్ని వివరించారు. ఆ అధికారులు హైదరాబాద్‌ పోలీసులకు సమాచారమివ్వడంతో రెండురోజుల క్రితం కాల్‌సెంటర్‌లో తనిఖీలు నిర్వహించి ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.


 

 

 

పెళ్లి సంబంధం రద్దయిందని యువతి ఆత్మహత్య
మహేశ్వరం, న్యూస్‌టుడే: పెళ్లి సంబంధం రద్దు అయిందని మనస్తాపంతో యువతి(20) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మహేశ్వరం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అమీర్‌పేటకు చెందిన అబ్బాయికి, పెండ్యాలకు చెందిన యువతితో పెళ్లి చేసేందుకు ఇరుకుటుంబాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అనంతరం అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈనెల 22న నిశ్చితార్థం కూడా ఖరారు చేశారు. కానీ, ఇంతలోనే అమ్మాయి తరఫువారు పెళ్లి ఇష్టం లేదని చెప్పారు. సోమవారం పెద్దల సమక్షంలో ఇరుకుటుంబాలు ఇష్ట పూర్వకంగానే పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు ఒప్పుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి మంగళవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు దర్యాప్తులో ఉంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని