రూ. కోట్ల నిధులు.. తప్పని పాట్లు
eenadu telugu news
Published : 25/10/2021 01:21 IST

రూ. కోట్ల నిధులు.. తప్పని పాట్లు

అసంపూర్తిగా గాజీపూర్‌ వంతెన

న్యూస్‌టుడే, తాండూరు : ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం వంతెనలు నిర్మించాలని తలంచింది. ప్రధానంగా సమస్యలు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాలను గుర్తించి పరిష్కరించాలని యోచించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ప్రతిపాదనలు రూపొందించి, నివేదిక సమర్పించారు. రూ.కోట్లలో నిధులు విడుదలైనా క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేక ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలకు మాత్రం అవస్థలు తప్పడంలేదు.

జిల్లాలో తాండూరు, పెద్దేముల్‌, బషీరాబాద్‌, యాలాల, ధారూర్‌ మండలాల్లో వాగులు ఎక్కువగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రజల ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి 14 వంతెనలు నిర్మించాలని కార్యాచరణ రూపొందించారు. ఇందుకోసం రూ.74.8 కోట్లు 2016లోనే మంజూరై రహదారులు, భవనాల శాఖ, పంచాయతీ రాజ్‌ శాఖల ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. రెండేళ్లలో వీటిని పూర్తి చేయాలని గడువు విధించారు. ఇప్పటివరకు కేవలం ఐదు మాత్రమే పూర్తయ్యాయి. నాలుగు అసంపూర్తిగా వదిలేశారు. మరో రెండింటిని ప్రారంభించక పోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. మూడు వంతెనల నిర్మాణాలు సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయాయి. గత వర్షాకాలంలో 5 కిలోమీటర్ల లోపే ఉన్న గమ్యస్థానాలను 20 కిలోమీటర్లకు పైగా అదనపు ప్రయాణం చేయాల్సి వచ్చింది.

పేర్కంపల్లి గ్రామానికి వెళ్లే దారిలో ఇలా

కాగ్నా నదిపై: ముంబయి, బెంగళూరు జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న తాండూరు- కొడంగల్‌ రహదారి కాగ్నా నదిపై రూ.16.80 కోట్ల వ్యయంతో చేపట్టిన వంతెన పూర్తయింది. బషీరాబాద్‌ మండలం జీవన్గి నుంచి తాండూరు మండలం కరణ్‌కోటను కలిపేందుకు నదిపై రూ.10 కోట్లతో చేపట్టినా అసంపూర్తిగానే ఉంది. అనుసంధాన రోడ్డు నిర్మాణం చేయక అందుబాటులోకి రాలేదు. జీవన్గి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కరణ్‌కోటకు వెళ్లాలంటే వర్షాకాలంలో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం వానలు లేకపోయినా, పనులు ప్రారంభించలేదు. తాండూరు మండలం నారాయణపూర్‌, వీర్‌శెట్టిపల్లివద్ద రెండు వంతెనలకు రూ.14 కోట్లతో పూర్తిచేశారు.
14 కిలోమీటర్ల దూరాభారం: కాకర వేణి నది ఉద్ధృతంగా ప్రవహించే యాలాల మండలం కోకట్‌-సంగెం కుర్దు గ్రామాల మధ్యలో రూ.3కోట్లతో వంతెన నిర్మాణం చేపట్టాల్సి ఉంది. సకాలంలో పనులు జరగక పోవడంతో నిధులు వెనక్కి వెళ్లి పోయాయి. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాండూరు వెళ్లేందుకు సంగెం కుర్దు వాసులు 14 కిలోమీటర్ల దూర ప్రయాణం చేయాల్సి వస్తోంది. అవతలి గట్టున ఉన్న పొలాలకు వెళ్లాలంటే 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయక తప్పడం లేదు.

అనుసంధాన రోడ్లు అధ్వానం: తాండూరు నుంచి సంగారెడ్డి వెళ్లే మార్గంలో పెద్దేముల్‌ మండలం బుద్ధారం, గాజీపూరు సమీప నదులపై ఒక్కో వంతెన నిర్మించాలి. ఇందుకు మొత్తం రూ.12 కోట్లు మంజూరయ్యాయి. బుద్ధారం వద్ద పూర్తయింది. రెండు వైపులా అనుసంధాన రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గాజీపూరు వద్ద అసంపూర్తిగా ఉంది. గుత్తేదారు పనులు ఆపేసినా ఎవరూ పట్టించుకోవడంలేదు.  

కొట్టుకపోయిన తాత్కాలిక మార్గం: తాండూరు నుంచి వికారాబాద్‌ వెళ్లే మార్గంలో మూడు వంతెనలను రూ.12 కోట్లు కేటాయించారు. కేవలం దుగ్గాపూరు వద్ద పూర్తయింది. కందనెల్లి, మన్‌సాన్‌పల్లి వద్ద పనులు కొనసాగుతున్నాయి. వర్షాలతో తాత్కాలిక రహదారులు వరదకు కొట్టుకుపోయాయి. వికారాబాద్‌కు వాహనాలు వెళ్లే పరిస్థితి లేక 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చింది. కోట్‌పల్లి జలాశయం అలుగు పారి ధారూరు-నాగసమందర్‌ గ్రామాలను కలుపుతూ ఉన్న వంతెన 2016లో కొట్టుకపోయింది. పునర్నిర్మాణానికి అప్పట్లో రూ.4 కోట్లు మంజూరైనా పనులు జరగలేదు. ప్రస్తుతం అంచనాలు రూ.9 కోట్లకు చేరుకుంది. తెగిపోయిన ప్రదేశంలో తాత్కాలిక పనులు చేపట్టేందుకు రూ.30 లక్షలు వ్యయం చేస్తున్నారు.

మరికొన్ని ప్రాంతాల్లో ఇలా: యాలాల మండలం పేర్కంపల్లి వద్ద వంతెన నిర్మాణానికి రూ.4కోట్లు మంజూరయినా పూర్తికాలేదు. తాండూరు పట్టణం మీదుగా కొడంగల్‌ వెళ్లే దారిలో చిలుక వాగు, కొత్లాపూర్‌, జిన్‌గుర్తి గ్రామాల సమీప వాగులపై రూ.6 కోట్ల వ్యయంతో ఒక్కోటి నిర్మించాల్సి ఉన్నా, ప్రారంభానికి నోచలేదు. తాండూరు మండలం అల్లాపూరు, ఐనెల్లి, బషీరాబాద్‌ మండలం గొట్టిగ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారుల మధ్యలో ఒక్కో నిర్మాణానికి రూ.4కోట్ల చొప్పున ప్రతిపాదనలు పంపించినా నిధులు మంజూరు కాలేదు.

వచ్చే వానాకాలం నాటికి అన్నింటిని పూర్తి చేస్తాం
శ్రీనివాస్‌, డీఈఈ, రోడ్లు భవనాల శాఖ

తాండూరు డివిజన్‌లో వచ్చే వర్షాకాలం నాటికి మొత్తం వంతెన నిర్మాణాలు పూర్తి చేస్తాం. ఇప్పటికే కొన్ని పూర్తికావడానికి వచ్చాయి. అనుసంధాన రోడ్లు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం. కొత్లాపూరు నుంచి కొడంగల్‌ రహదారిలోని వంతెనల నిర్మాణం జాతీయ రహదారుల విభాగం చూసుకుంటుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని