చిత్ర వార్తలు
eenadu telugu news
Updated : 23/10/2021 05:24 IST

చిత్ర వార్తలు

నగరం గులాబీ మయం

తెరాస ప్లీనరీ ఈ నెల 25న జరగనున్న నేపథ్యంలో హైటెక్‌సిటీ ప్రాంతం మొత్తం ఆ పార్టీ జెండాలు, కటౌట్లు, తోరణాలు, హోర్డింగులతో గులాబీమయంగా మారింది. హైటెక్స్‌కు వెళ్లే ప్రధాన మార్గాల్లో కేసీఆర్‌, కేటీఆర్‌ల చిత్రాలతో కూడిన భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.

-న్యూస్‌టుడే, మాదాపూర్‌


జాగ్రత్తలు ఒట్టి ముచ్చట

కరోనా ఉద్ధృతి తగ్గడంతో నగరంలో మళ్లీ జాగ్రత్తలు పాటించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికులు, సందర్శకులు సంచరించే ప్రాంతాల్లో సైతం నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయడం లేదనేందుకు ఈ చిత్రాలే నిదర్శనం. జూపార్కులో టెంపరేచర్‌ పరీక్షించే మిషన్‌ ఉన్నా ఉపయోగించడం లేదు. శానిటైజర్‌ ఓ పక్కగా ఉండడంతో ఎక్కడుందో తెలియని పరిస్థితి. మరోవైపు ఎంజీబీఎస్‌ ప్రధాన ద్వారం వద్ద కనీసం శానిటైజర్‌ కూడా లేదు.


నా ఉమ్మే నాకు రక్ష!

మొక్కలో ఓ కొమ్మకు నిండుగా వచ్చిన పత్తిలా కనిపిస్తోంది కదూ.. స్పిటిల్‌ బగ్స్‌గా పేరున్న ఉమ్మే కీటకాలు తమ రక్షణ కోసం ఏర్పరుచుకున్న బుడగ ఇది. మొక్క దారువును కత్తిరించి అందులో నీటిని ఆహారంగా తీసుకుంటాయి. ఆ క్రమంలోనే చుట్టూ అనేక పొరల నురుగును ఏర్పాటుచేసుకుని రక్షణ పొందుతాయని జడ్చర్ల వృక్షశాస్త్ర సహాయ ఆచార్యులు డా.సదాశివయ్య తెలిపారు.


మీనం.. మేడపై రమణీయం!

చేప ఇంటిపై ఉంటే మత్స్యావతారంలోని విష్ణుమూర్తి కృప ఉన్నట్టే అని ఉప్పల్‌ చిలుకానగర్‌కు చెందిన అంబటి జగదీష్‌ రూ.లక్షన్నర వెచ్చించి ఇలా భారీ బొమ్మను మేడపై ఏర్పాటు చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన ముగ్గురు నిపుణులు రెండు నెలలు శ్రమించి ఈ నిర్మాణం పూర్తి చేశారని ఆయన చెప్పారు.


కరోనా తొలగి కొత్త కాంతులు!

దీపావళి పండుగ సమీపిస్తుండటంతో నగరంలోని కుమ్మరివాడలో ప్రమిదలు, దొంతుల తయారీ పనుల్లో కుమ్మరి కార్మికులు నిమగ్నమయ్యారు. రెండేళ్లు కరోనాతో పూర్తిగా దెబ్బతిన్న వ్యాపారం ఈసారి ఆశా జనకంగా ఉందని చెబుతున్నారు.


బాధ్యత మరిచి.. బడిని చెత్త దిబ్బగా మార్చి!

తాండూరు మండలం కరణ్‌కోట ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో స్థానికులు చెత్తను బడి ఎదుట వేస్తున్నారు. ఉపాధ్యాయులు ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోవడంలేదు. వరహాలు, శునకాలు సంచరించడంతో విద్యార్థులకు భోజనం ఇబ్బందులు తప్పడంలేదు. రూ.లక్షలు వెచ్చించి చెత్తదిబ్బ, ట్రాక్టర్‌, ఆటో రిక్షాలు సమకూర్చినా చెత్త సేకరణ లక్ష్యం నెరవేరడంలేదు. ఇప్పటికైనా పంచాయతీ పాలకవర్గం దృష్టి సారించాలని కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ


అడుగుకో గొడుగు..

తాండూరులో కూరగాయలు విక్రయించేందుకు చిరు వ్యాపారులకు ప్రత్యేకమైన స్థలం లేదు. రైతు బజారు ఉన్నా, వినియోగించడంలేదు. చేసేది లేక వీరంతా ప్రధాన రహదారుల వారగా తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డు పొడవునా వ్యాపారులు రంగుల గొడుగుల కింద వ్యాపారాలు నిర్వహించడం అందరిని అటు వైపు దృష్టి మరల్చేలా చేస్తోంది.

- న్యూస్‌టుడే, తాండూరు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని