సందడిగా మొదలై.. నిరాశపాలై
eenadu telugu news
Published : 25/10/2021 02:49 IST

సందడిగా మొదలై.. నిరాశపాలై

సికింద్రాబాద్‌లో మ్యాచ్‌ చూస్తూ అభిమానుల కేరింతలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: క్రికెట్‌..క్రికెట్‌..క్రికెట్‌...ఆదివారం నగరమంతా జెంటిల్‌మెన్‌గేమ్‌ జోష్‌తో మార్మోగిపోయింది. వేదిక దుబాయ్‌ అయినా ఆ సందడంతా నగరంలో కనిపించింది. గేటెడ్‌ కమ్యూనిటీలు, పబ్‌లు, క్లబ్‌లు, రెస్టారెంట్‌లలోనూ అదే సందడి.. ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్‌ కావడంతో జాతీయభావం ఉప్పొంగింది. పలు గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ల వద్ద జాతీయపతాకాలు రెపరెపలాడాయి. చాలా చోట్ల మ్యాచ్‌ ఆరంభంలో జాతీయ గీతం ఆలపించారు. వారాంతంలో రాత్రివేళలో సందడిగా కనిపించే వేదికల వద్ద జనాలు కనిపించలేదు. వీధులన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ఏడుగంటలకల్లా నగరవాసులు ఇళ్లలోని టీవీలకు అతుక్కుపోయారు. కుర్రకారంతా స్నేహితులతో కలిసి ఒక్కచోట చేరారు. తెరల ముందు తమ అభిమాన క్రికెటర్ల ఆటను తిలకిస్తూ ఈలలు వేస్తూ సందడి చేశారు. ప్రత్యేక రాయితీలు, ఆఫర్లు ప్రకటించడంతో శనివారం రోజే బార్‌లు, రెస్టారెంట్లు, పబ్‌లు, క్లబ్‌లలో రిజర్వ్‌ అయినట్లు ఈవెంట్ మేనేజర్లు చెప్పుకొచ్చారు. కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టాలో సుమారు 3వేల కుటుంబాలున్నాయి. 1500 మంది కూర్చొని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. వివిధ సంస్కృతుల మిళితమైన ఈ కమ్యూనిటీలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మ్యాచ్‌ను తిలకించేందుకు భారీ తెరను ఏర్పాటు చేసి, మరింత జోష్‌ నింపేందుకు సంగీత వాద్యకారులను ఏర్పాటు చేశారు. భారత బ్యాటర్స్‌ బంతినిబౌండరీ దాటించినప్పుడల్లా ఈలలు, కేరింతలతో, జాతీయ పతాకాన్ని ఎగరేస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో క్యాంపస్‌లోని వివేకానంద ఎమినిటీస్‌ సెంటర్‌లో భారీ తెరను ఏర్పాటు చేశారు. సరూర్‌నగర్‌లో కార్పొరేటర్‌ ఆకుల శ్రీవాణి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బిగ్‌స్క్రీన్‌ వద్దకు చేరుకున్న యువకులు నృత్యాలు చేస్తూ అక్కడున్నవారిలో జోష్‌ నింపారు. హైదరాబాద్‌ శివారులోని స్పాంజిలా గేటెడ్‌ కమ్యూనిటీ, నార్సింగిలోని మై హోమ్‌ అవతార్‌ గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాంగణంలో వందలాది మంది వీక్షించేందుకు పెద్ద తెరలను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన తెర వద్ద విద్యార్థులు

ఓటమితో..
పక్కా గెలిచేది మనమే అంటూ ‘భారత్‌-పాక్‌’ క్రికెట్‌ మ్యాచ్‌ను చూసేందుకు నగరవాసులు ఉత్సాహంతో ఎదురు చూశారు. భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. గెలిచిన తర్వాత సంబురాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. చివరకు.. ఓటమి ఎదురు కావడంతో ఒక్కసారిగా నిరాశ చెందారు. రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. ‘భారత్‌’ తరఫున బెట్టింగ్‌ కాసిన వాళ్లంతా నిట్టూర్చారు.


ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌...

పోలీసుల నిఘా ఎక్కువగా ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో జోరుగా బెట్టింగ్‌లు సాగాయి. బెట్టింగ్‌రాయుళ్లందరూ ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌లలో గ్రూపులను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ కావడంతో కోట్లాది రూపాయల బెట్టింగ్‌ జరిగినట్లు అంచనా. వెయ్యి రూపాయల నుంచి మొదలుకొని లక్ష రూపాయల వరకు బెట్టింగ్‌ కాశారు. యువత, ఐటీ ఉద్యోగులు ఇందులో పాల్గొన్నట్లు సమాచారం. టాస్‌ ఎవరు నెగ్గుతారు..? మొదటి బాల్‌ నుంచి చివరి బాల్‌ వరకు బంతి బంతికి, ఎవరు ఎన్ని వికెట్లు తీస్తారు..ఎవరు ఎన్ని పరుగులు చేస్తారు...? అన్నట్టు బెట్టింగ్‌ జరిగింది. ఆన్‌లైన్‌ మార్కెట్‌లో వెయ్యికి రెండువేలు పలికినట్లు అభిమానుల మధ్య చర్చ నడిచింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని