చెత్త నిర్ణయాలు!
eenadu telugu news
Published : 24/10/2021 02:01 IST

చెత్త నిర్ణయాలు!

నగరంలో వికటించిన ‘బిన్‌ ఫ్రీ’ ప్రయోగం●

రోడ్లపైనే వ్యర్థాలు.. దుర్వాసన, అపరిశుభ్రత

పెట్లబుర్జు ఆసుపత్రి వద్ద చెత్త కుప్పలు

ఈనాడు, హైదరాబాద్‌: కోటి మంది నివసించే నగరం. దేశంలోనే ఉత్తమ నివాసయోగ్య నగరంగా పలు వేదికలపై గుర్తింపు.. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపరంగా దినదినాభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్‌లో పారిశుద్ధ్యం మాత్రం మెరుగుపడట్లేదు. అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వ్యవహారాలతో పారిశుద్ధ్యం పడకేసింది. ఏ దారిలో చూసినా చెత్త కుప్పలే. ఏ రోడ్డులో వెళ్లినా దుర్వాసనే. రోడ్డు పొడవునా వ్యర్థాలు, వాటిపై ముసురుతోన్న ఈగలే దర్శనమిస్తున్నాయి. చెత్త డబ్బాల్లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామంటూ జీహెచ్‌ఎంసీ తీసుకున్న హడావుడి నిర్ణయమే అందుకు ఏకైక కారణం. ఎలాంటి కసరత్తు, అవసరమైన చర్యలు తీసుకోకుండా అధికారులు రాత్రికి రాత్రి నగరవ్యాప్తంగా ఉన్న అన్ని చెత్తడబ్బాలను తొలగించడంతో గ్రేటర్‌ వ్యాప్తంగా రహదారులపై వ్యర్థాలు వరదలా పారుతున్నాయి. చార్మినార్‌, గోల్కొండ, హైకోర్టు, జూపార్కు, చౌమహల్లా ప్యాలెస్‌ తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్న పర్యాటకులైతే రోడ్లపై పడుతోన్న చెత్తను చూసి ముక్కు మూసుకుంటున్నారు. మూసీ పొడవునా, పర్యాటక కేంద్రాలు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పడుతున్న అపరిశుభ్రతను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

లక్ష్యం మంచిదే.. గడప గడపకు వెళ్లి వ్యర్థాలను సేకరిస్తే రోడ్డుపై వ్యర్థాలు వేసే అవసరం ఉండదు. అప్పుడు రోడ్ల పొడవునా చెత్త డబ్బాలెందుకు. వాటి వల్ల రోడ్లపై ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇదీ కేంద్రం ప్రవేశపెట్టిన బిన్‌ ఫ్రీ సిటీ కార్యక్రమం ముఖ్యోద్దేశం.

ఇదీ సంగతి..

ఇంటింటి చెత్త సేకరణ రోజూ జరగదు. మూడు రోజులు, వారం రోజులకోసారి స్వచ్ఛ ఆటోలు వెళ్లి చెత్త సేకరిస్తాయి. ఆలోపు ఇళ్లలోని చెత్త నుంచి దుర్వాసన మొదలవుతోంది. కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛ ఆటో కార్మికులు నెలవారీ రుసుమును రూ.150 నుంచి రూ.200కు పెంచారు. కొన్ని అపార్ట్‌మెంట్లలో ఆటో కార్మికులు పైఅంతస్తులకు వెళ్లట్లేదు. చిరువ్యాపారులు, చిన్నపాటి హోటళ్ల నుంచి ఎక్కువ రుసుము డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి పలు సమస్యలను స్థానికులు ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పరిష్కరించట్లేదు.

చెత్త నిల్వ చేసే కేంద్రంగా మూసీ

నిబంధనల ప్రకారం ఇంటి నుంచి సేకరించిన చెత్తను ఆటోల ద్వారా ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లకు తరలించాలి. కానీ ఆటో కార్మికులు అత్తాపూర్‌ వంతెన నుంచి బాపూఘాట్‌ వరకు ఉన్న మూసీ నది వెంట రోడ్డు పక్కన పడేస్తున్నారు. దీంతో మూసీతీరంలో కంపు పెరుగుతోంది. దీనిపై జడ్సీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. అక్కడ కనీసం కంచె కూడా లేదు.

తప్పు మీద తప్పులు..

● స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి తిరగాలి. రోడ్లపై పడే చెత్తను ఎత్తేందుకు ప్రత్యేక వాహనాలుంటాయి. వాటిని పక్కనపెట్టి స్వచ్ఛ ఆటోలతో రోడ్లపై చెత్తను ఎత్తిస్తున్నారు. దాంతో రెండు, మూడు రోజులకోసారి జరుగుతోన్న ఇంటింటి చెత్త సేకరణ వారానికోసారిగా మారింది. ఫలితంగా రోడ్లపై పడుతోన్న వ్యర్థాలు మరింత పెరిగాయి. ఇలా రోడ్లపై చెత్త ఎత్తించడంపై శుక్రవారం 100 మందికిపైగా కార్మికులు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన గళం వినిపించారు. ఉపమేయర్‌ శ్రీలతరెడ్డి వాహనాన్ని అడ్డుకోగా సమస్యను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

* సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, చార్మినార్‌ పరిసరాలు, హైకోర్టు వద్ద ప్రధాన రోడ్డు మార్గం తదితర ప్రాంతాల్లోని పారిశుద్ధ్యాన్ని ప్రైవేటు ఏజెన్సీలకు బల్దియా ఇచ్చి ప్రతినెలా రూ.కోట్లు వెచ్చిస్తోంది. చెత్తకుప్పలు ఎక్కువగా ఉండే కాలనీలను తమ వద్దనే ఉంచుకుని గుత్తేదారులకు కాసుల వర్షం కురిపిస్తోంది.

* పేట్లబుర్జు దవాఖానా ఎదురు వీధిలో 100 మీటర్ల పొడవునా చెత్త కుప్ప తయారైంది. గాంధీ ఆస్పత్రి వెనుక, సీతాఫల్‌మండి సురేష్‌ థియేటర్‌ పక్కన, మూసీనది పొడవునా, చార్మినార్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌, దూద్‌బౌలి తదితర ప్రాంతాల్లో దారుణ పరిస్థితులున్నాయి. యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, అంబర్‌పేట, ఎల్బీనగర్‌, మెహిదీపట్నం, ఖైరతాబాద్‌ సర్కిళ్లలో పరిస్థితులు దిగజారిపోయాయి.

జీహెచ్‌ఎంసీ ఏం చేసిందంటే..

కేంద్రం చెప్పిందంటూ, జీహెచ్‌ఎంసీ హుటాహుటిన నగరవ్యాప్తంగా ఉండే 1,200 చెత్త డబ్బాలను ఒకేరోజు తొలగించింది. అయినా ఎప్పటిలాగే చెత్త పడుతోంది. అయితే డబ్బాలు లేక రోడ్డంతా చెత్తమయమవుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని