కన్నీటి సుడుల్లో బంధాలు
eenadu telugu news
Published : 23/10/2021 05:47 IST

కన్నీటి సుడుల్లో బంధాలు

ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట

సరదాగా స్నేహితులు, కుటుంబీకులతో ఈత కొడదామని ఒకరు.. చేపల వేటకు వెళ్లి మరొకరు.. మద్యం మత్తులో నీటిలో దిగి ఇంకొకరు.. ఇలా కారణాలు ఏవైనా ఎంతోమంది వనరుల్లో ప్రమాదవశాత్తు పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. వెరసి బాధిత కుటుంబాలు కన్నీటి సుడుల్లో చిక్కుకుంటున్నాయి. సరదాకు ఈతకు వెళ్లి పసిప్రాయంలో ప్రాణాలు కోల్పోయి కుటుంబాల్లో తీరని విషాదం నిండుకున్న సందర్భాలు కొన్నయితే.. బతుకుదెరువుకు మత్స్యకారులు వనరుల్లో పడి మృత్యువాత పడటంతో వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లోని పరిస్థితి, దిక్కు లేకుండా మారిన కుటుంబాలపై ప్రత్యేక కథనం.

సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాగులు, చెరువులు, చెక్‌డ్యాంలు, కుంటలు జలకళతో ఉట్టిపడుతున్నాయి. నాలుగు జిల్లాల్లో 7,622 చెరువులు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నపూర్ణ, రంగనాయక్‌, మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ జలాశయాలు నిర్మించారు. మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో మంజీరా నది ప్రవహిస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా నీటిని వదలగా, దిగువకు వరద ప్రవహించింది. దీంతో మెదక్‌ జిల్లా ఘనపూర్‌ ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల జలదిగ్బంధంలోనే ఉండిపోయిన విషయం తెలిసిందే. ఇలా నీటి వనరులన్నీ నిండుగా ఉండగా వివిధ కారణాలతో వాటిలోకి వెళ్లిన వారు మృతి చెందడం గమనార్హం.

సరైన రక్షణ లేక..: నాలుగు జిల్లాల్లో చెరువులు, వాగుల వద్ద రక్షణ చర్యలు కరవయ్యాయి. చేపల వేటకు వెళ్లే వారి సంఖ్య దృష్ట్యా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. హెచ్చరిక సూచికలు ఏర్పాటు అవశ్యం. అంతేకాక సిద్దిపేట జిల్లాలో జలాశయాల నిర్మాణాల దృష్ట్యా ఆయా చోట్ల మరింత ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. కొంతమంది అవగాహన రాహిత్యంతో కాలువల్లో దిగి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. కాలువలకు నీళ్లు వదిలిన సమయంలో భద్రతా సిబ్బందిని ఉంచి ఎవరూ అటువైపు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. దీనికితోడు వనరుల్లో జేసీబీ గుంతలు సైతం చిక్కుల్లో పడేస్తున్నాయి. ఈ విషయమై చర్యలు చేపట్టాలి.

జిల్లాల్లో మృతుల సంఖ్య (ఈ ఏడాది ఇప్పటి వరకు..)

సిద్దిపేట: 123

సంగారెడ్డి: 47

మెదక్‌: 35


అరుణదే భారం..

మండల కేంద్రం కందికి చెందిన మన్నె వెంకటేశ్‌ (43) చేపలు పట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతడికి భార్య అరుణతో పాటు 15 ఏళ్ల కుమార్తె అంజలి, కుమారుడు రాజేశ్‌లు ఉన్నారు. ఈ నెల 8న చిమ్మాపూర్‌లోని పాత చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చెరువులో వల విసరగా అదే తన కాళ్లకు చుట్టుకొని నీట మునిగి పోయి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పిల్లల భారమంతా అరుణపైనే పడింది. ఆమె కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.

- న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, కంది


తల్లిదండ్రుల ప్రేమకు దూరమై..

మిరుదొడ్డి మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన చెప్యాల రోజా ఏడాది క్రితమే భర్త మృతి చెందగా.. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ నెల 13న దుబ్బాక మండలం ఎనుగుర్తి గ్రామంలోని పుట్టింటికి వచ్చారు. మరుసటి రోజు స్థానిక చెరువు వద్దకు తన ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లింది. గట్టు మీద దుస్తులు శుభ్రం చేసుకుంటుండగా సమీపంలో ఆడుకుంటున్న తన చిన్న కుమార్తె చైత్ర (5) ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయింది. దీన్ని గమనించిన రోజా కూతురిని కాపాడేందుకు చెరువులో దూకింది. నీట మునిగి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో పెద్ద కూతురు రష్మిక చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమైంది. ప్రస్తుతం అమ్మమ్మ, తాతయ్య దగ్గరే ఉంటోంది.

- న్యూస్‌టుడే, దుబ్బాక


పెద్ద దిక్కు కోల్పోయి..

భర్త, పిల్లలతో భాగ్య

చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ గ్రామానికి చెందిన బండి రాజు గత జులై 4వ తేదీన చేపలు పట్టేందుకని రంగనాయక్‌సాగర్‌ జలాశయం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా మూర్ఛ రావడంతో నీటిలో పడి మృతిచెందాడు. ఈ ప్రమాదంతో భార్య భాగ్య, ముగ్గురు కుమార్తెలు దిక్కులేని వారయ్యారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం భాగ్య కూలీ పనులు చేస్తూ ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్నారు.

- న్యూస్‌టుడే, చిన్నకోడూరు


పూట గడవడం కష్టమై..

రామాయంపేట మండలం అక్కన్నపేట కు చెందిన తొగరి గోపాల్‌ లారీ డ్రైవరుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. అతడికి భార్య శ్రీలత, ఐదేళ్లలోపు కుమార్తె, కుమారుడు ఉన్నారు. బంధువు అంత్యక్రియలకు వెళ్లిన గోపాల్‌ చెరువులో దిగగా ప్రమాదవశాత్తు నీటి ముగిని మృత్యువాత పడ్డాడు. దీంతో ఆయనపై ఆధారపడిన కుటుంబం వీధిన పడింది. ప్రస్తుతం పూట గడవటమే కష్టమైంది. గోపాల్‌ రెండేళ్ల క్రితం ప్రమాదంలో గాయపడిన సమయంలో వైద్యానికి ఉన్న కొద్దిపాటి భూమిని అమ్మారు. వారికి ఏ ఆధారం లేకపోవడంతో పాటు చిన్న రేకుల ఇంట్లో ఉంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

- రామాయంపేట


ఊహించే ప్రాణాలు కోల్పోయి..

చిలప్‌చెడ్‌ మండలం ఫైజాబాద్‌ గ్రామానికి చెందిన ముప్పారం సురేష్‌ దినసరి కూలీ. ఇతడికి ఆరేళ్ల కిందట ఇదే మండలం బండపోతుగల్‌కు చెందిన నీరజ అనే యువతితో వివాహం జరిగింది. వీరికి 4 ఏళ్ల కుమారుడు, 20 రోజుల కిందట పాప పుట్టింది. సురేష్‌ కూలీ పనులు చేస్తూ తల్లిని, భార్యాపిల్లలను పోషించాడు. ఇటీవల మంజీరా నదిలో చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఇతడి తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లికి ఆసరాగా నిలిచాడు. అతడిపై ఆధారపడిన కుటుంబమంతా ఇప్పుడు దిక్కులేనిదైంది. ప్రభుత్వ సాయానికి ఎదురు చూస్తోంది ఈ దీన కుటుంబం.

- చిలప్‌చెడ్‌


కుటుంబానికి దూరమై..

బాలప్ప కుటుంబం

తాండూరు మండలం గౌతాపూర్‌ గ్రామానికి చెందిన తలారి బాలప్ప, కమలమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషించేవాడు. ఆరు నెలల కిందట బాలప్ప చేపలు పట్టేందుకు గ్రామ సమీపంలోని చెరువుకు వెళ్లాడు. ఈ క్రమంలో వల తన కాళ్లకు చుట్టకొని విగతజీవిగా మారాడు. దీంతో భార్యాపిల్లలు అనాథలుగా మారారు. ఆ కుటుంబం రోడ్డున పడింది. కమలమ్మ నిత్యం పనులు చేసుకుంటూ పిల్లల భారం మోస్తోంది. పెద్ద కూతురు మహేశ్వరికి అప్పు చేసి మూడు నెలల కిందట పెళ్లి చేసింది. ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు.

- తాండూరు టౌన్‌


అండగా ఉంటాడని అనుకున్న వేళ!

కుటుంబానికి అండగా ఉంటాడని అనుకున్న వేళ చేతికొచ్చిన కుమారుడు కన్ను మూయడం ఆ తల్లిదండ్రులకు కడుపుకోతనే మిగిల్చింది. జహీరాబాద్‌ మండలం చిన్నహైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌(24) ఈనెల 15న శ్రీశైలం దర్శనానికి ద్విచక్ర వాహనాలపై మిత్రులతో కలిసి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో డిండి ప్రాజెక్టు వద్ద స్వీయచిత్రం దిగుతుండగా కాలుజారి నీటిలో పడిపోయిన స్నేహితుడు మహ్మద్‌ సాగర్‌ను కాపాడబోయిన ప్రవీణ్‌కుమార్‌ ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కొల్పోయాడు. హైదరాబాద్‌లోని ప్రైవేటు పరిశ్రమలో ఉద్యోగం చేస్తుండగా ప్రమాద ఘటనలో మరణించడంతో తల్లిదండ్రులు హన్మంతు, శారమ్మ పోషించే కొడుకును కొల్పోయారు. మృతుడికి ఇద్దరు తమ్ముళ్లు సైతం ఉన్నారు.

- న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని