గాలి పీల్చలేం.. ఘడియ ఉండలేం
eenadu telugu news
Published : 22/10/2021 01:34 IST

గాలి పీల్చలేం.. ఘడియ ఉండలేం

విషం చిమ్ముతోన్న జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు

నరకం చూస్తోన్న 18 గ్రామాలు

ఈనాడు, హైదరాబాద్‌, జవహర్‌నగర్‌, న్యూస్‌టుడే

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు

వహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు గాలిలోకి విషం చిమ్ముతోంది. గాఢ దుర్గంధంతో జనం శ్వాస పీల్చుకోలేకపోతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో.. డంపింగ్‌ యార్డు చుట్టూ ఉన్న 18 గ్రామాల ప్రజలు నరకం చూస్తున్నారు. రెండున్నర లక్షల మంది స్థానికులు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. వ్యర్థాల నిర్వహణలో లోపాలతో తమ బతుకులు ఛిద్రమవుతున్నాయని అధికార పార్టీ నేతలే నిరసన గళం వినిపిస్తుండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఇటీవల తమ ప్రాంత ప్రజల సమస్యను దమ్మాయిగూడ పురపాలక సంస్థ ఛైర్‌పర్సన్‌ ప్రణీత ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం.

సరిపోని నిర్వహణ సామర్థ్యం

డంపింగ్‌ యార్డు నిర్వహణ పనులు మొదలైనప్పుడు గ్రేటర్‌ నుంచి రోజూ 2,500 - 3,500టన్నుల చెత్త అక్కడికి చేరేది. దానికి తగ్గట్లు నిర్వహణ సంస్థ రాంకీ ఏర్పాట్లు చేసుకుంది. ఇప్పుడు 7,500 టన్నుల చెత్త నిత్యం తరలుతుండటంతో సమస్య తీవ్రమైంది.

అడుగడుగునా నిర్వహణ లోపాలు

* సామర్థ్యం సరిపోక రాంకీ సంస్థ రోజువారీ చెత్తలో సగం టిప్పింగ్‌ ఫ్లోర్‌పై బహిరంగంగా పడేస్తోంది.

* చెత్త నుంచి వచ్చే మురుగుతో మల్కారం చెరువు నిర్జీవమైంది. భూగర్భ జలం కలుషితమై పొలాలు బీళ్లుగా మారాయి. గాలి వీచినప్పుడు చెరువు చుట్టూ వాసన తీవ్రంగా ఉంటుంది.

ప్రత్యామ్నాయాలే పరిష్కారం

ఈ యార్డుపై ఒత్తిడి పెరిగిందని జీహెచ్‌ఎంసీ ఈఈ శ్రీనివాస్‌ అన్నారు. కనీసం మరో రెండు ప్రత్యామ్నాయ యార్డులుండాలని, నగరం చుట్టూ నాలుగు చోట్ల నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

పేరుకు పోయిన వ్యర్థాలు..  14 మిలియన్‌ టన్నులు

డంపింగ్‌ యార్డు విస్తీర్ణం.. 351 ఎకరాలు


ప్రభావిత గ్రామాలు..

రిదాసుపల్లి, చెన్నాయిపల్లి, జవహర్‌నగర్‌, బాలాజీనగర్‌, అంబేడ్కర్‌నగర్‌, మల్కారం, రాజీవ్‌గాంధీ నగర్‌, కార్మిక నగర్‌, గబ్బిలాలపేట, శాంతి నగర్‌, ప్రగతి నగర్‌, బీజేఆర్‌ నగర్‌, దమ్మాయిగూడ, అహ్మద్‌గూడ, తిమ్మాయపల్లి, నాగారం, బండ్లగూడ, రాంపల్లి


పది రోజులుగా తీవ్రమైన వాసన: శ్రీనివాస్‌రెడ్డి, దమ్మాయిగూడ

దిరోజులుగా తీవ్ర దుర్వాసన వస్తోంది. ఇంటి తలుపులు తెరవలేకపోతున్నాం. రాత్రయితే గాలి పీల్చుకోవడమే కష్టమవుతోంది.


చెరువుల్లోకి కలుషిత నీరు: కొత్తకొండ రాజు, అంబేడ్కర్‌నగర్‌

గాలితో పాటు చెరువులు, కుంటలు తీవ్రంగా కలుషితమవుతున్నాయి. వర్షాలతో తీవ్రత మరింత పెరిగింది. రాబోయే చలికాలాన్ని తలచుకుంటే భయం రెట్టింపవుతోంది. దోమలు, ఈగలు, ప్లాస్టిక్‌ కవర్లు, చెత్త కాగితాలతో జనావాసాలు మురికి కూపాలుగా మారుతున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని