కూచిపూడి కళా వైభవాన్ని ప్రపంచానికి చాటాలి
eenadu telugu news
Published : 25/10/2021 02:49 IST

కూచిపూడి కళా వైభవాన్ని ప్రపంచానికి చాటాలి

ప్రొ.అనురాధకు పద్మశ్రీ శోభానాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేస్తున్న చిన జీయర్‌ స్వామి

శంషాబాద్‌, న్యూస్‌టుడే: కూచిపూడి నాట్య వైభవాన్ని లోకానికి అందించే సారథులుగా కళాకారులందరూ ఎదగాల్సిన అవసరం ఉందని త్రిదండి రామానుజ చిన జీయర్‌ స్వామి పేర్కొన్నారు. శ్రీరామనగరంలో మూడు రోజుల పాటు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ - సేవ్‌ కూచిపూడి ఆర్టిస్ట్స్‌ సంస్థల ఆధ్వర్యంలో రెండవ ప్రపంచ కూచిపూడి నృత్య మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఆదివారం ముగింపు కార్యక్రమానికి చిన జీయర్‌ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన 2500 మంది నృత్య కళాకారులు కూచిపూడి నాట్యాలను ఐదు వేదికలపై ప్రదర్శించారు. ప్రొఫెసర్‌ వసంత్‌ కిరణ్‌, శ్రీనివాస్‌ చక్రవర్తి కథాకళి కూచిపూడి మేళవింపుతో ప్రదర్శించిన నరసింహ అవతారం నృత్యం ఆకట్టుకుంది. హిందు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడమే కాకుండా కూచిపూడి నృత్య కళాకారులను సమాజానికి అందిస్తున్న నాట్య గురువులను అబినందించారు. హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ అనురాధకు పద్మశ్రీ శోభ నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చిన జీయర్‌ స్వామి మాట్లాడుతూ.. కూచిపూడి నాట్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వెంపటి చిన సత్యం తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. కూచిపూడి నాట్య వెలుగులను విశ్వ వ్యాప్తం చేయాలన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సమతామూర్తి విగ్రహావిష్కరణ ఉత్సవాల్లో వెయ్యి మంది కూచిపూడి నృత్య కళాకారులతో నృత్య ప్రదర్శన చేయించడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని సేవ్‌ కూచిపూడి ఆర్టిస్ట్స్‌ సంస్థ అధ్యక్షురాలు భావన పెదప్రోలు పేర్కొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ తంగెడ కిషన్‌రావు, కూచిపూడి సిద్దేంద్రయోగి కళాపీఠం ప్రిన్సిపల్‌ వేదాంతం రామలింగ శాస్త్రి, కాంచీపురం చంద్రశేఖర సరస్వతి విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ జయరామిరెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని