Suicide: అప్పు తీర్చేందుకు రూ.2వేలు దొరకలేదని..
eenadu telugu news
Updated : 24/10/2021 07:15 IST

Suicide: అప్పు తీర్చేందుకు రూ.2వేలు దొరకలేదని..

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ఆనంద్‌

శామీర్‌పేట, న్యూస్‌టుడే: అప్పు తీర్చేందుకు రూ.2 వేలు దొరకలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం పొన్నాలలో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మర్యాల ఆనంద్‌(23) తుర్కపల్లిలోని ఓ బయోటెక్‌ సంస్థలో పని చేస్తున్నారు. మూడు నెలల క్రితం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌కు చెందిన కుంచెరుకలి (ఊరూరా తిరిగి అప్పిచ్చే వారు) వద్ద రూ.10వేలు అప్పు తీసుకున్నాడు. అప్పును తీర్చాలని ఓ మహిళతో పాటు మరో ఐదుగురు ఈ నెల 22న రాత్రి పొన్నాలలోని ఆనంద్‌ ఇంటికి వచ్చారు. తీవ్ర ఒత్తిడి చేశారు. కనీసం రూ.2 వేలు ఇస్తే కొత్త పత్రం రాసుకొని వెళ్తామని మొండికేసి కూర్చున్నారు. ఆనంద్‌ తనకు తెలిసిన వారి దగ్గర అడిగారు. ఎవరూ ఇవ్వడానికి ముందుకు రాలేదు. వారు డబ్బు ఇచ్చే వరకు వెళ్లేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. నగదు ఇచ్చే వరకు తమతో పాటు రావాలని చెప్పడంతో శనివారం తుర్కపల్లి వరకు వెళ్లాడు. తెలిసిన వారిని బతిమాలిడితే ఒకరు రూ.వెయ్యి ఇచ్చారు. వాటితో వారికి విందు ఇచ్చాడు. వారు కొత్త పత్రం రాసుకొని వెళ్లి పోయారు. ఇంటికొచ్చిన ఆనంద్‌ రూ.2 వేల కోసం తనను ఎవరూ నమ్మలేదని మనస్తాపంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని