మలిసంధ్యలో.. మమతను పంచుదాం
eenadu telugu news
Updated : 26/10/2021 07:00 IST

మలిసంధ్యలో.. మమతను పంచుదాం

న్యూస్‌టుడే, వికారాబాద్‌

తల్లులకు పాద పూజ

* మోమిన్‌పేట మండలంలో తల్లిని పట్టించుకోకుండా ఆమెను ఇంట్లోనే వదిలిపెట్టి ఇద్దరు కుమారులు భార్యాపిల్లలతో  పట్టణానికి వెళ్లారు. అప్పటికే భర్త మృతి చెందడం, పలకరించే దిక్కు లేక ఇంట్లోనే దయనీయంగా జీవనం కొనసాగించిన విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అయ్యాయి. దీంతో కుమారులు వచ్చి ఆమెను తీసుకెళ్లారు.
* వికారాబాద్‌కు చెందిన విశ్రాంత అధ్యాపక దంపతులకు కుమారుడు, కూతురు సంతానం. వీరిని ఉన్నత చదువులు చదివించడంతో ఇద్దరూ అమెరికాలోనే స్థిరపడ్డారు. విశ్రాంత అధ్యాపక దంపతులు ఒంటరిగా కాలం వెళ్లదీస్తున్నారు. తల్లి అనారోగ్యానికి గురైనా ఎవ్వరూ రాలేదు. తల్లి మృతి చెందాక అంత్యక్రియలు పూర్తి చేసి, తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్పించి అమెరికా వెళ్లిపోయారు.
ఇలా జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఆదరించకుండా పిల్లలు తమ స్వార్థం చూసుకుంటున్నారు. వృద్ధాప్యంలో చేరువగా ఉండి బాగోగులు చూసుకోవాల్సిన వారే మిన్నకుంటున్నారు. ఒంటరిగా
కాలం వెళ్లదీసేలా ప్రవర్తిస్తున్న సంతానం తమ ఉన్నతికి కారణమైన వారిని విస్మరించి విలువలను మరిచిపోతున్నారు. జిల్లాలో ఆస్తి కోసం తల్లిదండ్రులను హతమారుస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతోంది. జన్మనిచ్చిన వారి జీవితాలు సాఫీగా సాగేలా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న విషయాన్ని విస్మరించొద్దు. తమను కుమారులు సరిగ్గా చూసుకోవడం లేదని మూడు నెలల్లో వికారాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు 19 ఫిర్యాదులు అందాయి. వీరికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.

నానమ్మ.. తాతయ్యల విషయానికొస్తే..: ‘అమ్మమ్మ.. నానమ్మ.. తాతయ్య’ల సాన్నిహిత్యాన్ని చిన్నారులు కోరుకుంటారు. వారి చెంతనే మారాం చేస్తారు. ఆత్మీయానురాగాల్ని పంచుకుంటారు. మనోవికాసంలో వీరి పాత్ర కీలకం. ఆరు పదులు దాటాక ఎవరికైనా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. మనుమరాలు వచ్చి తాతయ్య ఆడుకుందామా అంటే చెంగున ఎగిరి గంతులు వేయాలనిపిస్తుంది. వయసు సహకరించకున్నా ఊతకర్ర పట్టుకొని మనుమడు, మనుమరాళ్లతో ఆటలు మొదలు పెడతారు. ఇక కథలు చెప్పుకోవడం, సందేహాలు అడగటం, నివృత్తి చేయడం పరిపాటే. చిన్న పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు కోపగించినప్పుడు వారు తాతయ్య, అమ్మమ్మల వద్దకు పరుగులు తీయడం చూస్తుంటాం. అందుకే మలిసంధ్యలో మనసుకు శాంతినిచ్చే పిల్లలంటే వారికి ఎనలేని ప్రేమ. ఇక ఇంటి పెద్దగా వ్యవహరిస్తూ తమ పిల్లలకు కుటుంబ వ్యవహారాల్లోనూ చేదోడువాదోడుగా ఉంటారు. ఇలాంటి కుటుంబాలు సమాజమనే నాణేనికి ఒక పార్శ్యం మాత్రమే. మరోవైపు.. ఒంట్లో బలం ఉన్నంత వరకు తమ పిల్లలు, మనవళ్లు, తమ ఇల్లు అంటూ ఆరాటపడినవారే ఏ దిక్కూ లేకుండా పలువురు ఒంటరిగా జీవిస్తూ కాలం వెళ్లదీస్తుండగా, మరి కొందరు వీధుల్లో, ఆశ్రమాల్లో కాలం వెళ్లదీస్తున్నారు.

తల్లిదండ్రులకు పాదపూజ..
రెండు దశాబ్దాల కిందటి వరకు కుటుంబంలో తల్లిదండ్రులదే పెద్దరికం. వారి మాటకు తిరుగుండేది కాదు. ఏ పని చేయాలన్నా కుటుంబ పెద్దల అనుమతి తప్పనిసరి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎంతో బలంగా ఉండేది. క్రమక్రమంగా మారుతూ వస్తోంది. తల్లిదండ్రుల మాటకు విలువ లేకుండా పోయింది. కనిపెంచినవారిని ఒంటరిగా వదిలేస్తుండటంతో తమ బాధను ఇతరులకు చెప్పుకోలేక దిగమింగుతున్నారు. ఈ తరుణంలో జిల్లాలోని పలు పాఠశాలల్లో జన్మనిచ్చిన తల్లిదండ్రుల విలువను, ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పెద్దల విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తే పరువు పోవడంతో పాటు సమాజంలో గౌరవం తగ్గుతుందన్న భావన బలంగా నాటుకునేలా ఈ తరం బాలబాలికలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


పెద్దల సాన్నిహిత్యంతో మంచి ప్రవర్తన..
భాస్కరనాయుడు, మానసిక, వ్యక్తిత్వ, వికాస నిపుణులు  
చాలామంది చిన్నారులు తాతయ్య, అమ్మమ్మ, నానమ్మల ఆప్యాయతనే కోరుకుంటారని మానసిక, వ్యక్తిత్వ, వికాస నిపుణులు ఆచార్య భాస్కరనాయుడు చెబుతున్నారు. కథల కాలక్షేపంతో మొదలయ్యే కబుర్లు వారి సాన్నిహిత్యంలో గడిపే పిల్లల్లో మంచి ప్రవర్తన, నడవడిక కలిగి భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని పేర్కొంటున్నారు. పిల్లలతో సంతోషంగా గడిపే పెద్దల్లో ఆయువు పెరుగుతుందని అంటున్నారు. నిరాదరణకు గురైన వారు ఒంటరితనం ఆవరించి దిగులు వంటి మానసిక బాధతో అనారోగ్యానికి గురై మంచాన పడుతున్నారన్నారు. వారందిస్తున్న సూచనలిలా..
* ముదిమి వయసు వారికి భారంగా భావించడం వల్ల పిల్లల ఆలనలో లోపాలు కనిపిస్తాయని తెలుసుకోవాలి. ః బాల్య దశ నుంచి సామాజిక బాధ్యత తెలుసుకునే వరకు పిల్లలకు తల్లిదండ్రుల కన్నా, తాతయ్య, నానమ్మలే మంచి స్నేహితులు. తల్లిదండ్రులను మనం ఎంత బాగా చూసుకుంటామో మన పిల్లలు కూడా మనలను అంతే బాగా చూసుకుంటారన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.


నిరాదరణకు గురి చేస్తే చర్యలు..
రాజశేఖర్‌, సీఐ, వికారాబాద్‌
దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం తల్లిదండ్రులను, ఇతర వయసు మీరిన కుటుంబ సభ్యులను నిరాదరణకు గురి చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఉద్యోగస్థులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేస్తున్న ఎవరైనా తల్లిదండ్రులను పట్టించుకోకుంటే న్యాయస్థానం తీర్పు ప్రకారం వారి వేతనంలో నుంచి నెలనెలా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులకు కూడా ఆస్తి విలువను బట్టి చెల్లింపులు చేస్తారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని