రూ.2కోట్ల విలువైన మెపిడ్రిన్‌ పట్టివేత
eenadu telugu news
Published : 24/10/2021 02:21 IST

రూ.2కోట్ల విలువైన మెపిడ్రిన్‌ పట్టివేత

సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ చంద్రయ్య

ఈనాడు, హైదరాబాద్‌, పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: మేడ్చల్‌ జిల్లా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రూ.2కోట్ల విలువైన మెపిడ్రిన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పేట్‌బషీరాబాద్‌ కార్యాలయంలో శనివారం విలేకరులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ చంద్రయ్య వివరాలు వెల్లడించారు. కూకట్‌పల్లి న్యూబాలాజీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో గంజాయి, తెల్లపౌడర్‌ విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్‌ పోలీసులకు సమాచారం అందటంతో సీఐ సహదేవ్‌ డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న కరీంనగర్‌ జిల్లా చొక్కారావుపల్లికి చెందిన చిటుకూరి ప్రశాంత్‌రెడ్డి(24) వద్ద 5 గ్రాముల మత్తుపదార్థం స్వాధీనం చేసుకొన్నారు. అతణ్ని అదుపులోకి తీసుకుని దందా వివరాలు రాబట్టారు.

ఆర్థిక ఇబ్బందులతో అడ్డదారి..

క్యాబ్‌డ్రైవర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్‌రెడ్డి ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు అడ్డదారి ఎంచుకొన్నాడు. కన్నారెడ్డి అనే వ్యక్తి నుంచి పౌడరు తీసుకున్నాడు. 1గ్రాము రూ.3వేల నుంచి రూ.4వేల వరకూ విక్రయిస్తున్నాడు. రోజూ అపార్ట్‌మెంట్‌ వద్దకు అపరిచితులు వస్తుండటంతో స్థానికులు ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం చేరవేశారు. దాడిచేసిన అధికారులు ఖరీదైన మెపిడ్రిన్‌ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. భారీగా మత్తుపదార్థం కావాలంటూ ప్రశాంత్‌రెడ్డి ద్వారా కన్నారెడ్డికి ఫోన్‌ చేయించారు. బొంగులూరుగేట్‌ వద్ద అతణ్ని గుర్తించి 921 గ్రాముల మెపిడ్రిన్‌ స్వాధీనం చేసుకొన్నారు. మత్తు ప్యాకెట్లను తనకు నాగర్‌కర్నూల్‌ జిల్లా బావాజీపల్లికి చెందిన రామకృష్ణగౌడ్‌ అందజేసినట్లు కన్నారెడ్డి తెలిపాడు. ఇతడి ద్వారా మరికొంత సరకు కావాలంటూ రామకృష్ణగౌడ్‌కు ఫోన్‌ చేయించారు. కారులో నాగర్‌కర్నూల్‌ పౌరసరఫరాల గోదాం వద్దకు చేరుకోగానే అతడి నుంచి అధికారులు 4కిలోలు స్వాధీనం చేసుకొన్నారు. నిందితుణ్ని ప్రశ్నించగా బావాజీపల్లికి చెందిన బండారు హనుమంతరెడ్డి, సురేష్‌రెడ్డి తనకు సరకు ఇచ్చినట్లు చెప్పాడు. వారి కోసం గాలిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని