ఆదాయపు పన్ను అధికారినంటూ మోసం
eenadu telugu news
Published : 25/10/2021 02:49 IST

ఆదాయపు పన్ను అధికారినంటూ మోసం

కుత్బుల్లాపూర్‌, న్యూస్‌టుడే: ఆదాయపు పన్ను శాఖ అధికారినంటూ మాయమాటలు చెప్పి నగల దుకాణంలో రూ.1.50 లక్షల విలువైన నగలతో ఓ కేటుగాడు ఉడాయించిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్‌ నుంచి జీడిమెట్ల సుచిత్ర కూడలికి వెళ్లేదారిలో మూడు గుళ్ల వద్ద ఉన్న ఐమాత నగల షాపునకు ఈనెల 21న గుర్తుతెలియని వ్యక్తి కారులో వచ్చాడు. ఆ సమయంలో షాపు యజమాని లేకపోవడంతో అందులో పనిచేసే వ్యక్తితో తనను తాను ఆదాయపు పన్ను శాఖ అధికారినని పరిచయం చేసుకున్నాడు. యజమానికి ఫోను చేసి తనకు బంగారు అమ్మవారి విగ్రహం కావాలన్నాడు. నేను బయట ఉన్నానని చెప్పడంతో అక్కడి నుంచి అదే ప్రాంతంలోని ఏజే నగల షాపులోకి వెళ్లి రెండు నగలు ఎంపిక చేసుకుని బిల్లు ఎంతయిందని అడిగాడు. రూ.1.50 లక్షలు అవుతుందని యజమాని చెప్పడంతో ఆ మొత్తాన్ని గూగుల్‌ పే చేస్తానన్నాడు. యజమాని ఒప్పుకోకపోవడంతో ఏటీఎంలో డ్రా చేసుకు వస్తానని మళ్లీ ఐమాత నగల షాపునకు వెళ్లి రూ.లక్షన్నర విలువచేసే సొమ్ములు కొనుగోలు చేశాడు. డబ్బులు ఆన్‌లైన్‌లో పంపుతానని నమ్మబలికి అక్కడి నుంచి జారుకున్నాడు. జీడిమెట్ల పైపులైన్‌ రోడ్డు వద్ద కారు దిగి ఇప్పుడే వస్తానని డ్రైవర్‌కు చెప్పి పక్కకు వెళ్లాడు. ఎంతకు రాకపోవడంతో కారు డ్రైవర్‌ ఐమాత నగల దుకాణానికి వెళ్లి మీ వద్ద సొమ్ములు తీసుకున్న వ్యక్తి వచ్చాడా? అని అడగ్గా రాలేదని చెప్పాడు. రూ.5 వేలకు ఒక రోజు కారు బుక్‌ చేసుకుని నా వద్ద రూ.2 వేలు తీసుకున్నాడని చెప్పడంతో కంగు తిన్న షాపు యజమాని మోసపోయానని భావించి పేట్‌బషీరాబాద్‌ పోలీసులను ఆశ్రయించాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని