వివాహానికి వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు
eenadu telugu news
Updated : 26/10/2021 07:07 IST

వివాహానికి వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు

సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ సతీమణి, మరో ఇద్దరి మృతి

ఈనాడు, హైదరాబాద్‌; కీసర, నారాయణగూడ, న్యూస్‌టుడే: ఓ వివాహ వేడుకలో పాల్గొని నగరానికి తిరిగి వస్తున్న వారు ప్రమాదానికి గురవ్వడంతో దంపతులు, మరో మహిళ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘోర దుర్ఘటన కీసర అవుటర్‌ రింగు రోడ్డుపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. కీసర సీఐ జె.నరేందర్‌గౌడ్‌ తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ సతీమణి శంకరమ్మ(48) భర్త సోదరుడి(పెదనాన్న కుమారుడు) మనవడి వివాహానికి రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా చీరాలకు సమీపంలోని ఈపురుపాలెం వెళ్లారు. పెళ్లయ్యాక ఆదివారం రాత్రి రైల్లో ప్రయాణం చేసి హైదరాబాద్‌కు వద్దామనుకున్నారు. మేడ్చల్‌ రైల్వే స్టేషన్‌, జైన్‌ మందిర్‌ వద్ద నివాసం ఉండే ప్రసాద్‌ సోదరుడి కుమారుడు బాలకృష్ణమూర్తి(48).. తన భార్య రేణుక(42), కుమారుడు భాస్కర్‌ కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా మేం ముగ్గురే వెళ్తున్నాం.. మీరూ రండి.. అంతా కలిసే వెళ్దామంటే..శంకరమ్మ కారు ఎక్కారు. ఆదివారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో బయలుదేరారు. నగరానికి వచ్చాక పెద్దఅంబర్‌పేట వద్ద బాహ్యవలయ రహదారి ఎక్కారు. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో కీసర మండలం యాద్గార్‌పల్లి సమీపంలోని డీఆర్‌డీఓ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టింది. వెనుక కూర్చున్న శంకరమ్మ, రేణుక తలలు వెనుక అద్దానికి బలంగా తగిలి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు నడుపుతున్న బాలకృష్ణమూర్తి, పక్కన కూర్చున్న భాస్కర్‌కు గాయాలు కాగా అక్కడికి చేరుకున్న కీసర పోలీసులు వారిని ఈసీఐఎల్‌ చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలకృష్ణమూర్తి చికిత్స పొందుతూ చనిపోయారు. శంకరమ్మ హైదరాబాద్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. భాస్కర్‌ సాయంత్రానికి ఆసుపత్రినుంచి డిశ్ఛార్జి అయ్యారు.


ముగ్గురి కళ్లూ దానం.. 

ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ తన సతీమణి శంకరమ్మ, తన సోదరుడి కుమారుడు బాలకృష్ణమూర్తి ఆయన భార్య రేణుకల కళ్లను దానం చేశారు. ముగ్గురి మృతదేహాలు గాంధీ ఆసుపత్రి నుంచి మూసాపేట్‌లోని తన నివాసానికి తీసుకెళ్లారు. సాయంత్రం ఈఎస్‌ఐ శ్మశాన వాటికలో ముగ్గురి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రసాద్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని