వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
eenadu telugu news
Published : 24/10/2021 00:49 IST

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

మృతుడు బేగరిమల్లేష్‌

నారాయణఖేడ్‌: ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఖేడ్‌ ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఖేడ్‌ మండలం రుద్రారం గ్రామానికి చెందిన బేగరి మల్లేష్‌(19) గ్రామంలో కూలి పనులు చేస్తుంటాడు. శుక్రవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై ఖేడ్‌కు వచ్చి రాత్రి తిరిగి సొంత గ్రామానికి వెళ్తున్నాడు. అంత్వార్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో మల్లేష్‌ తలతోపాటు ఇతర భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కకే మృతిచెందాడు. ఆటో డ్రైవరు అతివేగం, అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు మల్లేష్‌ తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


అదుపుతప్ఫి. చెట్టుకు ఢీకొని..

రామాయంపేట, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్‌లో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ రాజేష్‌ తెలిపిన వివరాలు.. కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండలం భాగీర్తిపల్లికి చెందిన రాజం శంకర్‌ (38) చేపలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం భాగీర్తిపల్లిలోని కొత్త చెరువులో చేపలు పట్టేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కోనాపూర్‌ శివారులోకి రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొట్టాడు. దీంతో కాలువలో ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గుర్తించి ఆయన్ను చికిత్స నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి 108 వాహనంలో తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యుడు తేల్చిచెప్పారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.


సంతకు వెళ్లి తిరిగొస్తుండగా..

గడిపెద్దాపూర్‌ (అల్లాదుర్గం), న్యూస్‌టుడే: సంతకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన అల్లాదుర్గం మండలం 161 జాతీయ రహదారిలో గడిపెద్దాపూర్‌ గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు.. సంగారెడ్డి జిల్లా అందోలు మండలం నేరడిగుంటకు చెందిన క్యాసారం మహేశ్‌ (32) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం మెదక్‌ జిల్లా టేక్మాల్‌లో జరిగిన సంతలో మేకలు కొందామని తన బంధువుతో కలిసి ద్విచక్ర వాహనంపై వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో గడిపెద్దాపూర్‌ గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వచ్చిన చిన్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో మహేశ్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయమై స్థానిక ఎస్‌ఐ మోహన్‌రెడ్డిని వివరణ కోరాగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.


ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్టు

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: ఎండు గంజాయి రవాణా, విక్రయిస్తున్న ఇద్దరు యువకులను ఆబ్కారీ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. ఆబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ మోహన్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. విశ్వసనీయ సమాచారం మేరకు సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన ఎం.నవీన్‌ (నర్సాపూర్‌ మండలం చిప్పల్‌తుర్తి), వినీత్‌కుమార్‌ (మర్పల్లి మండలం కల్కోడ్‌)లను అరెస్టు చేసి విచారించారు. ఎండు గంజాయి రవాణా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గంజాయి పొట్లాలను తయారు చేసి సంగారెడ్డిలో విద్యార్థులు, కార్మికులకు విక్రయిస్తునట్లు నిర్ధారించారు. నిందితుల నుంచి 1.5 కిలోల ఎండు గంజాయి, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని