యువస్ఫూర్తి.. సేంద్రియ దీప్తి
eenadu telugu news
Published : 25/10/2021 01:21 IST

యువస్ఫూర్తి.. సేంద్రియ దీప్తి

న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ

బర్మాబ్లాకు రకం వరి పొలంలో పోచయ్య  

దువుకోవడం, ఆ తర్వాత దీర్ఘకాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూడటం, అందుకు చాలా కాలంపాటు డబ్బు ఖర్చు చేస్తూ శిక్షణ తీసుకుంటూ ఉండటం.. ఇదంతా పాత మాట. ఇప్పుడు యువకులు పంధా మార్చుకున్నారు. కొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కోసం ఏళ్లకేళ్లు ఎదురు చూడటం లేదు. కళ్ల ముందు కనిపించే అవకాశాలను ఒడుపుగా అందిపుచ్చుకొని సొంతకాళ్లపైనే నిలిచి రెట్టింపు ఆదాయాల్ని సమకూర్చుకుంటూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు.  మరికొందరు ఆసక్తి ఉండటంతో సాగుపై దృష్టి సారిస్తూ ఆర్జిస్తున్నారు. ఈ కోవలోకే చెందిన పలువురు యువకులు రైతుల స్ఫూర్తిగా సేంద్రియ సాగుపై దృష్టి పెట్టి లాభాల సాగు చేస్తూ దూసుకుపోతున్నారు.  
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం
మల్‌రెడ్డిపల్లికి చెందిన దొడ్ల శ్రీనివాస్‌ ఇంటర్‌ వరకు చదువుకున్నారు. తమకున్న నాలుగు ఎకరాల్లో వ్యవసాయంతోపాటు పాడి పశుపోషణకు నడుం బిగించారు. నిత్యం 10 నుంచి 20 లీటర్ల పాలను పట్టణంలో విక్రయిస్తుండగా సుమారు రూ.1000 వరకు ఆదాయం వస్తోంది. దీనిని  కుటుంబపోషణ, వరి సాగులో పెట్టుబడులకు సద్వినియోగం చేస్తున్నారు. నాలుగు ఎకరాల్లో సాధారణ వరి కాకుండా భిన్నంగా బహురూపి, కాలభట్‌ వంటి పురాతన రకం సాగు చేస్తున్నారు. కేవలం పేడ, వేప ఆకులు, బెల్లం వంటి మిశ్రమాలతో సేంద్రియ ఎరువులు తయారు చేసి వినియోగిస్తున్నారు. దీంతో నాణ్యమైన ధాన్యం దిగుబడులు సాధిస్తున్నారు. మర పట్టించగా ఎకరాకు 15క్వింటాళ్లు రాగా సాధారణ బియ్యం కంటె రెట్టింపుగా క్వింటాకు రూ.7వేలు చెల్లించి కొనుగోలు చేశారు. దీంతో రూ.1.05లక్షలు సమకూరాయి. ట్రాక్టర్‌ అద్దె, ఇంధనం, కూలీలు వంటి ఖర్చులకు రూ.10వేలు పెట్టుబడిపోనూ రూ.95వేల ఆదాయం సమకూరడంతో మరింత ఉత్సాహంగా సాగు చేస్తానని శ్రీనివాస్‌ చెబుతున్నారు.
నాణ్యమైన దిగుబడులు
చెంగోల్‌కు చెందిన పోచయ్య ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూనే తనకున్న అర ఎకరాలో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. గతేడాది రత్నచోడి, బహురూపి వంటి దేశవాలీ రకం వరి వేశారు. నాణ్యమైన దిగుబడులు సాధించి పెట్టుబడులు పోనూ రూ.60 వేల ఆదాయం పొందాడు. దీంతో ఈ ఏడాది మరో రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని బర్మాబ్లాకు, మాఫిల్లేసాంబ, రత్నచోడి, నవారా, క్షేత్రీమహారాజ్‌ వంటి నూతన రకాల వరిని సుభాష్‌ పాలేకర్‌ విధానాలతో పండిస్తున్నాడు. విత్తన శుద్ధి, ఘనజీవామృతం, జీవామృతం, బీజామృతం, పుల్లటి మజ్జిగ వంటి సేంద్రియ ఎరువుల తయారీ దగ్గర్నుంచి పిచ్చికారీ వరకు సొంతంగా తానే నిర్వహిస్తున్నాడు. నాలుగు నెలల పంటకాలం ముగుస్తుండటంతో  కోత పనుల్లో నిమగ్నమయ్యారు. రెండు మూడు వారాల్లో దిగుబడులు చేతికందనున్నాయి. సేంద్రియ సాగు చేస్తుండటంతో విపణికి తరలించి విక్రయించాల్సిన పని లేకుండా పోయిందని పోచయ్య పేర్కొంటున్నారు. శ్రమ ఎక్కువైనా రెట్టింపు ఫలితం దక్కుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


పూల సాగు.. లాభాలు బాగు

తాండూరు మండలం కరణ్‌కోటకు చెందిన మహేందర్‌ పీజీలో లైబ్రేరియన్‌(గ్రంథపాలక) కోర్సు పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. అప్పటివరకు ఖాళీగా ఉండకుండా వ్యవసాయం వైపు అడుగులు వేశాడు. మూడు ఎకరాల్లో ఉల్లి, వంగ తోటతో పాటు అర ఎకరాలో బంతిపూల సాగుకు శ్రీకారం చుట్టాడు. అనుభవం లేకున్నా అంతర్జాలంలో పరిశీలించి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆదర్శ రైతు నర్సిరెడ్డిని సంప్రదించి కంపోస్టు ఎరువులతో కూడిన 1,500 పూల మొక్కలు దిగుమతి చేసుకున్నాడు. జంటసాల పద్ధతిన సాగు చేపట్టగా రెండు నెలల వ్యవధిలో దిగుబడులు చేతికొచ్చాయి. ఒకేసారి 200కిలోల పూల దిగుబడుల్ని విక్రయించడంతో ఈ ఏడాది రూ.16వేల ఆదాయం సమకూరింది.   రూ.6వేల పెట్టుబడిపోనూ రూ.10వేల ఆదాయం ఒకే విడతలో సమకూరడంతో రెట్టించిన ఉత్సాహంతో సాగు పనులు నిర్వహిస్తున్నాడు. సీజన్‌ మరో రెండు నెలల్లో ముగియనుండగా రూ.50వేలకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. పూలు తాజాగా, ఆకర్షణీయంగా ఉండటంతో గ్రామస్థులతో పాటు సరిహద్దునున్న కర్ణాటక రాష్ట్రవాసులు చరవాణిలో సంప్రదించి నేరుగా పొలానికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులు తప్పడంతోపాటు పట్టణంలోని విపణికి వెళ్లే సమయం ఆదా అవుతోందని మహేందర్‌ పేర్కొంటున్నారు. సొంతంగా పొలం పనులు చేయడంతో ఆదాయం, అనుభవం వచ్చింది. వచ్చే ఏడాది రెండెకరాల్లో పూలసాగు చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని