ఆరు నెలలకే శిథిలం.. ప్రయాణం నరకం!
eenadu telugu news
Published : 22/10/2021 00:47 IST

ఆరు నెలలకే శిథిలం.. ప్రయాణం నరకం!

న్యూస్‌టుడే, దోమ

ఐనాపూర్‌-మోత్కూర్‌గేట్‌ మధ్య కొత్తగా నిర్మించిన తారు రోడ్డు దుస్థితి

మండల పరిధిలోని ఐనాపూర్‌-మోత్కూర్‌గేట్‌ 5 కి.మీ. మార్గం దాదాపు రెండు దశాబ్దాలకుపైగా సరైన నిర్వహణలేక అధ్వానంగా తయారవడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు. దాదాపు 20 గ్రామాల ప్రజలు హైదరాబాద్‌, పరిగి, మహబూబ్‌నగర్‌ ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ దారిని వినియోగిస్తారు. ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు పలుమార్లు స్థానికులు విన్నవించడంతో.. ఎట్టకేలకు ఆరు నెలల క్రితం రూ. 2 కోట్లతో కొత్తగా తారురోడ్డు నిర్మాణం ప్రారంభించి పనులు చాలావరకు పూర్తి చేశారు. సమస్య తీరిందని అందరూ సంబరపడ్డారు. ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. నాణ్యత కొరవడటం... అధికారుల పర్యవేక్షణ లోపంతో రోడ్డు అప్పుడే పలుచోట్ల శిథిలమవుతోంది. అంచులు కుంగిపోతున్నాయి. ఈ విషయాన్ని మోత్కూర్‌ సర్పంచి ఇటీవల మండల సర్వసభ్య సమావేశంలోనూ ప్రస్తావించారు. నాసిరకం పనులు చేస్తున్న గుత్తేదారులకు అధికారులు అండగా నిలుస్తున్నారని గురువారం భాజపా దోమ మండల అధ్యక్షుడు రాంరెడ్డి విలేకర్ల సమావేశంలో ఆరోపించారు. ఈ అంశాన్ని ఆర్‌అండ్‌బీ ఏఈ మహేష్‌తో ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా.. రహదారి నిర్మాణం ఇంకా పూర్తికాలేదని... దానితోపాటుగా దెబ్బతిన్న చోట మరమ్మతు చేయిస్తామన్నారు. అప్పటి వరకు కాంట్రాక్టరుకు బిల్లులను నిలిపివేస్తామని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని