HCA: తీరు మారని హెచ్‌సీఏ.. ముస్తాక్‌ అలీ టోర్నీకి రెండు జట్ల ఎంపిక
eenadu telugu news
Updated : 24/10/2021 09:31 IST

HCA: తీరు మారని హెచ్‌సీఏ.. ముస్తాక్‌ అలీ టోర్నీకి రెండు జట్ల ఎంపిక

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘క్రికెట్‌ ఎక్కడికో కొట్టుకుపోయింది. రాజకీయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రెండు గ్రూపులు హెచ్‌సీఏ మేనేజ్‌మెంట్‌ నుంచి బయటకెళ్లి పోవాలి. ఇందులో సీబీఐ దర్యాప్తు అవసరం ఉంది’’

-హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) పనితీరుపై సరిగ్గా రెండ్రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చేసిన వ్యాఖ్యలివి. హెచ్‌సీఏ పరిపాలనను భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది కూడా. కాని హెచ్‌సీఏ పెద్దలకు మాత్రం చీమ కుట్టినట్లైనా లేదు. భారత దేశవాళీ క్రికెట్లో ముఖ్యమైన టోర్నీల్లో ఒకటైన, యువ ప్రతిభావంతుల కోసం ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు దృష్టిసారించే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ నవంబరు 4న ఆరంభం కానుండగా.. ఈ టోర్నీ కోసం హెచ్‌సీఏలోని రెండు వర్గాలు రెండు జట్లను ఎంపిక చేయడం దుమారం రేపుతోంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ నియమించిన అడ్‌హక్‌ సెలెక్షన్‌ కమిటీ శనివారం 23 మంది ఆటగాళ్లతో హైదరాబాద్‌ జట్టును ప్రకటించింది. అహ్మద్‌ ఖాద్రి, జాకీర్‌ హుస్సేన్‌, ఆల్ఫ్రెడ్‌ అబ్సొలెం, ఫయాజ్‌ అహ్మద్‌, అమోల్‌ షిండేలతో సెలెక్షన్‌ కమిటీ.. తన్మయ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఆంధ్ర జట్టు నుంచి తిరిగొచ్చిన విహారికి జట్టులో చోటు కల్పించింది. నోయల్‌ డేవిడ్‌, అరవింద్‌, ఫయాజ్‌ బేగ్‌, సాయినాథ్‌లతో కూడిన సెలెక్షన్‌ కమిటీ మరో జట్టును ఎంపిక చేసింది. విహారికి సారథ్య బాధ్యతలు అప్పగించింది. రెండు జట్లను ఎంపిక చేయడం ద్వారా హెచ్‌సీఏ పెద్దలు హైదరాబాద్‌ క్రికెట్‌ను మరింత గందరగోళంలోకి నెట్టారు. ఇప్పటికే అగమ్యగోచరంగా తయారైన హైదరాబాద్‌ క్రికెటర్ల భవిష్యత్తు మరింత అనిశ్చితిలోకి వెళ్లనుంది. దాదాపు సగం మంది ఆటగాళ్లు రెండు జట్లలో చోటు సంపాదించారు. మరి టోర్నీకి వెళ్లేదెవరు? ఈనెల 27న సుప్రీంకోర్టులో విచారణతోనైనా హెచ్‌సీఏలో ఈ గందరగోళానికి తెరపడాలని ఆటగాళ్లు, తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని