నిమ్స్‌లో పడక దొరకదు.. ప్రాణం నిలవదు
eenadu telugu news
Published : 23/10/2021 02:57 IST

నిమ్స్‌లో పడక దొరకదు.. ప్రాణం నిలవదు

పడకల సామర్థ్యం 1500

నిత్యం ఓపీ 2000


అత్యవసర ద్వారం ముందు అంబులెన్స్‌లో వేచి ఉన్న రోగులు

ఈనాడు, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఈనాడు, హైదరాబాద్‌: విజయవాడకు చెందిన ఓ వృద్ధురాలిని గురువారం అర్ధరాత్రి 2 గంటలకు నిమ్స్‌ అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమంగా ఉందని చేర్చుకోవాలని విధుల్లో ఉన్న వైద్యుల్ని కోరారు. పూర్తిగా పరీక్షించకుండానే ఇక్కడ ఎంఆర్‌ఐ యంత్రం పనిచేయడం లేదని, చేర్చుకోలేమని చెప్పారు. ఉదయం ఆరుగంటల వరకు ప్రమాదకర పరిస్థితిలోనే రోగి అంబులెన్స్‌లో ఉండిపోయారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికెళ్లడంతో అప్పుడు స్పందించి ప్రవేశం కల్పించారు.

పంజాగుట్ట నిమ్స్‌లో రోగులకు వైద్యం అందుతున్న తీరుకు నిదర్శనం ఈ ఘటన. ఆసుపత్రికి వచ్చినా ప్రవేశం దొరకాలంటే గంటలు నిరీక్షించక తప్పదు. ముందు డ్యూటీ డాక్టర్‌కు సమస్యను వివరించాలి. ఆ వైద్యుడు రోగిని పరిశీలించేందుకు గంట, అనంతరం ప్రవేశం కోసం మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే. రోగిని చూసిన వైద్యుడు పరిస్థితి విషమంగా ఉన్నా.. ఇక్కడ పడకలు ఖాళీగా లేవని చెబుతారు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో దారిమధ్యలోనే కొందరు చనిపోతున్నారు. నిమ్స్‌లో వైద్యం కోసం వచ్చిన 50మంది రోగులు రోజూ తిరిగి వెళ్లిపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్ఛు నిమ్స్‌ పాలకవర్గం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై విమర్శలు రేగుతున్నాయి.

ఇలా ఎందుకు జరుగుతోందంటే!

సామాన్యులకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో నిమ్స్‌ను ఏర్పాటైంది. ఇందులో ఎక్కువ మంది రోగులు అత్యవసర వైద్యం కోసం చేరుతుంటారు. ఈ విభాగంలో 96 పడకలుండగా 30 వెంటిలేటర్‌వి. ఎవరైనా రోగి ఆరోగ్యం విషమించి ఆస్పత్రిలోకి చేరడానికి వచ్చిన వెంటనే అత్యవసర విభాగంలో పడకను కేటాయించి పరీక్షలు చేయాల్సి ఉంది. రోగ నిర్ధారణ తర్వాత ఆయా విభాగాలకు పంపాలి. ఇక్కడ అలా జరగడం లేదు. అనేకమందికి రోజులు గడిస్తే గానీ పరీక్షలన్నీ పూర్తి కావడం లేదు. దీంతో అత్యవసర విభాగంలో కొత్త వారికి అవకాశం లేకుండా పోతోంది.

సిఫార్సు ఉంటేనే వెంటిలేటర్‌ పడక

30 వెంటిలేటర్‌ పడకల్లో అధికారుల నిర్లక్ష్యంతో 10 ఎప్పుడూ మరమ్మతుల్లోనే ఉంటాయి. మిగిలిన 20 ఏమూలకు సరిపోవడం లేదు. రోజూ వెంటిలేటర్‌ పడక కోసం 30 మంది వస్తుంటే ఒకరిద్దరికి అదీ రాజకీయ నేత సిఫార్సు ఉంటే లభిస్తోంది.

పని చేయని పరికరాలు

ఆస్పత్రి కొత్త భవనంలో ఒకటి, పాత భవనంలో ఒక ఎంఆర్‌ఐ యంత్రాలున్నాయి. పాత భవనంలో యంత్రం మరమ్మతుల్లోనే ఉంటోంది. కొత్తదీ నిర్వహణ సరిగాలేక తరచూ మొరాయిస్తోంది. ఇతర యంత్రాలదీ ఇదే తీరు..

అన్ని రకాల చర్యలు తీసుకుంటాం : - నిమ్మ సత్యనారాయణ, మెడికల్‌ సూపరింటెండెంట్‌

ప్రతి ఒక్కరికి వైద్యం అందించడానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని సమస్యలున్నా వాటికి అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మరమ్మతుల్లో ఉన్న యంత్రాలను వెంటనే బాగు చేయిస్తున్నాం. అత్యవసర విభాగంలో పడకల ఖాళీలను బట్టి రోగులను చేర్చుకుంటున్నాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని