శివార్లు నేరాలకు అడ్డాలు!
eenadu telugu news
Updated : 25/10/2021 11:16 IST

శివార్లు నేరాలకు అడ్డాలు!

* హిమాయత్‌సాగర్‌ వద్ద ఒక మహిళపై సామాహిక అత్యాచారం జరిగింది. కల్లు కాంపౌండ్‌లో పీకల దాకా తాగిన ముగ్గురు మృగాళ్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
* చింతల్‌మెట్‌ వద్ద ఓ యువతి ప్రియుడితో కలసి కన్నతల్లినే హత్య చేయడం సంచలనంగా మారింది. ప్రేమకు అడ్డు చెబుతోందనే ఈ దారుణానికి తెగించినట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.
* జల్‌పల్లి చెరువు వద్ద రోజుల వ్యవధిలోనే రెండు మృతదేహాలను గుర్తించారు. తాజాగా ఓ వ్యక్తిని  హత్యచేసి ఇదే ప్రాంతంలో దహనం చేసేందుకు   ప్రయత్నించారు.

ఈనాడు, హైదరాబాద్‌: నగర శివారు ప్రాంతాలు నేరాలకు కేంద్రాలుగా మారాయి. మారణాయుధాలతో యథేచ్ఛగా తిరిగే రౌడీ షీటర్లు, ఆధిపత్య పోరులో ప్రతీకార దాడులకు దిగే మూకలు, పక్కా ప్రణాళికతో హత్యలు, ఒంటరి మహిళ కనిపిస్తే రెచ్చిపోయే మృగాళ్లు.. వెరసి ఈ ప్రాంతంలో కొద్దినెలల వ్యవధిలోనే ఏడు హత్యలు జరిగాయంటే శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. గ్రేటర్‌ పరిధిలో శివారు ప్రాంతాల్లో పరిశ్రమలు, నివాసాలు పెరుగుతున్నాయి. దీంతో అక్కడ భూముల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఇదే అవకాశంగా భూదందాలతో రౌడీ షీటర్లు చెలరేగుతున్నారు. స్థల వివాదాల్లో తలదూర్చి ప్రైవేటు పంచాయితీలతో రూ.లక్షలు గుంజుతున్నారు. ఈ వ్యవహారంలో వర్గాలుగా మారిన ముఠాలు హవా కొనసాగించేందుకు పరస్పర దాడులకు దిగుతున్నాయి. చీకటి పడితే చాలు ఏ మూలన ఏం జరుగుతుందోననే పరిస్థితి కొనసాగుతోంది.

రాత్రయితే వణకాల్సిందేనా..
సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో.. రాజేంద్రనగర్‌, కాటేదాన్‌, మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్‌, పహాడీ షరీప్‌ పరిధిలో అధిక శాతం నేరాలు నమోదవుతుంటాయి. అంతర్జాతీయ విమానాశ్రయం, రక్షణ రంగ పరిశోధన, వ్యవసాయ విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థలున్న ప్రాంతాల్లో శాంతి భద్రతలు పోలీసులకు సవాల్‌గా మారాయి. పహాడీ షరీఫ్‌ ప్రాంతంలో ఏడేళ్ల కిందట స్నేక్‌గ్యాంగ్‌ ఎన్నో దారుణాలు చేసింది. భూదందాలు, అఘాయిత్యాలు, వసూళ్లతో సంచలనం రేకెత్తించింది. ఖాకీలకే సవాల్‌ విసిరిన ఈ ముఠా అరెస్టుతో దారుణాలకు అడ్డుకట్ట పడింది. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే రాత్రి నిఘా, బందోబస్తులతో పోలీసులు హడావుడి చేస్తున్నారు. రౌడీ షీటర్లు, పాత నేరస్థుల కదలికలపై నిఘా కొరవడటంతో మరింత పేట్రేగిపోతున్నారు. బాలాపూర్‌, కాటేదాన్‌, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల్లో వీరి ఆగడాలు రోజురోజుకూ శ్రుతి మించుతున్నాయి. కొన్నిసార్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకే వెనుకంజ వేయాల్సి వస్తోంది. చీకటి పడితే చాలు మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల మార్గాల్లో ప్రయాణించేందుకు జనం వణకిపోతున్నారు. కొన్ని రెస్టారెంట్లు, ఫంక్షన్‌ హాళ్లు సివిల్‌ తగాదాల పంచాయితీలకు అడ్డాలుగా మారాయి.

ఎక్కడో చంపేసి.. ఇక్కడ..
నేరస్థులకే కాదు.. నేరాలను కప్పిపుచ్చుకునేందుకు శివార్లు కేంద్రమవుతున్నాయి. నిర్మానుష్య ప్రదేశాలు, అటవీ ప్రాంతాలు, పారిశ్రామిక వాడలు ఎక్కువగా ఉండటంతో రాత్రిళ్లు జన సంచారం తక్కువ. సీసీ కెమెరాలు లేకపోవడం, గస్తీ నామమాత్రంగా ఉండటం నేరగాళ్లకు మరింత కలసివస్తోంది. కుటుంబ తగాదాలు, వివాహేతర సంబంధాలు, భూ వివాదాలు, ఆధిపత్య పోరులో చేసిన హత్యలను కప్పిపుచ్చుకునేందుకు ఈ ప్రాంతాలను అనుకూలంగా మలచుకుంటున్నారు. మృతదేహాలను ఇక్కడకు తీసుకొచ్చి ఆనవాళ్లు లేకుండా దహనం చేస్తున్నారు. కొన్నిసార్లు చెరువులో పడేసి వెళ్లిపోతున్నారు. ఈ కేసుల్లో మృతుల వివరాలు సేకరించడం, నేరస్థులను గుర్తించడం పోలీసులకు ఇబ్బందిగా మారుతోంది. అనుమానాస్పద మృతి కేసులుగా మిగిలిపోతున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని