TS News: ఒక కాగితానికి రూ.వంద ఖర్చు
eenadu telugu news
Updated : 25/10/2021 09:25 IST

TS News: ఒక కాగితానికి రూ.వంద ఖర్చు

సమాచార హక్కు చట్టం అర్జీకి ప్రభుత్వ కార్యాలయం తీరు ఇది

సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్‌

ఈనాడు, హైదరాబాద్‌: సమాచార హక్కు చట్టాన్ని కొందరు అధికారులు నీరుగారుస్తున్నారు. పౌరులు సమాచారం అడగడమే తప్పు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక కాగితం ఇచ్చేందుకు రూ.వంద ఖర్చు చేశారు. అధికారుల తీరుకు దరఖాస్తుదారుడు విస్తుపోయారు. తెలంగాణ రాష్ట్ర రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌కు సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్‌ సమాచార హక్కు చట్టం కింద ఒక దరఖాస్తు చేశారు. స్వగృహ కింద ఎన్ని ఇళ్లు నిర్మించారు? ఎన్ని విక్రయించారు? ఇంకా ఎన్ని ఖాళీగా ఉన్నాయని అడిగారు. ఈ సమాచారం కాపీలను ఇచ్చేందుకు, వాటికి తపాలా ఛార్జీలు కలిపి రూ.34 అవుతుందని వారి కార్యాలయానికి తపాలాలో లేఖ పంపించారు. ఇంకా ఎక్కువే ఖర్చు కావొచ్చు అని పేర్కొన్నారు. దరఖాస్తుదారుడు రూ.40కి పోస్టల్‌ ఆర్డర్‌ చెల్లించారు. కొద్దిరోజుల తర్వాత స్వగృహ కార్పొరేషన్‌ అధికారులు సమాచారాన్ని తపాలాలో పంపించారు. తీరా తెరిచి చూస్తే అందులో ఒకే ఒక పేజీ ఉంది. విస్తుపోవడం దరఖాస్తుదారుడి వంతైంది. డబ్బులు కట్టాలని లేఖ పంపే బదులు ఆ ఒక్క పేజీ పంపితే సరిపోయేది కదా అంటే.. తాము చట్టం ప్రకారం నడుచుకుంటున్నామని చెప్పడం కొసమెరుపు. ఒక పేజీ సమాచారం కోసం దరఖాస్తుదారునికి దరఖాస్తు ఫీజు రూ.10, పోస్టల్‌ ఆర్డర్‌ రూ.40 ఖర్చు కాగా.. డబ్బులు కట్టాలని మొదట పంపిన లేఖకు రూ.25, సమాచారం ఒక పేజి పంపేందుకు రూ. 25 చొప్పున తపాలా ఛార్జీ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని