Suicide: మరదలిని ప్రేమించినందుకు వేధింపులు.. ఉరేసుకొని బావ ఆత్మహత్య
eenadu telugu news
Updated : 27/10/2021 07:16 IST

Suicide: మరదలిని ప్రేమించినందుకు వేధింపులు.. ఉరేసుకొని బావ ఆత్మహత్య

గుంతబాస్పల్లి (తాండూరు గ్రామీణ), న్యూస్‌టుడే: వరసకు మరదలు అయ్యే యువతిని బావ ప్రేమించాడు. వద్దని బెదిరిస్తూ మేనత్త, మేనమామలు వేధించారు. దీంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన తాండూరు మండలం గుంతబాస్పల్లిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఏడుకొండలు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన సందప్ప కర్ణాటక సరిహద్దు సిమెంటు కర్మాగారంలో కీమెన్‌గా పని చేస్తున్నాడు. ఇతని భార్య దస్తమ్మ కూలీ. వీరికి ముగ్గురు సంతానం. మొదటి కుమారుడు సంతోష్‌యాదవ్‌ పట్టణంలోని గాంధీనగర్‌లో నివాసముండే మేనత్త దేవమ్మ కూతురును ప్రేమించాడు. ఈ విషయం ఇష్టంలేకపోవడంతో దేవమ్మ రెండు రోజుల క్రితం పట్టణ పోలీసులను ఆశ్రయించింది. వారిని ఠాణాకు రప్పించిన పోలీసులు యువతి జోలికి వెళ్ల వద్దంటూ యువకుడికి ఈనెల 24న కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. సోమవారం ఉదయం నుంచి మేనత్త, మేనమామ శేఖర్‌లు యువకునికి తరచూ ఫోన్‌ చేసి చంపుతామని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు మంగళవారం తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇందుకు కొన్ని క్షణాల ముందు యువకుడు తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ స్వీయ చిత్రీకరణ (సెల్ఫీ వీడియో)ను తన వాట్సాప్‌ ద్వారా స్నేహితులకు పంపించాడు. దాన్ని పరిశీలించిన స్నేహితులు, గ్రామస్థులంతా ఒక్కసారిగా పొలం వద్దకు చేరుకొని గాలించారు. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ సత్తయ్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని తరలించేక్రమంలో మృతుని కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు ఆందోళనకు దిగారు. వేధింపులకు పాల్పడ్డ శేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా కుటుంబ సభ్యులు, బంధువులు వెంబడించి కొట్టేందుకు యత్నించారు. ఎస్‌ఐ ఏడుకొండలు అధ్వర్యంలో పోలీసు సిబ్బంది వారించారు. నిందితున్ని తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎస్‌ఐ వారందరికీ సర్దిచెప్పి నిందితుడిని పోలీసు జీపులో గౌతాపూర్‌ ఠాణాకు తరలించారు. అందరితో కలుపుగోలుగా ఉండే యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని