దారులు దారుణం.. ప్రయాణాలు చేయలేం!
eenadu telugu news
Published : 24/10/2021 00:49 IST

దారులు దారుణం.. ప్రయాణాలు చేయలేం!

తాండూరు పట్టణం నలువైపులా ఇదే దుస్థితి

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌, న్యూస్‌టుడే, తాండూరు టౌన్‌

కరణ్‌కోట్‌ రహదారి మధ్యలో పోసిన నాపరాయి వ్యర్ధాలు

● తాండూరు-వికారాబాద్‌ మార్గాన్ని రెండు వరుసలుగా విస్తరించడానికి నాలుగేళ్ల క్రితం రూ.52.20 కోట్లు మంజూరయ్యాయి. ధారూర్‌ నుంచి అల్లిపూర్‌ వరకు విస్తరణ పనులు జరిగాయి. మిగతాచోట్ల అసంపూర్తిగా మిగిలాయి. ఈ దారిలోనే మరో రూ.20 కోట్లతో వంతెన నిర్మాణం కొనసాగుతోంది. భారీ వర్షం కురిస్తే అక్కడ తాత్కాలిక దారులు తెగిపోతాయి. గతేడాది మూడు నెలలు ప్రత్యామ్నాయంగా కొడంగల్‌, పరిగి మీదుగా రాకపోకలు సాగించాల్సి వచ్చింది.

● వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోందని తాండూరు బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి రూ.78 కోట్లు కేటాయించారు. 2017 ఫిబ్రవరిలో పనులు ప్రారంభించారు. ఇప్పటికీ అతీగతి లేదు. దీంతో ప్రధాన పట్టణం నుంచే వాహన రాకపోకలు సాగుతున్నాయి.

● తాండూరు-కోట్‌పల్లి దారిలో సుమారు రెండు కిలోమీటర్ల అభివృద్ధికి రూ.కోటి కేటాయించారు. కంకరపోసి వదిలేయడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు.

జిల్లాలో తాండూరు కీలకమైన పట్టణం. ఇక్కడి నుంచి బయట ప్రాంతాలకు వెళ్లాలన్నా, ఇతర చోట్ల నుంచి రావాలన్నా ప్రజలు జంకుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ధ్వంసమైన రహదారులే. ఎటు చేసినా అసంపూర్తిగా వదిలేసిన పనులే కనిపిస్తున్నాయి. చేపట్టిన వాటిలోనూ నాణ్యతా లోపాలు ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాండూరు నుంచి వికారాబాద్‌, పెద్దేముల్‌, కరణకోట్‌, చించోలి, కొడంగల్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే రోడ్లు దారుణంగా మారాయి. అడుగడుగునా ఉన్న గుంతలను పూడ్చడానికి స్థానికులు నాపరాయి వ్యర్థాలను తెచ్చి పోస్తున్నారు. దీంతో వాహనాల చక్రాలు దెబ్బతింటున్నాయని చోదకులు పేర్కొంటున్నారు. ఇక ప్రమాదాల్లో పలువురు గాయపడుతున్నారు. వీరిలో కొందరు సుదీర్ఘకాలం చికిత్స తీసుకోవాల్సి రావడంతో ఆర్థికంగా గుల్లవుతున్నారు. తాండూరులో సిమెంటు, నాపరాయి పరిశ్రమలు అధికం. దీంతో సరకు తరలింపు కోసం నిత్యం పెద్దసంఖ్యలు లారీలు తిరుగుతుంటాయి. ఇలాంటిచోట ప్రధాన రహదారులపై రెండు నుంచి మూడు అడుగుల లోతు గుంతలు ఉండటం గమనార్హం. తాండూరు-చించోలి, కొడంగల్‌ రహదారి పరిస్థితి దయనీయంగా ఉంది. తాండూరు నుంచి కొడంగల్‌ 20 కిలోమీటర్లు ప్రయాణించాలంటే కనీసం గంట సమయం పడుతోందని వాహనదారులు చెబుతున్నారు. మరోవైపు పట్టణంలో రూ.25 కోట్ల నిధులతో చేపట్టిన అంతర్గత రహదారులను మిషన్‌ భగీరథ పైపులైన్‌ కోసం తవ్వేశారు. దీంతో అవీ రూపు కోల్పోయాయి.

పట్టణంలో అంతర్గత రహదారి దుస్థితి

గుత్తేదారులపై ఒత్తిడి పెంచుతున్నాం..

- లాల్‌సింగ్‌, జిల్లా రహదారులు, భవనాల శాఖాధికారి

పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. గుత్తేదారులపై ఒత్తిడి పెంచితే చేస్తున్నారు. పూర్తయిన వాటికి బిల్లులు రావడం లేదని ఆపేస్తున్నారు. ఇటీవల వర్షాలు ఎక్కువగా కురుస్తుండటంతో పనులు చేపట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం బిట్లు బిట్లుగా మరమ్మతులు చేపడుతున్నాం.

దుమ్ము లేస్తోంది..: లాలమ్మ, మల్కాపురం, తాండూరు

దారులు దారుణంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారి మంచిగ ఉంటే అంతా మంచిగ ఉంటది. మేం కూలీ చేసుకుని బతుకుతున్నాం. తాండూరు-కరణ్‌కోట దారిలో దుమ్ము లేస్తుండటంతో ఊపిరి తీసుకోలేకపోతున్నాం.

తరచూ ప్రమాదాలు: జానీ, ఆటో డ్రైవర్‌

తాండూరు- చించోలి రోడ్డంతా గుంతలే... పెద్ద సంఖ్యలో సిమెంటు లారీలు తిరుగుతుండటంతో మరింత దెబ్బతింటోంది. నిత్యం ఇదే దారిలో ఆటో నడిపిస్తాను. దాదాపు నాలుగేళ్లుగా ఎన్నో ప్రమాదాలు చూశాను. నా కళ్ల ముందే కొందరికి కాళ్లు విరిగిపోయాయి.

ఎవరూ స్పందించడం లేదు: శివకుమార్‌, కాలనీ వాసి

దశాబ్దాలుగా ఈ రహదారి ఇలాగే ఉంటోంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులు హామీలు ఇస్తున్నారేగానీ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మూడు నెలల క్రితం కొడంగల్‌ నుంచి తాండూరు వరకు పాదయాత్ర చేశాం. అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినా స్పందించడం లేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని