పథకం ప్రతిష్ఠాత్మకం.. ప్రగతి అథమం
eenadu telugu news
Published : 22/10/2021 00:47 IST

పథకం ప్రతిష్ఠాత్మకం.. ప్రగతి అథమం

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

అంతారంలో పునాదులకే పరిమితమైన ఇండోర్‌ స్టేడియం

పట్టణ తరహాలో వసతులు సమకూర్చేందుకు రూర్బన్‌ పథకాన్ని అమలు చేయడంతో ప్రజలంతా ఆనందం వ్యక్తం చేశారు. తమకు కావాల్సిన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆశించారు. ఏళ్లుగా పనులు నత్తనడకన సాగడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఆర్థిక సంవత్సరం చివరలో అధికారులు హడావుడి చేయడం తప్పితే పురోగతి ఉండటంలేదని, ఆ నెల దాటితే పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. నిర్వహణ కొరవడటం వల్లే ఈ దుస్థితికి కారణమని పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ పరిశీలనాత్మక కథనం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రూర్బన్‌ పథకంలో తొలివిడతలోనే తాండూరు మండలానికి చోటు దక్కింది. గ్రామాల్లో పట్టణ తరహా మౌలిక సదుపాయాలను కల్పించి అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. సుదీర్ఘ కసరత్తు అనంతరం వివిధ శాఖల అధికారులు రూపొందించిన ప్రతిపాదనలతో ప్రభుత్వం రూ.18 కోట్లు విడుదల చేసింది. నిధులు మంజూరై మూడేళ్లు దాటినా పనులు పూర్తి కావడం లేదు. ఏటా మార్చిలో నిధులు మురిగి పోతాయంటూ జిల్లా స్థాయి అధికారులు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పనులు పూర్తి చేస్తామని హడావుడి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షలు, సమావేశాలతో పరుగులు పెట్టిస్తున్నారు. మార్చి దాటాకా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామంతో ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. కొనసాగుతున్నవి సైతం నత్తనడకన సాగుతున్నాయి.

గత పాలనాధికారిణి చొరవ చూపినా..

ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి రూ.2కోట్లు విడుదలయ్యాయి. 2017లో అప్పటి రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. మూడున్నర ఏళ్లు గడిచినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. జనవరిలో అప్పటి కలెక్టర్‌ పౌసుమిబసు ప్రత్యేక దృష్టిసారించారు. అల్లాపూర్‌, జిన్‌గుర్తిలో పర్యటించి చివరకు అంతారంలో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మార్చిలో ఎంపిక చేశారు. టీీఎస్‌డీడబ్ల్యూఐడీసీ అధికారులు గుత్తేదారుతో పునాది పనులను ప్రారంభించినా, నెలరోజులు గడవక ముందే ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో రూ.కోట్లల్లో నిధులు ఖాతాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుత పాలనాధికారిణి నిఖిల చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.

చిట్టిగణాపూర్‌లో తరగతి గదుల దుస్థితి

అందుబాటులోకి రాని ఆరోగ్య ఉపకేంద్రాలు

తొమ్మిది గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్ర భవనాలను నిర్మించేందుకు రూ.కోటి కేటాయించారు. ఇటీవల అంతారం, అల్లాపూర్‌, మల్కాపూర్‌లో నిర్మాణాలు పూర్తి చేశారు. భవనాలను వినియోగంలోకి తీసుకురావడంతో వృథాగా ఉంచారు. బెల్కటూరు, కరణ్‌కోటలో నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత భవనాలు సమకూర్చకపోవడంతో పదులసంఖ్యలో గర్భిణులు, బాలింతలకు నెలనెలా అద్దె గదులు, డ్వాక్రా భవనాలు, రైతు వేదికలు, పంచాయతీ గదుల్లో వైద్య పరీక్షలు చేసేందుకు ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులకు టీకా పంపిణీకి సైతం అసౌకర్యంగా మారింది. ఇటీవల గ్రామాల్లో కరోనా టీకా పంపిణీ చేస్తుండగా ఆరోగ్య ఉప కేంద్రాలు లేకపోవడంతో వీధులు, రహదారులు, రైతు వేదికల్లో టీకా పంపిణీ చేయాల్సి వచ్చింది. వెంటనే ఆరోగ్య ఉప కేంద్రాలను అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.


ఆరుబయట.. చెట్లకింద

మండలంలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో 14 అదనపు తరగతి గదులను నిర్మించేందుకు రూ.1.16 కోట్లు కేటాయించారు. ఒక్కో తరగతి గది నిర్మాణానికి రూ.8.30లక్షలు మంజూరు చేశారు. చిట్టిగణాపూర్‌లో 2018లో పనులు చేపట్టగా ఇప్పటివరకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఐదు తరగతులకు ముగ్గురు ఉపాధ్యాయులు పాఠాలను బోధించేందుకు ఒకే తరగతిలో సాధ్యపడక ఆరు బయట, చెట్ల కింద నెట్టుకొస్తున్నారు. వర్షం కురిస్తే చెట్ల కింద, మైదానంలో కూర్చునే వీలులేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్కనే అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నా అసంపూర్తిగా ఉంచడంతో ఉపయోగం లేకుండాపోయింది. కోటబాస్పల్లి, అంతారం, గోనూరులోనూ తరగతి గదుల నిర్మాణంలో తాత్సారం చేస్తుండటంతో ఆటంకంగా మారుతోంది. కరోనా సమయంలో నెలల తరబడి బోధన నిలిచిపోయింది. ఆ సమయంలో పనులు పూర్తి చేసి ఉంటే ప్రస్తుతం విద్యార్థులకు సౌకర్యంగా ఉండేది. అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యంతో ఏళ్ల తరబడి అసంపూర్తి పనులతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.


రెండు వారాల్లో పూర్తి చేయిస్తాం

రాజు, డీఈ, టీఎస్‌డీడబ్ల్యూఐడీసీ

ఇండోర్‌ స్టేడియం పనులు చేపట్టేందుకు ముడిసరుకు తరలించాం. వెంటనే గుత్తేదారుతో పనులు పునరుద్ధరింపజేస్తాం. అదనపు తరగతి గదులు, ఆరోగ్య ఉపకేంద్ర భవనాల నిర్మాణాలు నవంబరు మొదటి వారంలోగా పూర్తి చేయించి అప్పగిస్తాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని