వెంట్రుకలో వెయ్యోవంతు చాలు!
eenadu telugu news
Published : 24/10/2021 02:01 IST

వెంట్రుకలో వెయ్యోవంతు చాలు!

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, నాంపల్లి

* కశ్మీర్‌ లోయలో 25 ఏళ్ల క్రితం ఉగ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. అఫ్సర్‌ అనే ఉగ్రవాదిని చంపేందుకు ఐపీఎస్‌ అధికారి షికాగోయల్‌ బృందం అక్కడికి వెళ్లింది. ఎదురు కాల్పుల్లో అఫ్సర్‌ చనిపోయాడు. ఆ సమయంలో ఒక తూటా పోలీస్‌ బృందం కారు అద్దంలోకి దూసుకెళ్లింది. ఇది ఉగ్రవాదుల పనేనని పోలీసులు భావించారు. షికాగోయల్‌ బృందం బాలిస్టిక్‌ నిపుణుడిని అడగ్గా.. ఓ పోలీస్‌ అధికారి గన్‌మెన్‌.. కారు కిందిభాగంలో ఉండి కాల్చాడంటూ వివరించాడు.

* ఉస్మానియా విశ్వవిద్యాలయం వసతి గృహంలో ఓ విద్యార్థిని చనిపోయింది. వందలమంది విద్యార్థులు అక్కడికి వచ్చారు. ఎవరో చంపేశారంటూ ఆందోళనకు దిగారు. హంతకులను శిక్షంచాలంటూ డిమాండ్‌ చేశారు. వారిని శాంతింపజేశాక క్లూస్‌ బృందం ఆ గదిలోని ఆధారాలను సేకరించింది. విద్యార్థిని నోటు పుస్తకాన్ని స్వాధీనం చేసుకుంది. పుస్తకంలోని ఒక తెల్లకాగితంపై అక్షరాలు రాసిన ఒత్తిడి కనిపించింది. క్రిప్టోగ్రఫీ ద్వారా విశ్లేషించగా.. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు నిరూపణ అయ్యింది.

వేలిముద్రలు పడకుండా తొడుగులు.. ఆధారాలు లభించకుండా సిమ్‌కార్డులు విరవడం.. సీసీకెమెరాలకు చిక్కకుండా ముసుగులు.. పోలీసులకు చిక్కకుండా నిందితులు, ఘరానా నేరస్థుల వేషాలివి. అయితే.. ఇవేవి లేకున్నా నేరగాళ్లు ఘటనాస్థలిలో వదిలిన చిన్న ఆధారం, వెంట్రుకలో వెయ్యోవంతు లభించినా నిందితులను అరెస్ట్‌ చేయొచ్ఛు. శిక్షపడేలా చేయొచ్ఛు ఇదంతా ఫోరెన్సిక్‌ శాస్త్రం కచ్చితత్వం. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితులను వేగంగా పట్టుకునేందుకు సహకరిస్తున్న ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు అనుబంధంగా డీఎన్‌ఏ, అణుజీవశాస్త్ర ప్రయోగశాలను హైదరాబాద్‌ పోలీసులు నిర్మించనున్నారు. దీనికి శనివారం హోం మంత్రి మహమూద్‌ అలీ శంకుస్థాపన చేశారు. ఎనిమిది నెలల్లో అందుబాటులోకి రానున్న ఈ ప్రయోగశాల ద్వారా హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లలో పెండింగ్‌, కొత్త కేసులు పరిష్కారమవనున్నాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై లైంగికదాడుల నిరూపణ, సూక్ష్మస్థాయి ఆధారాల సేకరణ, సైబర్‌ నేరాల విశ్లేషణకు ఈ ప్రయోగశాల మరింత ఉపయోగపడనుంది. ఫోరెన్సిక్‌ శాస్త్రం ఏళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చినా.. డీఎన్‌ఏ, అణుజీవశాస్త్ర విశ్లేషణ పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు పరిచయం చేశాక విశ్వవాప్తంగా పెనుమార్పులొచ్చాయి. నేరపరిశోధనలో ఎలాంటి ఆధారాల్లేవని మూసేసిన కేసుల్లో డీఎన్‌ఏ, బాలిస్టిక్‌ విశ్లేషణ, పాలిగ్రఫీ, క్రిప్టోగ్రఫీ ద్వారా నిందితులను పట్టిస్తున్నాయి.


లాఠీలతో పనిలేకుండా కేసుల్ని పరిష్కరిస్తున్నాం

హోంమంత్రి మహమూద్‌ అలీ

శంకుస్థాపన పూజలో మహమూద్‌అలీ అభిలాష బిస్త్‌, షికాగోయల్‌, అంజనీకుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: బాధితులకు న్యాయం చేసేందుకు నిందితులపై లాఠీలు ప్రయోగించకుండా అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను పరిష్కరిస్తున్నామని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ఫోరెన్సిక్‌ ప్రయోగశాల, ఆధారాల బృందం నివేదికలతో నిందితులకు శిక్షలు పడేలా చేస్తున్నామని వివరించారు. సురక్షిత నగరం కార్యక్రమంలో భాగంగా శాంతినగర్‌లో నిర్మించనున్న డీఎన్‌ఏ, అణుజీవశాస్త్ర ప్రయోగశాలకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ దేశంలోని కెమెరాల్లో 68శాతం సీసీ కెమెరాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని గుర్తు చేశారు. స్త్రీవ్యతిరేక హింస, పోక్సో కేసుల్లో బాధితులకు సాంత్వన కల్పించేందుకు వీలుగా పోలీస్‌ నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నామని వివరించారు.

వందశాతం శిక్షలు: సంచలనం సృష్టించిన ఘటనలు, కేసుల్లో సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో తాము అందించిన నివేదికల కారణంగా నిందితులకు వందశాతం శిక్షలు పడుతున్నాయని ఫోరెన్సిక్‌ ప్రయోగశాల సంచాలకులు అభిలాష బిస్త్‌ అన్నారు. కేసులను వేగంగా దర్యాప్తు చేసేందుకు క్లూస్‌టీం సహాయకారిగా ఉందని నగర సీపీ అంజనీకుమార్‌ అన్నారు. రూ.17.48 కోట్లతో నిర్మించనున్న డీఎన్‌ఏ, అణుజీవశాస్త్ర ప్రయోగశాలను 8 నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందించామని అదనపు డీజీ షికాగోయల్‌ అన్నారు. ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ ఎం.ఎస్‌.ప్రభాకరరావు, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌, అదనపు సీపీ డీఎస్‌ చౌహాన్‌, ఉత్తరమండలం డీసీపీ కల్మేశ్వర్‌ శింగన్వార్‌, క్లూస్‌టీం అధికారి వెంకన్న, ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని