వేర్వేరు చెరువుల్లో ఇద్దరి మృతి
eenadu telugu news
Updated : 26/10/2021 06:33 IST

వేర్వేరు చెరువుల్లో ఇద్దరి మృతి

ఈసీ వాగులో మరో ఇరువురి గల్లంతు

విక్కీపవన్‌కుమార్‌

మొయినాబాద్‌, రాజేంద్రనగర్‌, నందిగామ, న్యూస్‌టుడే: వేర్వేరు చెరువుల్లో పడి ఇద్దరు మృతి చెందారు. ఒకరు ఆత్మహత్యకు పాల్పడగా..గుర్తుతెలియని మరొకరి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.  మరో ఘటనలో ఇద్దరు విద్యార్థులు ఈతకని ఈసీ వాగులో దిగి గల్లంతయ్యారు. సీఐ బి.రాజు వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన విక్కీ(21) కుటుంబం మొయినాబాద్‌ మండలం సజ్జన్‌పల్లి శివారుకు వలస వచ్చింది. తల్లిదండ్రులు వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా నాగసముందర్‌కు చెందిన ఆంజనేయులు(23) తల్లిదండ్రులతో కలిసి కేతిరెడ్డిపల్లిలోని ఓ ఫాంహౌస్‌లో ఉంటున్నాడు. సజ్జన్‌పల్లికి చెందిన పవన్‌కుమార్‌(18) ఇంటర్‌ చదువుతున్నాడు. ఈ ముగ్గురూ స్నేహితులు. సోమవారం సాయంత్రం వెంకటాపూర్‌ సమీపంలోని ఈసీ వాగు కత్వ వద్దకు వెళ్లారు. ముగ్గురు నీళ్లలోకి దూకగా, ఆంజనేయులకు ఈదుతూ బయటకు వచ్చాడు. విక్కీ, పవన్‌కుమార్‌ మునిగిపోయారు. ఆంజనేయులు చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు. వాగులో వరద ప్రవాహం ఉండడం, అప్పటికే చీకటి పడటంతో గాలింపునకు ఆటంకం ఏర్పడింది. గజ ఈతగాళ్లకు సమాచారం ఇచ్చారు. పవన్‌కుమార్‌ ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేశాడు. తల్లిదండ్రులు సన్‌వెల్లి లక్ష్మయ్య, ప్రమీలకు నలుగురు సంతానం కాగా, పవన్‌ మూడో కుమారుడు.  
ఆర్థిక సమస్యలతో హిమాయత్‌సాగర్‌లో దూకి: రాజేంద్రనగర్‌ సీఐ కనకయ్య వివరాల మేరకు.. బోయిన్‌పల్లి సీˆతారామపురంలో నివసించే నరేంద్రకుమార్‌(58) అటో డ్రైవర్‌. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అప్పుడప్పుడు భార్యతో గొడవ పడుతున్నాడు. ఈనెల 24న ఆటో తీసుకొని బయటకెళ్లి తిరిగి రాలేదు. సోమవారం హిమాయత్‌సాగర్‌ చెరువులో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అది నరేంద్ర కుమార్‌దిగా నిర్ధారించారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

చెరువులో గుర్తుతెలియని మృతదేహం: నందిగామ మండలం రంగాపూరు మల్లయ్య చెరువులో 35-40 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి శవం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహం కుళ్లిపోయి ఉంది. ఏఎస్సై భాస్కర్‌రెడ్డి కేసు నమోదు చేశారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని