పల్లెలో గెలుపు.. పట్టణంలో మకాం!
eenadu telugu news
Published : 21/10/2021 01:01 IST

పల్లెలో గెలుపు.. పట్టణంలో మకాం!

గ్రామప్రథమ పౌరుల్లో 20 శాతం మంది తీరిదే
న్యూస్‌టుడే, వికారాబాద్‌

* వికారాబాద్‌ మండలానికి చెందిన ఇద్దరు సర్పంచులు గతంలో మాదిరిగానే గ్రామానికి చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారు. ఫలితంగా గ్రామాల్లో వీధి దీపాలు, పారిశుద్ధ్యం పనులు కూడా నిర్వహించలేని దుస్థితి నెలకొందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
* ధారూర్‌ మండలానికి చెందిన ఐదుగురు సర్పంచులు వికారాబాద్‌ పట్టణంలో నివాసముంటూ వచ్చి వెళ్తుంటారు. ఓ సర్పంచి ఏకంగా రాజధాని నగరంలో ఉంటూ వారానికి ఒక సారి వస్తున్నారు. దీంతో వారి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేక, సమస్యల పరిష్కారానికి ఎవరికి చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు.
* మోమిన్‌పేట మండలానికి చెందిన నలుగురు సర్పంచులు వికారాబాద్‌ పట్టణానికి మకాం మార్చారు. అవసరమైతే మినహా వీరు గ్రామాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి తోడు ఆయా గ్రామాల్లో విధులు నిర్వహించాల్సిన పంచాయతీ కార్యదర్శులు కూడా అదే మార్గంలోనే నడుస్తున్నారు.
జిల్లాలో 2019 జనవరిలో మూడు విడతలుగా సర్పంచి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సమయంలో స్థానికంగా ఉంటాం.. సమస్యలపై స్పందిస్తాం. ఎప్పుడు పిలిస్తే అప్పుడు.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. గ్రామాభివృద్ధికి పాటుపడతాం.. అంటూ సర్పంచి అభ్యర్థులుగా హామీలిచ్చారు. తీరా గెలిచాక సమస్యల పరిష్కారాన్ని పక్కన పెడితే.. స్థానికంగా ఉండటమే గగనంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఎదురవడంతో పల్లెల్లో పెద్ద దిక్కు కరవవుతున్నారు. కనీస వసతులు కల్పించేవారు లేక అవస్థలు పడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కోట్‌పల్లి, మర్పల్లి, బషీరాబాద్‌, యాలాల, పరిగి, దౌల్తాబాద్‌, బొంరాస్‌పేట, కుల్కచర్ల, దోమ ఇతర మండలాలకు చెందిన వందకు మందికి పైగా సర్పంచులు స్థానికంగా నివాసం ఉండటం లేదని సమాచారం. కొందరు తమ మండలాలకు సమీపంలో ఉన్న పట్టణాల్లో ఉంటే.. ఇంకొందరు ఏకంగా హైదరాబాద్‌ను వీడటం లేదు. హైదరాబాద్‌లో ఉంటున్న ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగిపై ఎన్నో ఆశలు పెట్టుకొని సర్పంచిగా గెలిపిస్తే కనీసం వారానికి ఒకసారి కూడా రావడం లేదని, వచ్చినా ఉద్యోగి తరహాలోనే వ్యవహరిస్తున్నారని ధారూర్‌ మండలానికి చెందిన ఓ గ్రామ ప్రజలు అంటున్నారు. ఎన్నికైన సర్పంచులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అయితే స్థానికంగా ఉండకపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నాయి.


వివరాలను సేకరించి చర్యలు తీసుకుంటాం
మల్లారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి

పంచాయతీ చట్టం 26(2) ప్రకారం.. ఎన్నికైన సర్పంచి గ్రామాన్ని 15 రోజులు విడిచి ఉండొద్దు. అలా వెళ్లాల్సి వస్తే.. పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఉపసర్పంచికి బాధ్యత అప్పజెప్పాలి. తిరిగివచ్చాక అధికారుల ఆదేశంతో ఉపసర్పంచి నుంచి బాధ్యతలు స్వీకరించాలి. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న సర్పంచుల వివరాలను సేకరించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.


ప్రతి చిన్న విషయానికి కార్యాలయానికే..
ప్రస్తుతం జిల్లాలో ఉన్న 566 మంది సర్పంచుల్లో 20 శాతం మంది వివిధ కారణాలతో పట్నవాసం చేస్తున్నారు. ఇవేమీ పట్టని ప్రథమ పౌరులు తమ గ్రామాలకు చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్నారు. సమీప పట్టణాల్లో ఉన్న సర్పంచులు అవసరాన్ని బట్టి గ్రామాలకు వచ్చి వెళ్లడంతో పాటు మండల, అధికారిక సమావేశాలకు హాజరవుతుంటే.. హైదరాబాద్‌లో ఉన్న వారు నెలలకోసారి వచ్చి తళుక్కున మెరిసి వెళ్తున్నారు. దీంతో గ్రామాల్లో కనీస వసతులైన తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలకు కనాకష్టం అవుతోంది. పలు సమస్యలను చెప్పుకొనేందుకు గ్రామ పెద్ద లేకపోవడంతో ప్రతి చిన్న విషయానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అలా వెళ్లిన వారిని అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గ్రామాల్లో చిన్న తగాదాలు ఏర్పడినప్పుడు పరిష్కరించేవారు లేక నేరుగా పోలీసులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించడంలో జాప్యం జరుగుతోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని