నష్టాలపై కమిటీలు.. తీరేనా కష్టాలు
eenadu telugu news
Published : 25/10/2021 02:50 IST

నష్టాలపై కమిటీలు.. తీరేనా కష్టాలు

4 బృందాలుగా ఆర్టీసీ అధ్యయనం
నగరంపై దృష్టి పెట్టిన అధికారులు
ఈనాడు - హైదరాబాద్‌

టీఎస్‌ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు మేథోమధనం చేస్తున్న యంత్రాంగం నగరంపై దృష్టి పెట్టింది. మెరుగైన ప్రయాణం.. టిక్కెటేతర ఆదాయమే లక్ష్యంగా నాలుగు కమిటీలను ఏర్పాటు చేయగా.. వాటి పని నగరం నుంచే మొదలైంది.  
గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌లో ఏడాది క్రితం 3,750 బస్సులుండేవి. 2019 అక్టోబరులో జరిగిన సుదీర్ఘ సమ్మె తర్వాత వెయ్యి బస్సులు తగ్గించారు. ఆ తర్వాత కరోనాతో బస్సులు ఆరు నెలలు డిపోలు దాటలేదు. తర్వాత కూడా ప్రయాణాలు అంతంత మాత్రమే ఉండడంతో తగ్గిన బస్సుల వల్ల ఇబ్బందులు బయటపడలేదు. ఇప్పుడు విద్యాలయాలు, కార్యాలయాలు తెరచుకోవడంతో కిక్కిరిసి వేలాడుతూ ప్రయాణాలు సాగుతున్నాయి. ఐటీ సంస్థలు కూడా తెరుచుకుంటే.. బస్సుల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం 2750 బస్సులతో నెట్టుకురావడం ఆర్టీసీకి కత్తిమీద సామే అవుతుంది. ఇంతే జనాభా ఉన్న  బెంగళూరులో 6500ల బస్సులున్నాయి. 2025 నాటికి వీటిని రెట్టించాలనే ప్రతిపాదనలతో అక్కడ రవాణా సంస్థ ముందుకెళ్తోంది.

నాలుగు లక్ష్యాలు సాధించేలా..
1. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం, 2. ఉన్న వనరులతో ఆదాయ వనరుల పెంపు, 3. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, 4. కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ.. అనే నాలుగు అంశాలపై నాలుగు కమిటీలు నగరం నుంచే పని ప్రారంభిస్తాయి.
ఏఏ మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉంది?  ఎక్కడి నుంచి ఎక్కడివరకు ఉంటున్నారనేది అధ్యయనం చేస్తారు. మెట్రో మార్గాల్లో బస్సుల సంఖ్యను తగ్గించి.. మెట్రోకు, ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్లకు అనుసంధానంగా బస్సులు నడపడంపై దృష్టి పెడతారు.
పటాన్‌చెరు, బాలానగర్‌, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, కాచిగూడ, ఈసీఐఎల్‌ క్రాస్‌రోడ్స్‌, హయత్‌నగర్‌, ఉప్పల్‌, ఫలక్‌నుమా ప్రాంతాల్లోని మినీ బస్టాండ్‌లలో దుకాణాల వినియోగం, ప్రకటనల సేకరణపై దృష్టి సారిస్తారు.
ఎంజీబీఎస్‌, జూబ్లీ బస్‌స్టేషన్లను వాణిజ్యపరంగా వినియోగించుకోవడంపైనా, నగరంలో ఆర్టీసీకి ఉన్న ఖాళీ స్థలాలను ఎలా వినియోగించాలనే దానిపైనా అధ్యయనం చేస్తారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని