దిక్కులేని దవా.. ప్రైవేటు హవా!
eenadu telugu news
Published : 25/10/2021 02:49 IST

దిక్కులేని దవా.. ప్రైవేటు హవా!

ఈనాడు, హైదరాబాద్‌

ప్రభుత్వ ఆసుపత్రుల్లో దవాకు దిక్కులేదు. వివిధ అనారోగ్య సమస్యలతో వస్తున్న వారికి చుక్కెదురవుతోంది. చికిత్సల్లో భాగమైన ఔషధాలు పూర్తి స్థాయిలో లభించడం లేదు. అడిగితే సరఫరా లేదని, బయట కొనుక్కోవాలని ఉచిత సలహా ఇస్తున్నారని రోగులు వాపోతున్నారు. పెద్దాసుపత్రులైన గాంధీ, ఉస్మానియాతోపాటు నిలోఫర్‌, పేట్లబుర్జు, ఈఎన్‌టీ ఆసుపత్రుల్లో ఇదే తీరు ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులకు 80 శాతం మందులను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ సరఫరా చేస్తుంది. మరో 20 శాతం మందులను అత్యవసర పద్ధతిలో బడ్జెట్‌లో ఆయా ఆసుపత్రులు కొనుగోలు చేస్తాయి. తొలుత ఆయా దవాఖానాల నుంచి విభాగాల వారీగా ఇండెంట్‌ అందిస్తారు. అయితే ఆసుపత్రులు అందించే జాబితాకు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ నుంచి సరఫరా అయ్యే మందులకు పొంతన ఉండటం లేదు. ఉదాహరణకు.. ఉస్మానియా నుంచి 20 రకాల మందులకు ఇండెంట్‌ పెడితే 10-12 రకాల మాత్రమే సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే సమస్య. పేదలు ప్రైవేటులో డబ్బులు పోసి వైద్యం చేయించుకోలేక ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటారు. తీరా మందులను బయట కొనుక్కునే పరిస్థితి తలెత్తుండటంతో లబోదిబోమంటున్నారు.


గౌలిపురాకు చెందిన ఈమె పేరు పల్లవి. అనారోగ్య సమస్యతో ఉస్మానియా ఓపీలో చూపించుకుంటే పరీక్షలు చేసిన వైద్యులు 5 రకాల మందులు రాస్తే కౌంటర్‌లో 2 రకాలు అందించారు. మిగతా వాటిని బయట తీసుకోవాలని చెప్పారు.


అత్యవసర బడ్జెట్‌ వాటికే..

ఉస్మానియాలో హీమోఫీలియా వ్యాధిగ్రస్తులు 400 మంది వరకు చికిత్స తీసుకుంటున్నారు. ఈ రోగుల్లో రక్తం గడ్డకట్టడానికి అవసరమైన 13 కారణాల్లో 8, 9 ఫ్యాక్టర్లు లోపం ఉండే ఈ చికిత్సకు చాలా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఉస్మానియాలో చికిత్స పొందుతున్న వారికి ఏటా రూ.4 కోట్లు వరకు ఖర్చవుతోంది. ప్రత్యేక బడ్జెట్‌ లేకపోవడంతో ఉస్మానియాకు అందించే సాధారణ బడ్జెట్‌లోనే ఈ మందులను కూడా కొనుగోలు చేస్తున్నారు. గాంధీలో కూడా ఖరీదైన మందులు కొనుగోలు చేయడానికి అత్యవసర బడ్జెట్‌ కేటాయిస్తున్నారు.

సరఫరా పెంచాలి..

ప్రస్తుతం ఉస్మానియా, గాంధీలో దవాఖానాలో అత్యవసర మందుల కోసం (20 శాతం) ఏటా రూ.35-40 కోట్లు కేటాయిస్తున్నారు. దీంతో సాధారణ రోగుల చికిత్సలకు ఈ నిధులు ఎటూ సరిపోవడం లేదు. ఇవే నిధుల్లో హీమోఫీలియాలాంటి ఖరీదైన చికిత్సలకు కేటాయించడం వల్ల నిధుల కొరత తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో అదనపు బడ్జెట్‌ కేటాయించడంతోపాటు రోగుల తాకిడికి తగ్గట్లు మందుల సరఫరా పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.


లబురిగికి చెందిన ఈమె గైనిక్‌ సమస్యతో గాంధీలో వైద్యులను సంప్రదించింది. పరీక్షల చేసిన వైద్యులు 9 రకాల గోలీలు రాశారు. మందుల కౌంటర్‌కు వెళ్తే ఒక్క రకం మాత్రమే చేతిలో పెట్టి మిగతావి లేవని, బయటే కొనుక్కోవాలని సూచించారు. అక్కడే ప్రైవేటు మెడికల్‌ షాపులో రూ.3 వేలు పెట్టి 15 రోజుల కోసం మందులు కొని ఇంటిముఖం పట్టింది.  


సాధారణ మందులూ కొరతే..

కొన్నిరకాల బీపీ, మధుమేహ, నొప్పి నివారణ మందులు, మల్టీ విటమిన్‌ మాత్రలు పూర్తిస్థాయిలో దొరకడం లేదు. కరోనా తర్వాత చాలామంది దగ్గు, ఆయాసం, నిద్ర పట్టకపోవడం, కీళ్ల నొప్పులు, కడుపులో తిప్పడం, అజీర్ణత, గ్యాస్ట్రిక్‌ సమస్యలు, గుండె దడలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఓపీ వైద్యులు మల్టీ విటమిన్‌ మాత్రలు రాసినా అవి దొరకడం లేదు. ప్రైవేటుగా కొనేందుకు డబ్బుల్లేక కొందరు ఉచితంగా ఇచ్చిన మందులనే తీసుకొని వెళ్తుండడంతో కొందరికి రోగం తగ్గడం లేదు.


వారికి పండగే..

స్మానియా, గాంధీ, నిలోఫర్‌ లాంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ప్రైవేటు మెడికల్‌ దుకాణాలకు కాసులు కురుస్తున్నాయి. గాంధీలో 3 ప్రైవేటు మెడికల్‌ షాపులున్నాయి. ఒక్క గాంధీలోనే నెలకు తక్కువలో తక్కువ రూ.3-5 కోట్ల వరకు మందులు విక్రయిస్తున్నారు. ఉస్మానియా, నిలోఫర్‌లోనూ అదే పరిస్థితి. ఆసుపత్రుల్లో జనరిక్‌ మందుల షాపులున్నా రోగులు వెళ్లడం లేదు. వైద్యులు సైతం బ్రాండెడ్‌ మందుల వైపే మొగ్గు చూపుతుండటంతో ప్రైవేటు మెడికల్‌ స్టోర్‌ల పంటపండుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని