ఊడిపడుతున్న పెచ్చులు.. ఊపిరి బిగబడుతున్న వైద్యులు
eenadu telugu news
Updated : 26/10/2021 11:55 IST

ఊడిపడుతున్న పెచ్చులు.. ఊపిరి బిగబడుతున్న వైద్యులు

సీలింగ్‌  ఫ్యాన్‌ పడి వైద్యురాలికి గాయాలు

ఈనాడు, హైదరాబాద్‌

ఉస్మానియా పాత భవనం

 ఊడి కిందపడిన ఫ్యాన్‌

* ఉస్మానియాలో సూపరింటెండెంట్‌ గదిలో గతేడాది పెచ్చులూడి పడ్డాయి. ఆ సమయంలో సీటులో సూపరింటెండెంట్‌ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
* మెడికల్‌ ఎమర్జెన్సీ భవనంలో రెండు నెలల క్రితం విచారణ రూంలో, ఓపీ భవనంలోని హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ గదుల్లో ఫ్యాన్లు ఊడిపడ్డాయి. అదృష్టవశాత్తూ అప్పుడూ ఎవరికీ ఏం కాలేదు.


ఉస్మానియా ఆసుపత్రిలో రోగులు, వైద్య సిబ్బంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ మూల నుంచి ఏ ఫ్యాను ఊడిపడుతుందో లేదంటే ఎక్కడ భవనం పెచ్చులు మీద పడతాయోనని భయపడుతున్నారు. తాజాగా సోమవారం ఓ పీజీ వైద్య విద్యార్థిపై పాత ఫ్యాను ఊడిపడింది. ఆమె అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఇటీవలి కాలంలో తరచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రోజు రోజుకు రోగుల తాకిడి పెరుగుతోంది. ఆ మేరకు మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం కన్పిస్తోంది. ఇప్పటికే పాత భవనం శిథిలావస్థకు చేరడంతో దానిని మూసి వేశారు. అక్కడ ఉన్న 400 పడకలను కులీ కుత్బుషాహీతోపాటు ఓపీ భవనాల్లో సర్దుబాటు చేశారు. ఇందులో ఓపీ భవనం కూడా ఎప్పుడో 50 ఏళ్ల క్రితం నిర్మించారు. వర్షానికి గోడలు, స్లాబుల్లోకి నీళ్లు చిమ్ముతున్నాయి. దీంతో తరచూ పెచ్చులూడటం, ఫ్యాన్లు ఊడిపడటం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భవనాల నిర్వహణ, మరమ్మతులను టీఎస్‌ఐఎంఐడీసీ చేపట్టాలి. అయితే సంబంధిత అధికారులు ఆ విషయమే మరిపోయారు.

జూనియర్‌ వైద్యురాలిని  పరామర్శిస్తున్న డా.నాగేందర్‌

ఉస్మానియా ఆసుపత్రి: ఉస్మానియా ఆసుపత్రి ఓపీ భవనంలోని సీలింగ్‌ ఫ్యాన్‌ ఊడి, తలపై పడటంతో ఓ జూనియర్‌ వైద్యురాలికి గాయాలయ్యాయి. ఓపీ కొనసాగుతున్న సమయంలో జరిగిన ఈ హఠాత్పరిణామంతో వైద్యులు, సిబ్బంది, రోగులు, వారి సహాయకులు భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రి వర్గాలు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఓపీ భవనం మొదటి అంతస్తులోని చర్మవ్యాధుల విభాగంలో జూనియర్‌ వైద్యురాలు భువనశ్రీ, మరో వైద్యుడు రోగులను పరీక్షిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆమె కూర్చున్న గదిలోని పాతకాలం నాటి సీలింగ్‌ ఫ్యాన్‌ ఊడిపోయి తలపై పడింది. చేయి అడ్డుపెట్టడంతో తల, చేయికి స్వల్ప గాయాలయ్యాయి. సహచర వైద్యులు ఆమెకు చికిత్స చేయించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.నాగేందర్‌ చర్మవ్యాధుల విభాగానికి వెళ్లి భువనశ్రీని పరామర్శించారు. తమకు రక్షణ లేకుండా పోయిందని జూనియర్‌ వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని