Ts News: తెలంగాణలో ‘త్రీ’ ఐ సూత్రాన్ని పాటిస్తున్నాం: కేటీఆర్‌
eenadu telugu news
Updated : 25/10/2021 20:13 IST

Ts News: తెలంగాణలో ‘త్రీ’ ఐ సూత్రాన్ని పాటిస్తున్నాం: కేటీఆర్‌

హైదరాబాద్: సమగ్ర కుటుంబసర్వే దేశ చరిత్రలోనే సంచలనం అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రకటించారు. ఒక్కరోజులోనే తెలంగాణ ముఖచిత్రాన్ని ఆవిష్కరించిందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే వల్లే సంక్షేమాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లగలిగామన్నారు. హైదరాబాద్‌ హైటెక్స్‌లో జరిగిన తెరాస ప్లీనరీలో పాలనా సంస్కరణలు, విద్యుత్‌, ఐటీ, పారిశ్రామిక అభివృద్ధిపై కేటీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో ‘త్రీ’ ఐ సూత్రం పాటిస్తున్నామని ప్రధాని మోదీకి వివరించినట్లు చెప్పారు. ‘త్రీ’ ఐ అంటే ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూసివ్‌ గ్రోత్‌ అని వివరించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే నిర్వహించి.. అక్షాంశాలు, రేఖాంశాలతో భూములను గుర్తించి పాసు పుస్తకాలు జారీ చేస్తామన్నారు. కేసీఆర్‌ అంటే.. కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని కేటీఆర్‌ అన్నారు.

‘‘రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌తో నిరంతర సంపద సృష్టి జరుగుతోంది. గూగుల్‌కు గుండెకాయ.. అమెజాన్‌, యాపిల్‌కు ఆయువుపట్టు హైదరాబాద్. ఫేస్‌బుక్‌ ఫస్ట్‌ ఫేవరేట్‌ డెస్టినేషన్‌ హైదరాబాద్‌. ఐటీ అంటే ఇన్‌క్రెడిబుల్‌ తెలంగాణ.  దేశంలోనే అతిగొప్ప స్టార్టప్‌గా రాష్ట్రం అవతరించింది. బంగాల్‌ ఆలోచించేది దేశం మొత్తం ఆలోచిస్తుందనేది ఒకప్పటి మాట. ఇప్పుడు తెలంగాణ ఆలోచించేదే దేశం ఆలోచిస్తోంది. తెలంగాణ వస్తే ఉద్యోగాలు రావన్నారు. ఉన్న పెట్టుబడులు పోతాయని వెక్కిరించారు. టీఎస్‌ ఐపాస్‌తో తెలంగాణకు కంపెనీలు క్యూ కట్టాయి. ఒకప్పుడు విమర్శించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. తయారీ పరిశ్రమలో తెలంగాణకు ఎదురులేదు. ఫార్మా రంగంలో అగ్రస్థానంలో ఉన్నాం. టీకాల ఉత్పత్తిలో ప్రపంచానికి రాజధానిగా మారాం. నాడు ఆగమైన తెలంగాణ నేడు దేశానికే ఆదర్శమైంది. ఉపాధి అవకాశాలకు తెలంగాణ అక్షయపాత్ర అయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీకి హైదరాబాద్‌ బ్యాకప్‌ మాత్రమే. ఇవాళ ఐటీకి హైదరాబాద్‌ బ్యాక్‌ జోన్‌ అయింది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని