ఆలోచనలు రంగరించే..గులాబీ గుబాళించె
eenadu telugu news
Published : 26/10/2021 04:32 IST

ఆలోచనలు రంగరించే..గులాబీ గుబాళించె

పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు దట్టీ కడుతున్న హోం మంత్రి మహమూద్‌ అలీ

 

సభాస్థలిలో పతాకావిష్కరణ

ఎటుచూసినా గులాబీ జెండాలు.. భారీగా తరలివచ్చిన ప్రత్యేక ఆహ్వానితులు.. అధినాయకుడి ఆకట్టుకునే ప్రసంగం.. వంటకాల ఘుమఘుమలతో సోమవారం హైటెక్స్‌లో సందడి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సమితి సర్వ ప్రతినిధుల మహాసభ(ప్లీనరీ) ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది. ఇరవై ఏళ్ల పార్టీ ప్రయాణాన్ని మననం చేసుకుని బంగారు తెలంగాణ భవితను ఆకాంక్షిస్తూ మేధో మథనం చేశారు. నగర ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు.

అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్న మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత

వేదికపై ఆసీనులైన ఎంపీ సంతోష్‌కుమార్‌, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తదితరులు

10 వేల వాహనాలకు పార్కింగ్‌
నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు వాహనాలకు పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. పది వేల వాహనాలొచ్చినా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. న్యాక్‌, నోవాటెల్‌ పీ1, పీ2, జయభేరి, అన్నమయ్యపురం, బొటానికల్‌ గార్డెన్‌ తదితర చోట్ల 14 కేంద్రాలు అందుబాటులో ఉంచారు.

 

ఎంతో రుచిరా..  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాలులో భోజనం చేస్తున్న ఆహ్వానితులు

 

రానివ్వండి సార్‌.. పాసులేనివారిని అనుమతించకపోవడంతో పోలీసులతో కార్యకర్తల వాగ్వాదం

పార్టీ శ్రేణుల్లో జోష్‌
ఈనాడు, హైదరాబాద్‌: తెరాస ప్లీనరీ విజయవంతంలో ‘గ్రేటర్‌’ కీలక పాత్ర పోషించింది. నగరానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమకు అప్పగించిన బాధ్యతలను పక్కాగా నిర్వహించి శెభాష్‌ అనిపించుకున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ దృష్టిలో పడేందుకు పోటీ పడి మరీ ఏర్పాట్లు చేశారు.
*  అందరికీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతోనే ‘హైటెక్స్‌’ను వేదికగా ఎంపిక చేశారు. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని పలువురు ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్‌, డి.సుధీర్‌రెడ్డి, వివేకనంద, మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎంపీ రంజిత్‌రెడ్డి, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తదితరులు అన్నీ తామై వ్యవహరించారు.  
* గ్రేటర్‌లో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై తెరాస అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. బస్తీలు, వార్డులు, డివిజన్ల కమిటీల నియామకంపై కసరత్తు చేసింది. ఆ మేరకు జలవిహార్‌లో మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి మార్గనిర్దేశనం చేశారు. దీంతో కేడర్‌లో కొంత జోష్‌ వచ్చింది. ప్లీనరీ కూడా విజయవంతం కావడంతో అది మరింత పెరిగిందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.

 

కటౌట్‌ చాలు..  ప్లీనరీకి వచ్చి కేసీఆర్‌ కటౌట్‌తో ఇంటిబాట పట్టిన ఖైరతాబాద్‌కు చెందిన కార్యకర్త అహ్మద్‌.. ఆయనే మా దేవుడు ఇంటిపైనే దీన్ని పెట్టుకుంటానని చెప్పాడు
 

ఇరానీ ఛాయ్‌కి ఫిదా
నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఇరానీ ఛాయ్‌కు సభికులంతా ఫిదా అయ్యారు. అచ్చం కేఫ్‌లో మాదిరిగానే ప్రత్యేకంగా ‘ఇరానీ ఛాయ్‌’ కౌంటర్లు ఏర్పాటు చేశారు. సభ ముగిసే వరకు వేడివేడి ఛాయ్‌ను అందజేశారు.

జిల్లాకో నమోదు కేంద్రం
కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. పాస్‌ ఉంటేనే అనుమతిచ్చారు. ప్రధాన ద్వారం వద్ద మెటల్‌ డిటెక్టర్లతో క్షుణ్నంగా తనిఖీ చేసే పంపించారు. రద్దీ నివారణకు జిల్లాకొకటి చొప్పున 33 రిజిస్ట్రేషన్‌ కౌంటర్లను అందుబాటులో ఉంచారు. పాస్‌ లేని కొందరు తమను అనుమతించాలంటూ ప్రధాన ద్వారం దగ్గర నినాదాలు చేశారు. శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి వారికి సర్దిచెప్పి పంపించారు.

తొలిసారి రాజకీయ సమావేశానికి
హైటెక్స్‌.. సాధారణంగా జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, ప్రదర్శనలకు, ప్రముఖుల కుటుంబాల శుభకార్యాలు వేదికవుతుంటుంది. తొలిసారి ఓ రాజకీయ పార్టీ ప్లీనరీ జరగడంతో హైటెక్‌ సిటీ పరిసరాలన్నీ గులాబీమయమయ్యాయి. స్వాగత తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని