ఆరుతడి.. అధిక రాబడి
eenadu telugu news
Published : 23/10/2021 05:30 IST

ఆరుతడి.. అధిక రాబడి


అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారులు

న్యూస్‌టుడే,వికారాబాద్‌: వరిని తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తేనే మేలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులను ఆ దిశగా సమాయత్తం చేసేందుకు వ్యవసాయశాఖ అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం వద్ద పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు నిల్వ ఉండటంతో బియ్యం సేకరణపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆరుతడి పంటలు సాగు చేయాలంటూ ప్రభుత్వం ముమ్మర ప్రచారాన్ని మొదలుపెట్టింది.

జిల్లాలో మూడేళ్లుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో ఆయకట్టు భూములకు రెండు పంటలకు సరిపడా సాగు నీళ్లు అందుతుండటంతో రైతులు అధికంగా వరి సాగు చేస్తున్నారు. వానాకాలం సీజన్‌లో 4.86 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా అందులో 1.5 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. 98 వేల ఎకరాల్లో పత్తి, 80 వేల ఎకరాల్లో కంది, 85 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 20 వేల ఎకరాల్లో మినుము, పెసర, మిగతా దాంట్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. సాగు విస్తీర్ణంలో 25 నుంచి 30 శాతం వరకు వరి పంటనే రైతులు సాగు చేస్తున్నారు. సాధారణంగా యాసంగిలో సాగు చేసే ధాన్యాన్ని అధికంగా బాయిల్డ్‌ బియ్యంగా మారుస్తూ ఉంటారు. భారత ఆహార సంస్థ వద్ద పెద్ద ఎత్తున బాయిల్డ్‌ రైస్‌ నిల్వలు ఉండటంతో వచ్చే సీజన్‌లో బాయిల్డ్‌ రైస్‌ సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని రాష్ట్ర ప్రభుత్వం బావించి, అన్నదాతల దృష్టిని మరల్చాలని చూస్తోంది.

యాసంగిలో.: యాసంగి సీజన్‌ అక్టోబరు నుంచి డిసెంబరు వరకు రైతులు నీటి అవసరాన్ని బట్టి ఆరుతడి పంటలను సాగు చేస్తూ ఉంటారు. అదే విధానాన్ని కొనసాగించేలా చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, వంట నూనె ఉత్పత్తుల పంటల సాగు విస్తీర్ణం పెరగడం లేదు. కూరగాయల సాగు కూడా పెరగడం లేదు. గతంలో జిల్లాలో అత్యధికంగా వేరుసెనగతో పాటు జొన్న, మొక్కజొన్న, పెసర, బెబ్బర, కంది, శనగ, మినుము, పంటలను రైతులు సాగు చేసేవారు. కాలక్రమేణా నీటి వసతి పెరగడంతో పాటు అడవిపందులు, కోతుల బెడద వల్ల వరి, పత్తి పంటల వైపే మొగ్గు చూపారు. రైతు వేదికల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు.

వరికి బదులు ఇతర పంటలే మేలు: గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి

యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయంగా వేరుసెనగ, జొన్న, తదితర పప్పు దినుసుల పంటలను సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. వరి సాగు చేయడం వల్ల కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు ఏర్పడనున్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపునకు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని