కుక్క చావు!
eenadu telugu news
Published : 26/10/2021 05:09 IST

కుక్క చావు!

సంరక్షణ కేంద్రాల్లో దారుణ పరిస్థితులు

శునకాల దుస్థితి

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీలోని పలువురు అధికారులు శునకాలతో రాక్షస క్రీడ ఆడుతున్నారు.సాక్షాత్తు సంరక్షణ కేంద్రాలే.. శవాగారాలుగా మారుతున్నాయి. శాస్త్రీయత లేని శస్త్రచికిత్సలు మూగజీవుల ప్రాణం తీస్తున్నాయి.  వీధుల్లో పట్టుకున్న కుక్కలకు రేబిస్‌ నిరోధక టీకా వేసి, భవిష్యత్తులో వాటికి సంతానం కలగకుండా శస్త్రచికిత్స చేసి, నాలుగైదు రోజులపాటు సంరక్షించాల్సిన వైద్యాధికారులు.. వృత్తి ధర్మాన్ని విస్మరించి నిషేధిత సంస్థలతో ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అశాస్త్రీయత.. అమానవీయత..
రోజూ వీధి కుక్కలను పట్టుకుని, దగ్గర్లోని సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లడం పరిపాటి. నిబంధనల ప్రకారం.. ఏ ప్రాంతంలో పట్టుకున్న కుక్కలను మళ్లీ అదే ప్రాంతంలో వదలాలి. ఈ బాధ్యతను రెండేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ ఎన్జీవోలకు అప్పగించింది. అందులో రెండింటిపై ఏడబ్ల్యూబీఐ (యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) చాలా రోజుల క్రితమే నిషేధం విధించింది. పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోని నగరాల్లో శస్త్రచికిత్సలు సరిగా చేయకపోవడం, కుక్కల మరణానికి కారణమవుతున్నాయన్న కారణాలతో ఏడబ్ల్యూబీఐ వాటిపై వేటు వేసింది. అనంతరం అక్కడి స్థానిక సంస్థ ఏబీసీ (యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌) బాధ్యతల నుంచి ఆయా ఎన్జీవోలను తొలగించింది. ఇప్పుడు ఆ 2 సంస్థలకు జీహెచ్‌ఎంసీ ఆశ్రయమిచ్చింది. దసరా రోజున సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేశామని, వాటిలో చాలా కుక్కలు చనిపోయినట్లు గుర్తించామని ఎర్త్‌ కోశంట్‌ అనే ఎన్జీవో సభ్యురాలు డాక్టర్‌ శశికళ ‘ఈనాడు’కు తెలిపారు. వీడియోలు, ఫొటోలు తీసి పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశామన్నారు. మగ  కుక్కలకు,  ఆడ కుక్కలకు ఏడబ్ల్యూబీఐ నిర్దేశించినట్లు కాకుండా ఇష్టానుసారం అవయవాలను కత్తిరిస్తూ మరణాలకు కారణమవుతున్నట్లు మల్కాజిగిరి,  ఎల్లమ్మబండ, అంబర్‌పేట సంరక్షణ కేంద్రాల్లో గుర్తించామని డాక్టర్‌ శశికళ ఆందోళన వ్యక్తం చేశారు. శునకాల సంరక్షణ కేంద్రాల్లో చేసే శస్త్రచికిత్సలు, రేబిస్‌ నిరోధక టీకాల కార్యక్రమాలు సవ్యంగా జరగకపోవడంతోనే కుక్కకాటు సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని